కంపెనీ ఎందుకిలా అడుగుతోంది? అమెజాన్‌ ఉద్యోగుల్లో ఆందోళన | Amazon asks Prove your worth why this making the workforce nervous | Sakshi
Sakshi News home page

కంపెనీ ఎందుకిలా అడుగుతోంది? అమెజాన్‌ ఉద్యోగుల్లో ఆందోళన

Jan 11 2026 2:42 PM | Updated on Jan 11 2026 3:29 PM

Amazon asks Prove your worth why this making the workforce nervous

అమెజాన్ తన ఉద్యోగుల వార్షిక పనితీరు సమీక్ష విధానంలో కీలక మార్పులు చేసింది. ఏడాది కాలంలో తాము సాధించిన ముఖ్యమైన విజయాలు మూడు నుంచి ఐదు పేర్కొనడంపాటు, కంపెనీలో మరింత వృద్ధి సాధించడానికి తాము తీసుకోవాల్సిన చర్యలను కూడా వివరించాల్సిందిగా సంస్థ ఉద్యోగులను కోరుతోంది. అసలే లేఆఫ్లు కొనసాగుతున్న తరుణంలో కంపెనీ ఎందుకిలా అడుగుతోందని ఉద్యోగుల్లో ఆందోళన పట్టుకుంది.

బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం, ఉద్యోగులు ఇప్పుడు తమ ప్రభావాన్ని స్పష్టంగా చూపించే ప్రాజెక్టులు, లక్ష్యాలు లేదా కార్యక్రమాల నిర్దిష్ట ఉదాహరణలను వార్షిక సమీక్షలో భాగంగా సమర్పించాలి. “ఫోర్టే” (Forte)అనే ఈ కొత్త కార్యక్రమం ద్వారా, అమెజాన్ ఉద్యోగులు తమ విలువను నిరూపించుకునేలా తొలిసారిగా వ్యక్తిగత సాఫల్యాల జాబితాలను తప్పనిసరి చేసింది. ఇంతకుముందు అమెజాన్ పనితీరు సమీక్షలు మరింత ఓపెన్-ఎండెడ్‌గా ఉండేవి. ఉద్యోగులను వారి “సూపర్ పవర్స్” ఏమిటో, లేదా వారు అత్యుత్తమంగా పనిచేసే సమయంలో ఎలా వ్యవహరిస్తారో ప్రతిబింబించమని మాత్రమే అడిగేవారు. అయితే కొత్త విధానం స్పష్టమైన మార్పును సూచిస్తోంది.

ఈ కొత్త వ్యవస్థతో అమెజాన్ కొలవదగిన ఫలితాలపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. అదే సమయంలో, ఉద్యోగులు తీసుకున్న రిస్కులు లేదా పూర్తిగా విజయవంతం కాకపోయిన ఆవిష్కరణల గురించి కూడా ప్రస్తావించమని అడుగుతోంది. “విజయాలు అనేవి మీ పని ప్రభావాన్ని చూపించే నిర్దిష్ట ప్రాజెక్టులు, లక్ష్యాలు, కార్యక్రమాలు లేదా ప్రక్రియలలో చేసిన మెరుగుదలలు. ఆశించిన ఫలితాలు రాకపోయినా, మీరు రిస్క్ తీసుకున్న లేదా ఆవిష్కరణ చేసిన సందర్భాలను పరిగణనలోకి తీసుకోండి” అంటూ అమెజాన్ అంతర్గత మార్గదర్శకాల్లో సూచించింది.

ఆందోళన ఎందుకంటే..

అమెజాన్‌లో ఫోర్టే సమీక్ష ప్రక్రియ వేతన నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగులు జాబితా చేసిన వారి విజయాలు, సహోద్యోగుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్, అమెజాన్ నాయకత్వ సూత్రాలకు వారు ఎంతవరకు కట్టుబడి ఉన్నారు, అలాగే ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాల ఆధారంగా వారి మేనేజర్లు అంచనా వేస్తారు. ఈ అంశాలన్నింటి ఆధారంగా ఉద్యోగికి “మొత్తం విలువ” (Overall Value) రేటింగ్ కేటాయిస్తారు. ఇది వార్షిక వేతనాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement