ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో కేశవరావు, సుదర్శన్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, రామకృష్ణారావు తదితరులు
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ వేగం పెంచాలి
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
బాలికలకు తొలి ప్రాధాన్యమివ్వాలి
జూన్ 12 నుంచి బడుల్లో అల్పాహారం
ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి
సాక్షి, హైదరాబాద్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం పనులను ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని, రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గురువారం విద్యారంగంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యకు సంబంధించిన పలు అంశాలపై సీఎం దృష్టి పెట్టారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు, నిర్మాణ డిజైన్లను కన్సల్టెన్సీ సంస్థలు ఆయనకు వివరించాయి. కాగా రెండేళ్ళలో అన్ని స్కూళ్ళ నిర్మాణం పూర్తి చేసి, తరగతులు మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. బాలికలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ జిల్లాల వారీగా బాలురు, బాలికల వివరాలు తెప్పించాలని ఆదేశించారు. ఈ స్కూళ్లకు అవసరమైన బడ్జెట్ విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
నాణ్యతలో రాజీ పడొద్దు..
‘అక్షయ పాత్ర భాగస్వామ్యంతో జూన్ నుంచి పాఠశాల విద్యార్థులకు అందించే అల్పాహారంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఈ పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అందించే భోజనం నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలి. వంటకు సోలార్ పవర్‌ను వాడుకునే అంశాన్ని పరిశీలించాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 23 కొత్త పాఠశాల భవనాలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి రావాలి. బాచుపల్లి పాఠశాల భవన నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న స్థలానికి సమీపంలో ఎకరంన్నర కేటాయించాలి..’అని సీఎం ఆదేశించారు.
ఖర్చుతో కూడిన ప్రతిపాదనలు తేవద్దు
ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక వసతుల కల్పన, భవనాల మరమ్మతులతో పాటు పలు అంశాలను పాఠశాల విద్యా కమిషనర్ ప్రస్తావించారు. అయితే ఖర్చుతో కూడిన ప్రతిపాదనలు ప్రస్తుతానికి వద్దని ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం. ఎంఈవో పోస్టుల భర్తీని కూడా సీఎం వ్యతిరేకించినట్టు తెలిసింది. రాష్ట్రంలో విద్యార్థుల నిష్పత్తి కన్నా టీచర్లు ఎక్కువగా ఉన్నారని, హేతుబదీ్ధకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ: సీఎం
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురానున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిపై అధ్యయనం కోసం ఓ కమిటీ ఏర్పాటు చేశామని, త్వరలోనే పాలసీని ప్రకటిస్తామని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రోహిత్‌కుమార్ నేతృత్వంలోని ఆ రాష్ట్ర బృందం గురువారం సచివాలయంలో సీఎంను మర్యాపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు రవాణా సదుపాయం కల్పించాలని యోచిస్తున్నామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. కాగా దీనిపై సమగ్ర నివేదికను అందించాలని హిమాచల్‌ప్రదేశ్ మంత్రి సీఎంను కోరారు.
నేడు రావిర్యాలలో సీఎం పర్యటన
తుక్కుగూడ: సీఎం రేవంత్ గురువారం రావిర్యాలలో పర్యటించనున్నారు. మంఖాల్ డివిజన్ పరిధిలోని ఫ్యాబ్‌సిటీలో మనీషా గ్రూప్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించిన సుజిన్ మెడికే ర్ ప్రైవేటు లిమిటెడ్ ఐవీ ద్రవం తయారీ కంపెనీని ఉదయం 10 గంటలకు సీఎం ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు.
భవిష్యత్తులో ఇంటర్ బోర్డు ఉండదు!
పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీలుగా ఉన్నతీకరించాలన్న ప్రతిపాదనపై సీఎం అనేక ప్రశ్నలు సంధించారు. ఇదెలా సాధ్యమని, అనుబంధ గుర్తింపు ఎలా వస్తుందని, ఏఐసీటీఈ అనుమతి ఇస్తుందా? అని ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం ప్రతిపాదనను కూడా తోసిపుచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అందుబాటులోకి వస్తే 12వ తరగతి వరకూ అక్కడే ఉంటుందని, భవిష్యత్తులో ఇంటర్ బోర్డు ఉండదని సీఎం అన్నట్టు తెలిసింది. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, పి.సుదర్శన్‌రెడ్డి, సీఎంఓ, విద్యాశాఖ ఉన్నతాధికారులు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


