అమెరికాలో ఏటా రికార్డు స్థాయిలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ పెరుగుదలకు ప్రధానంగా భారతదేశం నుంచి వెళ్లే విద్యార్థులు అధికమవుతుండడం కారణంగా నిలిచింది. తాజాగా ఓపెన్ డోర్స్ 2025 నివేదికలోని వివరాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. యూఎస్‌లో దాదాపు ముగ్గురు అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారతీయులే ఉండడం గమనార్హం. 2024-25 విద్యా సంవత్సరంలో భారతీయ విద్యార్థుల నమోదు 3,63,019కు చేరుకుంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9.5 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
యూఎస్ వెళ్లే భారతీయ విద్యార్థులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. ప్రాడిజీ ఫైనాన్స్ డేటా ప్రకారం ఇండోర్, భువనేశ్వర్, పంజాబ్, సూరత్, కోయంబత్తూర్, మైసూరు, నాగ్‌పుర్.. వంటి టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి యూఎస్ వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
ఈ విద్యార్థులు తరచుగా ఉపాధ్యాయులు, చిన్న వ్యాపార యజమానులు, మిడ్ కెరియర్ నిపుణుల కుటుంబాల నుంచి ఎక్కువగా ఉన్నారు.
STEM కోర్సులు
2024-25లో యూఎస్ మొత్తంగా 11,77,766 అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 4.5 శాతం ఎక్కువ. యూఎస్‌లోని ప్రతి 10 మంది భారతీయ విద్యార్థుల్లో దాదాపు 7 మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సుల్లో చేరుతున్నారు.
43.4% మంది భారతీయ విద్యార్థులు గణితం, కంప్యూటర్ సైన్స్ లో చేరారు.
22.8% మంది ఇంజినీరింగ్ కోర్సులను ఎంచుకున్నారు.
ఓపీటీ..
అమెరికా అందిస్తున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)కు ఆదరణ పెరుగుతోంది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లు దేశీయ శ్రామిక శక్తిలోకి ప్రవేశించడానికి ఓపీటీ ఎంతో తోడ్పడుతుంది. భారతీయ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ముఖ్యంగా STEMలో H-1B వీసాలు లేదా ఇతర వర్గాలకు మారడానికి ముందు వృత్తిపరమైన అనుభవాన్ని పొందడానికి ఓపీటీని ఉపయోగించుకుంటున్నారు.
ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్.. వివరాలివే..


