చైనీస్ టెక్ కంపెనీ అయిన అపోలో గో అరుదైన ఘనత సాధించింది. దుబాయ్లో డ్రైవర్‌లెస్ కార్ల పరీక్షకు అనుమతి పొందిన ఏకైక కంపెనీగా నిలిచింది. దుబాయ్ రోడ్లు, రవాణా అథారిటీ (RTA) పూర్తి డ్రైవర్‌లెస్ పరీక్ష అనుమతిని మంజూరు చేసింది. దీంతో డ్రైవర్ సీటులో వ్యక్తి లేకుండా వేగంగా వెళ్లే కార్లు దుబాయ్ రోడ్లపై కనిపించనున్నాయి.
కాగా.. 2026 మొదటి అర్ధభాగం నాటికి వాణిజ్య ప్రాతిపదికన పూర్తిగా డ్రైవర్‌లెస్ టాక్సీ సేవలను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా దుబాయ్ రోడ్లపై వెయ్యికి పైగా వాహనాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ వినూత్న సాంకేతికత సజావుగా సాగేందుకు వీలుగా దుబాయ్‌లోని మిడిల్ ఈస్ట్‌లో మొట్టమొదటి 'ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్'ను కూడా కంపెనీ ప్రారంభించింది. వాహన నిర్వహణ, భద్రతా తనిఖీలు, నిపుణుల శిక్షణ అన్నీ ఈ హబ్‌లో నిర్వహిస్తారు.
2030 నాటికి దుబాయ్ మొత్తం ట్రాఫిక్‌లో 25 శాతం డ్రైవర్‌లెస్ వాహనాలుగా మార్చాలనే పాలకుల నిర్ణయానికి ఈ చర్య ప్రోత్సాహకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆధునిక రవాణా వ్యవస్థలను వేగంగా అవలంబిస్తున్న దుబాయ్ పరిస్థితి వారి సాంకేతికతకు ఉత్తమంగా సరిపోతుందని చైనాకు చెందిన బైడు ఉపాధ్యక్షుడు వాంగ్ యున్‌పెంగ్ అన్నారు.
కాగా.. గత మార్చిలో ఆర్టీఏతో కుదుర్చుకున్న ఒప్పందం తర్వాత కంపెనీకి జూలైలో టెస్ట్ లైసెన్స్ మంజూరు చేశారు. సురక్షితమైన, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా స్మార్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలో ప్రపంచ మోడల్‌గా మారాలని దుబాయ్ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే నెలల్లో దుబాయ్‌లో రద్దీగా ఉండే వీధుల్లో డ్రైవర్‌లెస్ కార్లు పరీక్షించనున్నారు.


