రష్యా నుంచి చమురు కొంటే సుంకాల మోత
భారత్, చైనాను కట్టడి చేయడమే లక్ష్యంగా అమెరికా చర్యలు
‘శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025’ బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్
బిల్లుపై వచ్చే వారమే అమెరికా కాంగ్రెస్‌లో ఓటింగ్
ఆమోదం పొందితే టారిఫ్‌లు విధించే అధికారం ట్రంప్‌కు.. రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం వెల్లడి
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించాలన్న పట్టుదలతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో టారిఫ్ బాంబు సిద్ధం చేశారు. అమెరికా హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై ఏకంగా 500% టారిఫ్‌లు విధించడానికి ఉద్దేశించిన బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రష్యా నుంచి చమురు ఎవరూ కొనకుండా ఆంక్షలు విధించబోతున్నారు. ఆంక్షలను ఉల్లంఘించే దేశాలపై సుంకాల మోత మోగనుంది. ఈ మేరకు రూపొందించిన బిల్లుపై అమెరికా కాంగ్రెస్‌లో త్వరలోనే ఓటింగ్ జరగనుంది.
అక్కడ ఆమోదం పొందితే భారత్, చైనా ఉత్పత్తులపై 500 శాతం సుంకాలు విధించే అధికారం ట్రంప్‌కు లభిస్తుంది. రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ విషయం వెల్లడిస్తూ ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఆయన బుధవారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. అధ్యక్షుడితో చాలా ఫలవంతమైన చర్చ జరిగిందని, బిల్లును ఆమోదించారని స్పష్టంచేశారు. ‘‘శాంతి కోసం ఉక్రెయిన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని మెట్లు దిగిరావడానికి కూడా సిద్ధపడుతోంది. రష్యా అధినేత పుతిన్ శాంతికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే ఉక్రెయిన్‌లో రక్తపుటేర్లు పారిస్తున్నారు. అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారు.
రష్యా యుద్ధ యంత్రానికి ఇంధనం సమకూరుస్తున్న దేశాలను శిక్షించక తప్పదు. రష్యా నుంచి ఇబ్బడిముబ్బడిగా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌లో మారణహోమానికి పరోక్షంగా సహకరిస్తున్న దేశాలపై భారీగా సుంకాలు విధించే అధికారం ట్రంప్‌కు దక్కబోతోంది. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యా నుంచి ఇప్పటికీ చమురు కొంటూనే ఉన్నాయి. ఈ కొనుగోళ్లు ఆగాలంటే సుంకాల కొరడా ప్రయోగించాల్సిందే’’అని లిండ్సే గ్రాహం తేల్చిచెప్పారు. సుంకాల బిల్లుకు కాంగ్రెస్‌లో తప్పనిసరిగా ఆమోదం లభిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. వచ్చేవారమే బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
ఇతరులకు విక్రయించినా వాత తప్పదు
భారతదేశ ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే 50 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. ఇందులో 25 శాతం సుంకాలను రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ప్రతీకారంగా విధించారు. తాజాగా రూపొందించిన ‘శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025’బిల్లు కూడా ఆమోదం పొందితే సెకండరీ టారిఫ్‌లు, అంక్షలు అమల్లోకి వచ్చి మొత్తం సుంకాలు ఏకంగా 550 శాతానికి చేరుతాయనడంలో సందేహం లేదు. రష్యా నుంచి చమురు కొనడమే కాకుండా దాన్ని ఇతరులకు విక్రయించుకొనే దేశాలపై 500 శాతం సుంకాలు విధించాలన్న ప్రతిపాదనను బిల్లులో చేర్చారు.
భారత్‌లోని చమురు సంస్థలు రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటూ.. శుద్ధి చేసి యూరప్ దేశాలకు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా చమురుతో భారత కంపెనీలు భారీగా లాభపడుతున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు కీలకమైన వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య చురుగ్గా చర్చలు కొనసాగుతున్న సమయంలోనే కొత్త ఆంక్షలను ట్రంప్ సర్కార్ తెరపైకి తీసుకురావడం గమనార్హం.
