‘స్కై–డైనింగ్‌’ రెస్టారెంట్‌లో చిక్కుకున్న పర్యాటకులు | Kerala Tourists trapped in sky-dining restaurant in Idukki rescued | Sakshi
Sakshi News home page

‘స్కై–డైనింగ్‌’ రెస్టారెంట్‌లో చిక్కుకున్న పర్యాటకులు

Nov 29 2025 5:49 AM | Updated on Nov 29 2025 5:49 AM

Kerala Tourists trapped in sky-dining restaurant in Idukki rescued

సురక్షితంగా దించిన అగ్నిమాపక శాఖ

ఇడుక్కి (కేరళ): ఇడుక్కి జిల్లా అనాచల్‌ సమీపంలో ఒక క్రేన్‌ సహాయంతో సుమారు 150 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లిన ’స్కై–డైనింగ్‌’ రెస్టారెంట్‌లో కోజికోడ్‌కు చెందిన నలుగురు పర్యాటకులు, ఒక రెస్టారెంట్‌ ఉద్యోగి చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఆ రెస్టారెంట్‌ను పైకి లేపిన క్రేన్‌ మొరాయించడంతో ఈ ఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్రేన్‌ హైడ్రాలిక్స్‌ వ్యవస్థలో లోపం వల్ల.. రెస్టారెంట్‌ సుమారు వందడుగుల కంటే ఎక్కువ ఎత్తులో గాల్లో నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.

 సమాచారం అందుకున్న అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకల్లా.. తొలుత తల్లి, ఇద్దరు పిల్లలను కిందకు దించారు, ఆ తర్వాత తండ్రి, రెస్టారెంట్‌లోని మహిళా ఉద్యోగిని సురక్షితంగా రక్షించారు. రెస్టారెంట్‌ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని అగ్నిమాపక అధికారి, అడిమాలి పోలీసు అధికారి తెలిపారు. స్థానికులు అప్రమత్తం చేయడం వల్లే మున్నార్, అడిమాలి అగ్నిమాపక శాఖ యూనిట్లు హుటాహుటిన రంగంలోకి దిగాయని వారు స్పష్టం చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement