
ధైర్యవంతురాలు, స్వతంత్రురాలు , అసాధారణమైన మహిళ హోమై వ్యారవల్లా(Homai vyarawalla) భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్‌గా ప్రసిద్ధి చెందారు. 1947 ఆగస్టు 16న ఎర్రకోటలో జరిగిన మొట్టమొదటి జెండా ఎగురవేత కార్యక్రమం నుండి మహాత్మా గాంధీ జవహర్‌లాల్ నెహ్రూ వంటి ప్రముఖుల దహన సంస్కారాల వరకు - భారత చరిత్రలో అత్యంత చిరస్మరణీయమైన , అద్భుతమైన క్షణాలను బంధించిన ఘనత ఆమెకే దక్కింది. ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఆమె గురించిన కొన్ని విశేషాలు.
భారతదేశం ఇంకా బ్రిటిష్ పాలనలో ఉన్న కాలంలో,చాలా తక్కువ మంది భారతీయ మహిళలు మాత్రమే విద్యను పొందే అవకాశం ఉన్న సమయంలో ఆమె ఫోటోగ్రఫీపై మక్కువ పెంచుకున్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా ఉన్న సమయంలో మొత్తం దేశం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, పేద పార్సీ కుటుంబానికి చెందిన హోమై వ్యారవల్లా అనే యువతి ఫోటో జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. కానీ అప్పుడు ఆమె ఊహించి ఉండదు తన పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుందని.
ఆమె తొలి ఛాయాచిత్రం బొంబాయిలోని ఉమెన్స్ క్లబ్ పిక్నిక్ పార్టీలో మహిళల క్లిక్. ఈ ఛాయాచిత్రం 1930లో బాంబే క్రానికల్స్ మ్యాగజైన్‌లో ప్రచురించారు. దీనికి హోమై ఫోటోకు ఒక రూపాయి చొప్పున అందుకున్నారు.
హోమై వ్యారవల్లా 1913లో గుజరాత్‌లోని నవ్‌సరి అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి ఉర్దూ-పార్సీ థియేటర్ కంపెనీలో నటుడు. హోమై తన ప్రాథమిక విద్యను సూరత్‌కు సమీపంలోని వ్యారాలో పూర్తి చేశారు. తరువాత ఆమె కుటుంబం ముంబైకి వెళ్లి అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కళాశాలలో క్లాస్‌మేట్ మరియు ఫోటోగ్రఫీలో తన టీచర్ అయిన మానెక్షాను కలిసింది, తరువాత ఆమె వివాహం చేసుకున్నారు.
ఆమె ఢిల్లీకి వెళ్లి బ్రిటిష్ హై కమిషన్‌లో చేరారు, అక్కడ ఆమె ఫోటో జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ఎన్నో మరపురాని, చరిత్రలో నిలిచిపోయే ఫోటోలను అందించారు. హోమై వ్యారవల్లా జవహర్‌లాల్ నెహ్రూను తనకు ఇష్టమైన సబ్జెక్ట్‌గా భావించేవారట. ఆయన అత్యంత ఫోటోజెనిక్ వ్యక్తి అని పొగిడేవారట. 1969లో ఆమె భర్త మరణం తర్వాత ఫోటోగ్రఫీని శాశ్వతంగా వదిలేసి కుమారుడు ఫరూఖ్ దగ్గరికి వెళ్లిపోయారు. 2012లో 98 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచింది. హోమై 2010లో భారతదేశపు మొట్టమొదటి జీవిత సాఫల్య జాతీయ ఫోటో అవార్డును అందుకున్నారు . అలాగే 2011లో పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు.