‘పుతిన్ కస్టమర్ల’పై ఒత్తిడి పెంచాల్సిందే
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించుకుంటామని భారత్ తమకు హామీ ఇచ్చిందని లిండ్సే గ్రాహం ఇటీవలే చెప్పారు. అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్రా నుంచి ఈ హామీ లభించిందని అన్నారు. టారిఫ్‌ల నుంచి ఇండియాకు ఉపశమనం కల్పించేలా ట్రంప్‌ను ఒప్పించాలంటూ తనను కోరారని తెలిపారు. గ్రాహం ఆదివారం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్‌తో కలిసి ప్రయాణించారు.
టారిఫ్ బిల్లు గురించి చర్చించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఆగాలంటే ‘పుతిన్ కస్టమర్ల’పై ఒత్తిడి పెంచాల్సిందేనని తేల్చిచెప్పారు. అందుకు ట్రంప్ తలూపారు. మొదట భారత్, చైనా వంటి దేశాలు దారికొస్తే చివరకు రష్యా కూడా దిగిరాక తప్పదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. వినయ్ క్వాత్రా గత నెలలో అమెరికా సెనేటర్లతో భేటీ అయ్యారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల తీరుపై మాట్లాడారు. భారత్–అమెరిఆ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి మద్దతివ్వాలని సెనేటర్లను కోరారు.
భారత్‌కు అతిపెద్ద ఎగుమతిదారు రష్యా
భారత తమ ముడి చమురు అవసరాలను తీర్చుకోవడానికి ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. 88 శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. 2021 కంటే ముందు ఇందులో రష్యా ముడి చమురు వాటా కేవలం 0.2 శాత ఉండేది. ప్రస్తుతం అది 40 శాతానికి చేరడం గమనార్హం. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించిన తర్వాత రష్యాపై పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. చమురు దిగుమతులను నిలిపివేశాయి.
దాంతో రష్యా ప్రభుత్వం తమ ముడి చమురును చౌక ధరకు భారత్, చైనాలకు విక్రయించడం ప్రారంభించింది. అమెరికా పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ అవి పట్టించుకోవడం లేదు. తమ అవసరాల కోసమే రష్యా చమురు కొనుగోలు చేసి, వాడుకుంటున్నామని, ఇందులో మరో దురుద్దేశం లేదని చెబుతున్నాయి. భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్న అతిపెద్ద దేశంగా రష్యా అవతరించింది. గత నెలలో రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున భారత్ దిగుమతి చేసుకుంది.
మరిన్ని కష్టాలు తప్పవా?
మరో 500 శాతం టారిఫ్‌లు అమల్లోకి వస్తే భారత్ పరిస్థితి ఏమటన్నదానిపై చర్చ జరుగుతోంది. అమెరికా ఇప్పటికే వసూలు చేస్తున్న 50 శాతం టారిఫ్‌లు వల్ల భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భారత్, అమెరికాల మధ్య గతంలో ఎన్నడూలేనంతగా సంబంధాలు దెబ్బతిన్నాయి. మొత్తం టారిఫ్‌లు 550 శాతానికి చేరితే భారత ఉత్పత్తులకు అమెరికాలో ధరలు పెరిగి, గిరాకీ పడిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా భారత్ నుంచి ఎగుమతులు తగ్గిపోతాయి. అంతిమంగా భారత ఉత్పత్తి సంస్థలు నష్టపోతాయి. దాంతో ఆ సంస్థలను మూసివేయడమో, అందులో పనిచేసే కార్మీకులను తగ్గించడమో జరుగుతుంది. అమెరికాకు కాకుండా ఇతర దేశాలకు ఎగుమతులు పెంచుకోవాల్సి ఉంటుంది. అంటే కొత్త మార్కెట్లను అన్వేíÙంచాలి.


