కెమెరా క్లిక్‌.. అదిరే పిక్‌..! ట్రెండింగ్‌గా మారుతున్న మొబైల్‌ ఫోటోగ్రఫీ | World Photography Day: Smartphone Photography has become a new trend | Sakshi
Sakshi News home page

Smartphone Photography: కెమెరా క్లిక్‌.. అదిరే పిక్‌..! ట్రెండింగ్‌గా మారుతున్న మొబైల్‌ ఫోటోగ్రఫీ

Aug 20 2025 10:45 AM | Updated on Aug 20 2025 11:12 AM

World Photography Day: Smartphone Photography has become a new trend

ఒక్క ఫొటో అనేక భావాలను, అర్థాలను ప్రతిబింబిస్తుంది. చరిత్రలోని అనే సంఘటనలను, మధురానుభూతులకు కళ్లకు కట్టేది ఈ చిత్రమే.. అయితే ఒకప్పుడు ఇది సామాన్యునికి బహుదూరం.. కానీ అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా నేడు ప్రతి ఒక్కరికీ చేరువయ్యింది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనేక మధురమైన జ్ఞాపకాలను పదిలపరుస్తోంది.. మరికొందరికి ప్రకృతిలోని ప్రతిదీ చిత్రీకరించే సాధనంగా మారుతోంది. మొబైల్‌ రాకతో ఇది మరింత చేరువయ్యింది.. ఈ నేపథ్యంలో మొబైల్‌ ఫొటోగ్రఫీ అనే హాబీ ట్రెండింగ్‌ అవుతోంది.. ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ఔత్సాహికులు వారు తీసిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు.. ప్రస్తుతం ఇవి వైరల్‌ అవుతున్నాయి.

సాధారణంగా సామాజిక మాధ్యమాల్లో రీల్, సినిమాలు, జోకులు, మీమ్స్‌ వైరల్‌ అవుతుంటాయి. దీనికి భిన్నంగా గత కొంతకాలంగా యువతకు సంబంధించిన క్రియేటివ్‌ వర్క్‌ కూడా వైరల్‌ అవుతున్నాయి. 

అయితే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొబైల్స్‌లో ఫొటోలు తీయడం హాబీగా మారిన కొందరి ఫొటోలు ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో మంగళవారం పోస్టులుగా తెగ వైరల్‌ అయ్యాయి. వీటికి షేర్లు, లైకులు కొడుతూ పలువురు కామెంట్లు చేశారు. ఫొటో గ్రఫీపట్ల తమకున్న ప్యాషన్‌ని, తమలోని క్రియేటివిటీని సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించారు.  

ఒక్కో ఫొటోకూ.. ఒక్కో కథ.. 
ఈ ఏడాది ఫొటోగ్రఫీ డే సందర్భంగా సోషల్‌ మీడియా వేదికలైన ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ఎక్స్‌ (ట్విట్టర్‌), వాట్సాప్‌ వంటి వేదికలు విభిన్న, వినూత్న ఫొటోలతో నిండిపోయాయి. ప్రతి ఒక్కరు తమ కెమెరాలో బంధించిన ప్రత్యేక క్షణాలను షేర్‌ చేస్తూ ‘ఇదే నా స్టైల్, ఇదే నా ప్రత్యేకత’ అని తమ ప్రతిభను చాటుకున్నారు. 

కొందరు యువత ప్రకృతిని తమ కెమెరాలో బంధించగా, మరికొందరు నగర జీవన శైలిని, మరి కొందరు ట్రావెలింగ్, సంస్కృతి, ఆర్ట్, చరిత్ర, ఫుడ్‌ ఫొటోగ్రఫీ వంటి అంశాలను చిత్రాల రూపంలో ప్రదర్శించారు. ఫొటోగ్రఫీ డే అనేది కేవలం ఒక వేడుక కాదు, ఇది ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చాటుకునే ఓ వేదిక. ప్రతి ఫొటో ఒక కొత్త కథ చెబుతోంది. అందుకే ఈ ఫొటోగ్రఫీ దినోత్సవం కేవలం ఫొటోల పండుగ మాత్రమే కాదు.. ఒక లైఫ్‌ స్టైల్‌ ఫెస్టివల్‌ అని చెప్పకనే చెబుతోంది. 

సోషల్‌ మీడియా పాత్ర.. 
ఫొటోగ్రఫీకి సోషల్‌ మీడియా ఒక ప్రధాన వేదికగా మారింది. ఒకప్పుడు ఔత్సాహికులు తీసిన ఫొటోలను ఇంట్లో, ఆల్బమ్స్‌లో చూసేవాళ్లు. ఇప్పుడు అదే ఫొటోలు నిమిషాల్లోనే ప్రపంచానికి చేరుతున్నాయి. ఇన్‌స్టా ‘ఫోటోగ్రఫీ డే హాష్‌ట్యాగ్‌’తో పోస్ట్‌ చేస్తే, అది వేల మందికి చేరుతుంది. ఫేస్‌బుక్‌లో షేర్‌ చేస్తే స్నేహితులు, బంధువులు లైక్స్‌తో ప్రోత్సహిస్తారు. ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తే వెంటనే ట్రెండింగ్‌ అవుతుంది. 

వాట్సాప్‌ స్టేటస్‌ ద్వారా మన స్నేహితుల సర్కిల్‌లో హైలైట్‌ అవుతాయి. అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఒక చిన్నపాటి ప్రచార సాధనం ఉన్నట్లు. ఇది కేవలం వ్యక్తిగత ప్రతిభను చూపించడానికే కాకుండా, నెట్‌వర్కింగ్‌లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఒక్క ఫొటో ఆధారంగా అనేక మంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కొంతమంది తమ ఫొటోలు పోస్టు చేయడం ద్వారా ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్ల దృష్టికి చేరుతున్నారు. మోడలింగ్, ఫొటో ఎగ్జిబిషన్, బ్రాండ్‌ ప్రమోషన్స్‌ వంటి అవకాశాలు పొందుతు న్నారు. 

జన్‌–జీ స్టైల్‌ అండ్‌ క్రియేటివిటీ.. 
ఫొటోగ్రఫీ డే నేపథ్యంలో సోషల్‌ మీడియాలో తమ ఫొటోలను కేవలం షేర్‌ చేయడమే కాదు.. వాటికి ప్రత్యేక ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, క్రియేటివ్‌ క్యాప్షన్స్‌ జోడించడం ద్వారా కొత్త ట్రెండ్‌ సృష్టించారు. లైఫ్‌ స్టైల్‌ యాప్స్‌ ఫొటోగ్రఫీని కేవలం హాబీ స్థాయి నుంచి ప్రొఫెషనల్‌ స్థాయికి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. 

ఒక మంచి ఫొటోతీసి, దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తే, అది స్ఫూర్తిగా మారుతుంది. నగరంలోని యువత తమ ఫొటోగ్రాఫిక్‌ స్కిల్స్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. చారి్మనార్, హుస్సేన్‌ సాగర్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలు కొత్త కోణంలో కెమెరా కంట పడగా, నగర ఆధునిక లైఫ్‌ స్టైల్‌ కూడా ఫ్రేమ్‌లో బంధీ అయ్యాయి.    

(చదవండి: లాస్ట్‌ మీల్‌ అంటే ఇదేనేమో..! పగోడికి కూడా ఇలాంటి అనుభవం వద్దు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement