
నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
మనిషి మూడో కన్ను కెమెరా. రెండు కళ్లు చూడలేని దృశ్యాలను కెమెరా కన్ను చూస్తుంది. ఛాయాచిత్ర ప్రపంచంలో మహిళా ఫొటోగ్రాఫర్‌లు తమదైన ముద్ర వేసారు.
ప్రకృతి అందాలు మాత్రమే కాదు సామాన్యుల జీవితాలు, అణగారిన వర్గాల పోరాటాలు, భిన్నమైన సాంస్కృతిక అంశాలను ఫొటోగ్రఫీలోకి తీసుకువస్తున్నారు.
ఆ కెమెరా... అణగారిన వర్గాల గొంతుక
-భూమిక సరస్వతి
ప్రకృతి అందాలు మాత్రమే కాదు సామాన్యుల జీవితాలను, అణగారిన వర్గాల ఉద్యమాలను, దళిత, ఆదివాసీ జీవితాలను తన కెమెరా కంటితో చిత్రిస్తోంది భూమిక సరస్వతి. పర్యావరణ సంరక్షణపై దళిత, ఆదివాసీలు చేస్తున్న పోరాటాన్ని ‘అన్ ఈక్వల్ హీట్’ టైటిల్‌తో ఫొటో డాక్యుమెంటేషన్ చేసింది. భూమిక తన ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫొటోలను ఎక్కువగా చత్తీస్‌ఘడ్, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాల్లో తీసింది. ‘అన్ ఈక్వల్ హీట్’ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనుల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అదే పనిగా ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యానికి గురైన రోజులు ఉన్నాయి. అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతాల్లో కెమెరాతో వెళ్లడం అంటే ప్రమాదమే. వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్లింది.
అదర్ సైడ్
కేరళలోని కోజికోడ్‌కు చెందిన కీర్తన కున్నాత్ లండన్‌లో స్థిరపడింది. జెండర్ నుంచి మెంటల్ హెల్త్ వరకు ఎన్నో అంశాలపై ఫొటోసిరీస్ చేస్తుంటుంది కీర్తన. ఆమె తాజా ఫొటోసిరీస్... నాట్ వాట్ యూ సా. దక్షిణ భారత మహిళా బాడీబిల్డర్‌లపై చేసిన ఫొటోసిరీస్ ఇది. ఈ సిరీస్‌కు ‘అండర్ 30’ విభాగంలో ది రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్స్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ అవార్డ్ గెలుచుకుంది. ‘ఆత్మవిశ్వాసం మూర్తీభవించేలా ఈ మహిళలను చూపాలనుకున్నాను’ అని తన ఫొటో ప్రాజెక్ట్ గురించి చెబుతుంది కీర్తన. ‘నాట్ వాట్ యూ సా’ ఫొటో ప్రాజెక్ట్ కోసం అనలాగ్ మీడియం ఫార్మట్ కెమెరా మమియ 67 ఉపయోగించి కేరళ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో ఫొటో షూట్ చేసింది.
-కీర్తన కున్నాత్
డాటర్ ఆఫ్ రఘు రాయ్
చిన్నప్పుడు గిఫ్ట్‌గా కెమెరా అందుకున్న అవనీ రాయ్ అప్పటి నుంచి కెమెరాతో సుదీర్ఘ స్నేహం చేస్తూనే ఉంది. ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ కుమార్తెగా ఆమె ‘ఫొటోగ్రఫీ’ అనే ప్రపంచంలో పెరిగింది. ఎంతోమంది ఛాయాచిత్రకారుల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ‘తండ్రి స్టైల్లోనే’ అని అనిపించుకోవాలని అవనికి ఉండేది కాదు. అందుకే తనదైన దృశ్యభాషను రూపొందించుకుంది. కశ్మీర్ సమస్య నుంచి చెన్నై ప్రజల తాగునీటి కష్టాల వరకు ఎన్నో సామాజిక సమస్యలను డాక్యుమెంట్ చేసింది. కశ్మీర్‌కు సంబంధించి సబ్జెక్ట్, ఎమోషన్‌లను ‘ఉమెన్ ఆఫ్ కశ్మీర్’ ఫొటోసీరిస్‌లో హైలెట్ చేయడానికి బ్లాక్ అండ్ వైట్ ఫొటోగ్రఫీని ఉపయోగించుకుంది.
అవనీ రాయ్