రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌: సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు | Reliance Foundation Scholarships For Telugu States Students | Sakshi
Sakshi News home page

రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌: సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

Jan 7 2026 5:39 PM | Updated on Jan 7 2026 5:47 PM

Reliance Foundation Scholarships For Telugu States Students

రిలయన్స్ ఫౌండేషన్ 2025-26 విద్యా సంవత్సరానికి ప్రకటించిన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఈ రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 1,883 మంది విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌లకు ఎంపికయ్యారు.

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 5,100 మంది విద్యార్థుల్లో (5,000 అండర్ గ్రాడ్యుయేట్, 100 పోస్ట్ గ్రాడ్యుయేట్) ఆంధ్రప్రదేశ్ నుంచి 1,345 మంది, తెలంగాణ నుంచి 538 మంది ఉన్నారు. అత్యంత పోటీతో కూడిన జాతీయ స్థాయి ఎంపిక ప్రక్రియలో ఈ ఫలితాలు తెలుగు విద్యార్థుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి.

ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్యను అందించడమే ఈ స్కాలర్‌షిప్‌ల లక్ష్యం. ప్రతిభ మరియు ఆర్థిక స్థితి  (మెరిట్-కమ్-మీన్స్) ఆధారంగా ఎంపిక చేసిన వారిలో 83% మంది విద్యార్థులు, వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాల నుంచే రావడం విశేషం. ఇందులో బాలికలు మరియు దివ్యాంగ విద్యార్థులకు కూడా తగిన ప్రాధాన్యం లభించింది.

ఎంపికైన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ. 2 లక్షల వరకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ. 6 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఆర్థిక సాయంతో పాటు, విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దేందుకు మెంటరింగ్, లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ శిక్షణ, గ్లోబల్ అల్యూమిని నెట్‌వర్క్ సహకారం కూడా లభిస్తుంది.

తెలంగాణ నుంచి ఎంపికైన వారిలో భద్రాచలానికి చెందిన రైతు బిడ్డ యర్ర షాలిని ఒకరు. ప్రస్తుతం పంజాబ్‌లోని ఐఐటీ రోపర్‌లో BSc, BEd  కోర్సు చదువుతున్న షాలిని తన అనుభవాన్ని పంచుకుంటూ.. "మాలాంటి వ్యవసాయ కుటుంబాల పిల్లలకు ఆర్థిక ఇబ్బందులే ఉన్నత విద్యకు అడ్డంకిగా మారుతుంటాయి. ఈ స్కాలర్‌షిప్ వల్ల నేను నా చదువుపై పూర్తి దృష్టి పెట్టగలను. నా లక్ష్యాలను సాధించడానికి ఇది గొప్ప ప్రోత్సాహం, భవిష్యత్తులో కష్టపడి పనిచేసి సమాజానికి సేవ చేసేందుకు ఇది నన్ను ప్రేరేపిస్తుంది," అని అన్నారు.

ఇప్పటివరకు రిలయన్స్ ఫౌండేషన్ వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 33,471 స్కాలర్‌షిప్‌లను అందించి, వారికి అండగా నిలిచింది. రిలయన్స్ వ్యవస్థాపక ఛైర్మన్ ధీరుభాయ్ అంబానీ దార్శనికతతో, శ్రీమతి నీతా అంబానీ 2022లో ప్రకటించిన 10 ఏళ్లలో 50,000 స్కాలర్‌షిప్‌ల లక్ష్యంలో భాగంగా ఈ ఎంపిక జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement