ఎగుమతులకు సర్‌చార్జీల మోత | Global shipping costs have gone up since the US-Israel attacks on Iran | Sakshi
Sakshi News home page

ఎగుమతులకు సర్‌చార్జీల మోత

Mar 6 2026 1:19 AM | Updated on Mar 6 2026 1:19 AM

Global shipping costs have gone up since the US-Israel attacks on Iran

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో  షిప్పింగ్‌ లైన్స్‌ డిమాండ్‌లు

రూ. 4,000 వరకు అదనపు భారం 

ఎగుమతిదారుల గగ్గోలు

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధంతో దేశీయంగా ఎగుమతిదారులకు షిప్పింగ్‌ సర్‌చార్జ్‌ల రూపంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులను సాకుగా చూపి షిప్పింగ్‌ కంపెనీలు అదనంగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఎక్కువకాలం నిల్వ ఉండని ఉత్పత్తులను మోసుకెళ్లే 40 అడుగుల కంటైనర్లపై అదనంగా రూ. 4,000 మేర కంటింజెన్సీ సర్‌చార్జీలు ఇవ్వాలంటున్నాయని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ దాడి చేయడానికి ముందే కొన్ని కన్సైన్‌మెంట్లు గమ్యస్థానాలకు చేరినప్పటికీ, సరుకును రిలీజ్‌ చేయాలంటే అదనంగా చెల్లించాల్సిందేనని షిప్పింగ్‌ కంపెనీలు పట్టుబట్టి కూర్చున్నాయని వివరించారు. ‘ఫిబ్రవరి 28న యుద్ధం మొదలు కావడానికి ముందే  పశ్చిమాసియాలోని పోర్టులకు నౌకలు చేరుకున్నాయి. కానీ అధిక సర్‌చార్జీలు ఇవ్వాలంటూ, షిప్పింగ్‌ సంస్థలు డెలివరీ చేయడం లేదు. ఈ భారాన్ని ఎవరు భరించాలనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 

ఈ సమస్యను కేంద్ర వాణిజ్య శాఖ దృష్టికి తీసుకెళ్లాం‘ అని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ తెలిపారు. భారత్‌లో ఇంకా లోడ్‌ కాని వాటిపై చార్జీలు విధిస్తే అర్థం చేసుకోవచ్చు గానీ ఇప్పటికే గమ్యస్థానాలకు చేరిన వాటిపై కూడా విధించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. భారత ఎగుమతులపై భౌగోళికరాజకీయ పరిణామాల ప్రభావాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అంతర్‌ మంత్రిత్వ శాఖల బృందాన్ని ఏర్పాటు చేసింది. 2024–25 లో పశ్చిమాసియా దేశాలకు భారత్‌ నుంచి ఎగుమతులు 58.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  

కన్సైన్‌మెంట్స్‌ నిలిపివేత .. 
ఓవైపు అదనపు సర్‌చార్జీలతోనే సతమతమవుతుంటే మరోవైపు, పశ్చిమాసియా దేశాలకు కన్సైన్‌మెంట్స్‌ను తీసుకోవడాన్ని షిప్పింగ్‌ సంస్థలు నిలిపివేయడం ఎగుమతిదారులకు ఇంకో సమస్యగా మారింది.  నౌకలు నిల్చిపోయి కంటైనర్ల కొరత ఏర్పడటంతో సముద్ర మార్గంలో రవాణా వ్యయాలు 50 శాతం ఎగిసినట్లు ఎగుమతిదారులు చెప్పారు. అటు విమానాల ద్వారా రవాణా పెరిగినప్పటికీ ఇది ఖరీదైన వ్యవహారంగా ఉంటోంది.  కోల్‌కతా నుంచి పశ్చిమాసియాకు వెళ్లే కొన్ని ఎయిర్‌లైన్స్‌ సరుకు రవాణా చార్జీలను కేజీకి రూ. 175 నుంచి రూ. 425కి పెంచేశాయని సహాయ్‌ తెలిపారు. ఈ సవాళ్ల వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో దేశీ ఉత్పత్తుల ధరలు పెరిగిపోయి, మన పోటీ సామర్థ్యాలకు ప్రతికూలంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement