కృష్ణకుమార్ ఓ సాధారణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అయితే నగరాల్లో నానాటికీ పెరుగుతున్న కాంక్రీటు జంగిల్స్, కాలుష్యం, వేడిని చూసి అందరిలాగే ఊరుకోలేదు. నగరాలలో పచ్చదనం లోపించడమే ఈ దుస్థితికి కారణం అని, అందువల్ల సహజమైన అడవులను నగరాల్లోనే పెంచాలనుకున్నాడు. అంతే! వెంటనే పర్యావరణ యోధుడిగా మారి, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో ‘మియావాకీ’ పద్ధతి ద్వారా పట్టణ అటవీకరణను ఉద్యమంలా చేపట్టాడు.. ఈ సందర్భంగా అతని గురించి...
వృత్తిరీత్యా ఇంజనీర్ కృష్ణకుమార్ ఎం.ఎస్.డబ్ల్యు చేశాడు. 2014లో తన కాలేజీ రోజుల్లో, సమాజంలోని మార్పు గురించి కేవలం చర్చించడం కంటే, ఆ మార్పు మన నుంచే ప్రారంభం కావాలని ‘తువక్కం’ అనే సంస్థను తన స్నేహితులతో కలిసి స్థాపించారు. తువక్కం అంటే తమిళంలో ప్రారంభం’ అని అర్థం.
2016లో వచ్చిన వార్దా తుపాను చెన్నైలోని వేలాది చెట్లను నేలకూల్చింది. అప్పటికే మొక్కలు నాటుతున్న కృష్ణకుమార్ బృందం సాధారణ పద్ధతిలో నాటే మొక్కలు పెరగడానికి ఎక్కువ సమయం పడుతుందని, అవి నగర వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్నాయని గుర్తించారు. ఈ క్రమంలోనే జపాన్ వృక్షశాస్త్రవేత్త అకిరా మియావాకి రూపొందించిన ‘మియావాకి పద్ధతి’ గురించి విన్నారు.
ఇదీ చదవండి: టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి
మియావాకి అడవుల సృష్టి
కృష్ణకుమార్ ఈ పద్ధతిని భారతీయ వాతావరణానికి అనుగుణంగా మార్చి చెన్నై, హైదరాబాద్‌లలో విజయవంతంగా అమలు చేశారు. చెన్నైలోని షోలింగనల్లూర్, ముగలివాక్కం వంటి ప్రాంతాల్లో సుమారు 40కి పైగా మియావాకి అడవులను తువక్కం టీమ్ అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు తమిళనాడులో 65,000కు పైగా దేశీయ మొక్కలను నాటారు. అలాగే హైదరాబాద్‌లో కూడా చెరువుల సమీపంలో, ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో దట్టమైన అడవులను సృష్టించారు. ఇవి నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించడానికి, భూగర్భ జలాల పెంపున కూ దోహదపడుతున్నాయి.
ఇదీ చదవండి: 498 ఏ, పొరుగింటి మహిళకు షాక్ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా?
ఇందులోని ప్రత్యేకతలేమిటి?
సాధారణ అడవుల కంటే ఇవి పదిరెట్లు వేగంగా పెరగడమే కాదు, 30 రెట్లు దట్టంగా కూడా ఉంటాయి. స్థానిక జాతులనే ఎంపిక చేయడం వల్ల జీవవైవిధ్యం పెరుగుతుంది. ఈ అడవుల పెంపుదలకు కేవలం 1000 చదరపు అడుగుల స్థలం కూడా సరిపోతుంది. అంతేకాదు, మొదటి 2–3 ఏళ్లు సంరక్షిస్తే చాలు, ఆ తర్వాత ఆ అడవి తనకు తానుగా ఎదుగుతుంది.
కేవలం మొక్కలు నాటడమే కాకుండా, పాఠశాల విద్యార్థులను, యువతను ఈ ఉద్యమంలో భాగ స్వాములను చేస్తున్నారు కృష్ణకుమార్ బృం. అంతేకాదు, పట్టణ అటవీకరణ వల్ల భూగర్భ జలాలు పెరగడం, ఉష్ణోగ్రతలు తగ్గడం వంటి ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు.
చెత్త కుప్పల్ని, ఖాళీ ప్లాట్లను పచ్చనివనాలుగా మార్చినందుకు ఐక్యరాజ్యసమితి ఇండియా నుండి ‘వి–అవార్డ్’ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలెన్నో కృష్ణకుమార్‌ను వరించాయి. కృష్ణకుమార్ నేతృత్వంలోని బృందాలు నేడు దక్షిణ భారతదేశంలోని మెట్రో నగరాల్లో పచ్చదనాన్ని నింపడంలో కీలకపాత్ర పోషిస్తు న్నాయి. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయన చూపిస్తున్న నిబద్ధత యువతకు స్ఫూర్తిదాయకం.
ఇదీ చదవండి: వీధి కుక్కల బెడద: నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్


