48 ఏళ్ల నిశ్శబ్దాన్ని చీల్చిన ఒకే ఒక్క ఈమెయిల్!
అది టోక్యో వీధి.. మధ్యాహ్నపు ఎండ.. నిత్యం కిటకిటలాడే ఆ నగరంలో ఒక వృద్ధుడు ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అతని కళ్లలో ఒక తరం కిందటి జ్ఞాపకం మెరుస్తోంది. సరిగ్గా 48 ఏళ్ల క్రితం విడిపోయిన తన ప్రాణ మిత్రుడు కనిపిస్తాడా? అసలు ఆ పాత ఈమెయిల్ చిరునామా ఇంకా పని చేస్తోందా?
అమ్మ దాచిన అపురూప నిధి
కథ అమెరికాలోని నార్త్ కరోలినాలో మొదలైంది. వాల్టర్ అనే వ్యక్తి.. తన తల్లి మరణానంతరం ఆమె పాత వస్తువులను సర్దుతున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. చనిపోవడానికి ముందు ఆమె రాసుకున్న పాత కాగితాల మధ్య.. ఒక చిరునామా, ఒక పాత ఈమె యిల్ ఐడీ కనిపించింది. అది 48 ఏళ్ల క్రితం తన ఇంట్లో ఎక్సే్ఛంజ్ స్టూడెంట్‌గా ఉన్న జపాన్ మిత్రుడు కజుహికోది. అతను వాల్టర్ ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. అలా వాల్టర్, కజుహికోలు చిన్నప్పుడే మంచి మిత్రులయ్యారు. వాల్టర్ తల్లికి కజుహికో అంటే చాలా ఇష్టం. ఆ అబ్బాయి సొంత కొడుకులా ఉండేవాడు. అందుకే ఆమె పాత కాగితాల్లో కజుహికో వివరాలను, ఆఖరికి అతని పాత ఈమెయిల్ చిరునామాను కూడా భద్రంగా రాసి పెట్టుకుంది.
ఆఖరి ప్రయత్నం ఫలించింది
నిజానికి 48 ఏళ్ల తర్వాత ఆ ఈమెయిల్ పని చేస్తుందని ఎవరూ అనుకోరు. కానీ జపాన్ వెళ్లే విమానం ఎక్కడానికి కొద్ది నిమిషాల ముందు, వాల్టర్ ఒక చిన్న సాహసం చేశాడు. ‘ఆ ఈమెయిల్ ఐడీ ఇప్పుడు పనిచేస్తుందో లేదో.. ఆ మిత్రుడు బతికే ఉన్నాడో లేదో’.. అన్న సందేహంతోనే ఒక మెయిల్ పంపాడు. విమానం దిగేసరికి అద్భుతం జరిగింది.. నాలుగు దశాబ్దాల నిశ్శబ్దాన్ని బద్ధలు కొడుతూ.. అవతలి వైపు నుండి సమాధానం వచ్చింది. జపాన్‌లో ఉన్న కజుహికో స్పందించాడు. కానీ వారి మధ్య భాష సమస్య ఎదురైంది. వాల్టర్ మిత్రుని భార్య నోబుకో మధ్యవర్తిగా మారి, వారిద్దరి మధ్య సందేశాలను అనువదించింది. చివరికి టోక్యోలో ఒక లంచ్ మీటింగ్ ఖరారైంది.
కన్నీటి ఆలింగనం
నిర్దేశించిన ప్రదేశంలో ఇద్దరూ కలుసు కున్నారు. 48 ఏళ్ల క్రితం యవ్వనంలో చూ సుకున్న ఆ ఇద్దరి కనులు.. ఇప్పుడు ముడతలు పడ్డ ముఖాల్లో ఒకరినొ కరిని గుర్తు పట్టా యి. ఇంకేమీ మా ట్లాడలేదు.. ఒకరి నొకరు గట్టిగా హత్తుకున్నారు. ఆ ఆలింగనంలో అర్ధ శతాబ్దపు ఎడబాటు, ఆనందం, కన్నీళ్లు అన్నీ కలిసిపోయాయి. ఈ దృశ్యం చూసిన వారందరి కనులు చెమర్చాయి.
స్నేహానికి ’ఎక్స్‌పైరీ డేట్’ లేదు!
వాల్టర్ కుమార్తె మెరెడిత్ డీన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. వారి ఆలింగనం చూసి సోషల్ మీడియా ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. చితికిపోయిన కాగితం మీద దొరికిన అక్షరం.. విడిపోయిన ఇద్దరు మిత్రులను కలిపింది. ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా, స్వచ్ఛమైన స్నేహానుబంధం ఏనాటికీ వాడిపోదని ఈ సంఘటన నిరూపించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


