తిరువనంతపురం: రండి బాబు రండి అమెరికాకు వెళ్లాలనుకుంటున్నారా? మీకు విద్యార్థత లేదు. మరేం ఫర్లేదు. డబ్బులు ఉంటే చాలు.. అమెరికాకు కాదు.. అంతరిక్షానికైనా పంపిస్తామంటూ పలువురు కేటు గాళ్లు అమాయకులకు వల వేస్తున్నారు. కోరుకున్న జీవితం, కోరుకున్న జీతం రావడంతో పలువురు నమ్మి మోసపోతున్నారు. వలసదారులపై ట్రంప్ విధిస్తున్న ఆంక్షలకు బలవుతున్నారు. కాళ్లు,చేతులకు సంకెళ్లు వేయించుకుని మరీ స్వదేశాలకు వస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఉదంతమే అందుకు ఉదాహరణ
నల్లగొండ జిల్లా పరేపల్లిగూడేనికి చెందిన పకీర్ గోపాల్‌రెడ్డి నకిలీ విద్యార్హత పత్రాలతో అమెరికా వెళ్లి ఉద్యోగం పొందాడనే ఆరోపణలపై అక్కడి అధికారులు అతడిని డిపోర్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆర్‌జీఐఏ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గోపాల్‌రెడ్డి మధురై కామరాజ్ యూనివర్శిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ పూర్తి చేశానని నకిలీ సర్టిఫికెట్ పొందాడు. దీని ఆధారంగా స్టూడెంట్ వీసా తీసుకుని 2023 సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లి, డల్లాస్‌లోని వెబ్‌స్టర్ యూనివర్సిటీలో మాస్టర్స్‌లో చేరాడు. కానీ అతడు సమర్పించిన డిగ్రీ నకిలీదని తేలడంతో అమెరికా అధికారులు అతడిని తిరిగి పంపించారు. విచారణలో గోపాల్‌రెడ్డి ఆ సర్టిఫికెట్‌ను రూ.80 వేలకే కొనుగోలు చేశానని అంగీకరించాడు.
ఈ కేసు తీగ లాగిన సైబరాబాద్ పోలీసులు కేరళలోని మలప్పురం జిల్లా పొన్నానిలో ఉన్న మార్క్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌పై దాడి చేశారు. అక్కడి పోలీసులు వేల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్ విలువ దాదాపు రూ.750 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మార్క్ సంస్థ నిర్వాహకుడు అర్షద్‌ను పట్టుకున్న పోలీసులు విచారించగా, ఈ సర్టిఫికెట్లు తిరుర్‌లోని ఫోర్సా మాల్‌లో ఉన్న ఎడుహబ్ కన్సల్టెన్సీ నుంచి వస్తున్నాయని బయటపెట్టాడు. అక్కడి నుంచి వందల సర్టిఫికెట్లు సీజ్ చేశారు. ఈ తయారీలో పయ్యనంగడికి చెందిన అబ్దుల్ నిస్సార్ కీలక పాత్ర పోషించినట్లు తేలడంతో అతడినీ అరెస్టు చేశారు.
ఈ ముఠా దేశవ్యాప్తంగా వేల మందికి నకిలీ విద్యార్హత పత్రాలు సరఫరా చేసింది.ఎస్సెస్సీ, ప్లస్ టూ, బీఏ, బీకాం, ఎంబీఏ, ఎంకామ్, బీఎస్సీ, బీఈడీ, బీటెక్‌లతో పాటు ఎల్‌ఎల్‌బీ, పీజీ కోర్సులు, పీహెచ్‌డీ వరకు అన్ని స్థాయిలలో సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించారు. ఒక్కో సర్టిఫికెట్‌ను రూ.25 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు అమ్మారు. తిరూర్ ఈస్ట్‌లోని చెంబ్రాకు చెందిన ధనీష్ ధర్మన్ ఈ రాకెట్‌కు నాయకుడు. అతడు ‘డానీ’ అనే పేరుతో నకిలీ సర్టిఫికెట్ల వ్యాపారం నడిపాడు. తమిళనాడులోని శివకాశీలో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసి, ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు, పీఎఫ్, ఇతర సౌకర్యాలు కూడా కల్పించాడు. శివకాశీ ప్రింటింగ్ ప్రెస్‌కు చెందిన జైనుల్ అబీదీన్ అరెస్టుతో డానీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ధనీష్ 2011లో కూడా నకిలీ సర్టిఫికెట్ల కేసులో పట్టుబడ్డాడు. అప్పట్లో బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ ఈ దందా మొదలుపెట్టాడు.
ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.20 వేల రూపాయలు వసూలు చేస్తూ, ధనీష్ 10 ఏళ్లలో రూ.100 కోట్లకు పైగా సంపాదించాడు. ఈ సంపాదనతో పుణే, దుబాయ్‌లో వ్యాపారాలు ప్రారంభించాడు. చివరకు కారవాన్‌లో ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మొత్తంగా, ఈ నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ కేరళ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించి, వందల కోట్ల రూపాయల స్కామ్‌గా మారింది. గోపాల్‌రెడ్డి కేసు ద్వారా ఈ భారీ నెట్‌వర్క్ గుట్టు రట్టు కావడం, విద్యార్హత పత్రాల మోసంపై పెద్ద ఎత్తున దర్యాప్తుకు దారితీసింది.


