అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన మహిళను చైనా అధికారులు షాంఘై విమానాశ్రయంలో 18 గంటల పాటు అక్రమంగా నిర్బంధించిన ఘటనలో చైనా స్పందించింది. షాంఘై విమానాశ్రయంలో భారతీయ మహిళను వేధించారనే ఆరోపణలను చైనా ఖండించింది. థాంగ్డోక్‌కు ఎదురైన అనుభవంపై స్పందన కోరగా, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఆ మహిళ ఆరోపించినట్లుగా ఎటువంటి తప్పనిసరి చర్యలు, నిర్బంధం లేదా వేధింపులకు లేవని పేర్కొన్నారు.
లండన్ నుంచి జపాన్‌కు ప్రయాణిస్తున్నకి షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో భారతీయ మహిళలను అడ్డుకున్న దుమారం రేగిన ఒక రోజు తరువాత డ్రాగన్ కంట్రీ దీనిపై వివరణ ఇచ్చింది. నవంబర్ 21న లండన్ నుండి జపాన్‌కు ప్రయాణిస్తున్న యూకేకి చెందిన భారతీయ పౌరురాలు పెమా వాంగ్‌జోమ్ థాంగ్‌డాక్, పాస్‌పోర్ట్‌లో జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని పేర్కొనడంపై ఎయిర్‌పోర్ట్ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది తనను ఆపారని తెలిపింది. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీసుకున్న చర్యలు చట్టాలు , నిబంధనల ప్రకారం ఉన్నాయని పేర్కొంటూ ఈ సందర్భంగా వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది.
కాగా అరుణాచల్ చైనా భూభాగం అంటూ షాంఘైలో విమానంలో దిగిన థాంగ్లో పాస్‌పోర్ట్‌ను చూసిన చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తించిన వెంటనే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం, కనుక ఇండియన్ పాస్‌పోర్ట్ చెల్లదని వాదించి అవమానించి వేధింపులకు గురిచేశారు. తదుపరి విమానం ఎక్కకుండా, కనీసం ఆహారం ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె థాంగ్‌డోక్ తన స్నేహితుడి ద్వారా షాంఘైలోని భారతీయ కాన్సులేట్‌కు సమాచారం అందించింది. భారతీయ అధికారుల జోక్యం తర్వాత ఆమెను రాత్రి ఆలస్యంగా విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.


