కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అనేక మందికి బంగారం కేవలం ఆభరణంగా కాకుండా అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి సాధనంగా మారింది. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం తమ బంగారాన్ని అమ్మివేయడం లేదా తాకట్టు పెట్టడం సర్వసాధారణం. అయితే అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బంగారాన్ని సాధారణ పద్ధతిలో తాకట్టు పెట్టకుండా, అమ్ముకోకుండానే దాన్ని ఉపయోగించుకునే అద్భుతమైన మార్గం ఉంటే? అవును, అదే బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ (Overdraft on Gold Jewellery) సదుపాయం. పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో అనేక ప్రముఖ బ్యాంకులు తమ వినియోగదారులకు ఈ ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తూ వారి ఆర్థిక అవసరాలకు భరోసా కల్పిస్తున్నాయి.
గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే?
బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం అనేది ఒక రకమైన సురక్షితమైన రుణం (Secured Loan). ఇది వ్యక్తిగత రుణం లాంటిది కాకుండా, ఒక క్రెడిట్ లైన్‌లాగా పనిచేస్తుంది. సాధారణంగా గోల్డ్ లోన్‌లో ఒకేసారి మొత్తం డబ్బు తీసుకుని దానిపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయంలో మీ బంగారు ఆభరణాల విలువను బట్టి బ్యాంక్ నిర్దిష్ట పరిమితి(Limit)తో రుణాన్ని మంజూరు చేస్తుంది. వినియోగదారుడు ఈ పరిమితి నుంచి అతనికి అవసరమైన మేరకు ఎప్పుడైనా, ఎంతైనా డబ్బును డ్రా చేసుకునే సౌలభ్యం ఉంటుంది.
మీరు డ్రా చేసుకున్న అసలు మొత్తంపై (Utilised Amount) మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మంజూరైన మొత్తం పరిమితిపై కాదు. ఈ సౌకర్యం సాధారణంగా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు చెల్లుబాటు అవుతుంది. మీ సౌలభ్యాన్ని బట్టి క్రమానుగతంగా రుణం తిరిగి చెల్లించవచ్చు.
వినియోగదారులకు ఉపయోగాలు
బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ద్వారా వినియోగదారులకు కీలక ప్రయోజనాలు ఉన్నాయి. యూజర్లు డ్రా చేసుకున్న మొత్తానికే వడ్డీ లెక్కిస్తారు. ఉదాహరణకు, మీకు రూ.5 లక్షల పరిమితి మంజూరైతే అందులో రూ.2 లక్షలు మాత్రమే వాడుకుంటే ఆ రూ.2 లక్షలపై మాత్రమే వడ్డీ చెల్లించాలి.
ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలో నిధులు జమ చేయడం ద్వారా తీసుకున్న రుణాన్ని ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా పాక్షికంగా లేదా పూర్తిగా తిరిగి చెల్లించవచ్చు. నెలవారీ ఈఎంఐ (EMI) లాంటి కఠిన నిబంధనలు ఉండవు.
వ్యాపార అవసరాలు, వైద్య ఖర్చులు లేదా ఇతర అత్యవసరాల కోసం తక్షణమే నిధులు పొందవచ్చు.
గోల్డ్ లోన్ లేదా గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్‌లకు వ్యక్తిగత రుణాల కంటే వడ్డీ రేట్లు సాధారణంగా తక్కువగా ఉంటాయి.
బంగారు ఆభరణాలు సురక్షితంగా బ్యాంకు వాల్ట్‌లో ఉంటాయి. వాటిని అమ్ముకోవాల్సిన అవసరం లేదు.
బంగారం విలువను ఎలా లెక్కిస్తారు..
బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందడానికి వినియోగదారులు సాధారణంగా కొన్ని అర్హతలు కలిగి ఉండి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా 18 క్యారెట్ల (Carat) నుంచి 24 క్యారెట్ల మధ్య స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాలపై బ్యాంకులు ఓడీ ఇస్తాయి. వినియోగదారుడికి కావలసిన పరిమితిని బట్టి తగినంత బరువున్న బంగారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
బ్యాంక్ నియమించిన వాల్యుయేటర్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును నిర్ధారించి వాటి ప్రస్తుత మార్కెట్ విలువను లెక్కిస్తారు. ఈ విలువలో 70% నుంచి 75% వరకు ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని మంజూరు చేస్తారు.
ఛార్జీలు
బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ (OD) సౌకర్యాన్ని వినియోగించుకునేటప్పుడు వినియోగదారులు చెల్లించాల్సిన ప్రధాన ఛార్జీల్లో వడ్డీ రేటు ముఖ్యమైనది. ఓడీ పరిమితి నుంచి తీసుకున్న అసలు మొత్తానికి మాత్రమే లెక్కిస్తారు. ఈ వడ్డీ సాధారణంగా రోజువారీగా లెక్కిస్తారు. బ్యాంకును అనుసరించి సంవత్సరానికి 8% నుంచి 15% మధ్య మారుతూ ఉంటుంది.
కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇది బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి, అకౌంట్‌ను సెటప్ చేయడానికి వసూలు చేసే ఏకమొత్తం ఛార్జీ. ఈ ఫీజు సాధారణంగా మంజూరైన మొత్తం ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిలో 0.5% నుంచి 1.5% వరకు ఉంటుంది.
వాల్యుయేషన్ ఛార్జీలు.. బ్యాంక్ నియమించిన వాల్యుయేటర్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును తనిఖీ చేసి దాని ప్రస్తుత మార్కెట్ విలువను నిర్ణయిస్తారు. ఈ సర్వీసు కోసం వసూలు చేసే ఫీజునే వాల్యుయేషన్ ఛార్జీలు అంటారు. అలాగే రుణ ఒప్పందాలను చట్టబద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్టాంప్ డ్యూటీ ఛార్జీని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది.
ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని అందిస్తున్న బ్యాంకులు
1. ఫెడరల్ బ్యాంక్: డిజి గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ పథకం
2. సీఎస్‌బీ బ్యాంక్: ఓవర్ డ్రాఫ్ట్ గోల్డ్ లోన్ స్కీమ్
3. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB): టీఎంబీ గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్
4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India): బంగారు ఆభరణాలపై ఎస్ఓడీ (Secured Overdraft on Gold Ornaments - SOD).
ఇదీ చదవండి: ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్


