గత ఏడాది(2025)లో నోబెల్ శాంతి బహుమతి పొందిన వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో ట్రంప్‌కు ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన నేపథ్యంలో, తన నోబెల్ పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అంకితం ఇస్తున్నట్లు ఆమె ప్రకటించడం సంచలనం రేపింది.
మచాడో నోబెల్ బహుమతిని ట్రంప్‌కు ఇచ్చేస్తారా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలో నోబెల్ కమిటీ స్పందించింది. నోబెల్ బహుమతిని పంచుకోవడం, రద్దు చేయడం, బదిలీ చేయడం సాధ్యం కాదంటూ నార్వేజియన్ నోబెల్ కమిటీ తేల్చి చెప్పింది. ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత, ఆ నిర్ణయం శాశ్వతంగా ఉంటుందంటూ కమిటీ పేర్కొంది. కాగా, నోబెల్ శాంతి బహుమతిని అందుకునేందుకు తనకంటే అర్హుడు ఈ చరిత్రలో ఎవరూ లేరంటూ వ్యాఖ్యానించిన ట్రంప్.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. ఏమీ చేయకపోయినా ఆయనకు ఆ గౌరవం దక్కిందంటూ వ్యాఖ్యానించారు.
వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో నోబెల్ గురించి శనివారం ట్రంప్ మరోసారి ప్రస్తావిస్తూ.. మాచాడో తన నోబెల్ బహుమతిని ఇవ్వాలనే ఆఫర్‌పై ఆమెతో చర్చిస్తానని తెలిపారు. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలాస్ మదురో పట్టుబడి అమెరికాకు తరలించబడిన తర్వాత, అమెరికా–వెనిజులా ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. ఆమె రావాలని అనుకోవడం మంచిదేనంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. నా దృష్టి అంతా ప్రజల ప్రాణాలు కాపాడటం పైనే ఉందన్న ట్రంప్ యుద్ధాలను ఆపడం ద్వారా కోట్లాది మందిని రక్షించానంటూ మరోసారి గొప్పలు చెప్పుకున్నారు.


