Photo journalism
-
భారతదేశాన్ని ఫొటో తీశాడు
రఘురాయ్. ఈ పేరు చెప్పగానే ఢిల్లీ వీధుల్లో తిరిగే అంధ భిక్షువు గుర్తుకొస్తాడు. భోపాల్ విషవాయువులకు మరణించిన పసికందు తెరచిన రెప్పలను మూస్తున్న తల్లి చేయి గుర్తుకు వస్తుంది. బంగ్లాదేశ్ యుద్ధంలో ఒక తల్లి చెంప వెంట కారుతున్న అశ్రు బిందువు....మదర్ థెరిసా కైమోడ్పు చేతులు...మనవళ్లతో ఆడుతున్న ఇందిరా గాంధీ ఉల్లాసం... వై.ఎస్.రాజశేఖర రెడ్డి పాదయాత్ర... అతను దేశాన్ని తన కెమెరాలో నిక్షిప్తం చేశాడు. ఛాయా చిత్రంగా శాశ్వతం చేశాడు. అతనిపై నివాళి వ్యాసం.‘నా ఎదుట గొప్ప ఘటన జరిగినప్పుడు నా చేతిలో కెమెరా లేకపోతే పాపం చేసినట్టు భావిస్తాను’ అన్నాడు రఘురాయ్. ‘నువ్వు మంచి మనిషి కాకపోతే మంచి ఫొటోగ్రాఫర్వి కూడా కాలేవు’ అనీ అన్నాడు. ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫొటో జర్నలిజమ్’ గా ఖ్యాతి గడించిన 83 ఏళ్ల రఘురాయ్ కన్నుమూయడం భారతదేశాన్ని నిజ ఆత్మతో దర్శించే వాహిక కన్నుమూయడంతో సమానం. ఫొటో తీయడం అంటే కేవలం క్లిక్ చేయడం కాదనీ అది చె΄్పాల్సిన, చూపాల్సిన దృశ్యం సంపూర్ణంగా అవగతం చేయాలని అంటాడాయన. ఎందరెందరో ఫొటోగ్రాఫర్లకు గురువుగా ఉండి, ప్రపంచ దేశాల్లో భారత ఫొటోగ్రఫీ ఉనికి చాటిన రఘురాయ్ కెమెరా చేతబట్టిన చరిత్రకారుడు. కెమెరానే కలంగా మార్చి 1965 నుంచి 2025 దాకా 60 ఏళ్ల ఇండియాని ఫొటోలుగా భావితరాలకు ఇచ్చి వెళ్లాడాయన. → బుజ్జి గాడిద ఫొటోరఘురాయ్ది పంజాబీ కుటుంబం. దేశ విభజన సమయంలో ఢిల్లీ వచ్చి స్థిరపడింది. రఘురాయ్‌కు చిన్నప్పటి నుంచి ప్రకృతి, పరిసరాలు ఇష్టం. సంగీతకారుడు కావాలనుకున్నాడు. అయితే తండ్రి ‘నువ్వు ఇంజనీరువి కావాలి’ అనంటే సివిల్ ఇంజనీరింగ్ చదివి ఒక సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగం చేశాడు. ‘అయితే అదేమీ నాకు మజా ఇవ్వలేదు’ అంటాడు రఘురాయ్. ఉద్యోగం మానేసి 1965లో 23 ఏళ్ల వయసులో ఢిల్లీకి తన పెద్దన్నయ్య ఎస్.పాల్ దగ్గరకు వచ్చాడు. పాల్ అప్పటికే ‘ది స్టేట్స్‌మేన్’లో ఫొటోగ్రాఫర్. పాల్ స్నేహితులు ఒకరోజు ఫొటోలు తీయడానికి పల్లెటూరుకు వెళుతుంటే సరదా కొద్ది అన్న కెమెరా మెడలో వేసుకుని వారితో వెళ్లాడు. వాళ్లంతా రకరకాల ఫొటోలు తీస్తుంటే తను మాత్రం అక్కడ ఉన్న బుజ్జి గాడిద పిల్లను ఫొటో తీశాడు. అది రఘురాయ్ మొదటి ఫొటో. ఇంటికి వచ్చాక అన్నయ్య అది చూసి ‘ఈ ఫొటో చాలా బాగుంది’ అని లండన్‌లోని టైమ్స్ డైలీకి పంపితే వాళ్లు అరపేజీ ఫొటోగా వేశారు. అలా రఘురాయ్ ఫొటో యాత్ర ఘనంగా మొదలైంది. ఆ మరుసటి సంవత్సరానికే ‘స్టేట్స్‌మేన్’లో రఘురాయ్ చీఫ్ ఫొటోగ్రాఫర్ అయ్యాడు. → బ్లాక్ – వైట్ ఇండియా1980–90ల దాకా రఘురాయ్ ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్‌లోనే ఫొటోలు తీశాడు. ‘ఇండియా రంగుల దేశం కాదు, భావాల దేశం. మనుషుల శరీర ముడతల్లోని బాధ, కళ్లలోని ఆశ, చేతుల్లోని కష్టం... ఇవి బ్లాక్ అండ్ వైట్‌లోనే తెలుస్తాయి’ అంటాడాయన. ఆయన ఫొటోల్లో కాంతి ఒక పాత్ర. నీడ ఒక పాత్ర. రఘురాయ్ గొప్పతనం సామాన్యుడిని సెలబ్రిటీని చేయడంలో ఉంది. ఢిల్లీ వీధుల్లో చాయ్ అమ్మే కుర్రాడు, కాశీలో దీపం వెలిగించే పూజారి, రైల్లో సామాను మోసే కూలీ – వీళ్లందరినీ మదర్ థెరిసాతో, సత్యజిత్ రేతో సమానంగా ఫ్రేమ్ చేశాడు.→ చారిత్రక ఘట్టాలు1982–1991 మధ్య పత్రికల్లో రఘురాయ్ పని చేసిన కాలం కీలకమైనది. ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ దాకా, పంజాబ్ ఉగ్రవాదం నుంచి మండల్ ఉద్యమం దాకా దేశాన్ని కదిలించిన ప్రతి ఘట్టాన్ని ఆయన కెమెరా సాక్ష్యమిచ్చింది. 1984 డిసెంబర్ 3న భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన ఉదయం ఎనిమిదిన్నరకే అక్కడ వాలిపోయి ’Burial of an Unknown Child’ ఫోటోతో ప్రపంచాన్ని కదిలించాడు. ఆ ఒక్క ఫొటోకే ‘వరల్డ్ ప్రెస్ ఫొటో అవార్డు’ వచ్చింది. ఎమర్జెన్సీ తర్వాత ఇండియా, పంజాబ్ ఉగ్రవాదం, అస్సాం ఆందోళన, మండల్ కమిషన్ గొడవలు... అన్నింటికీ రఘురాయ్ కెమెరా సాక్షి. ఎలైట్ ఇండియా, రియల్ ఇండియా రెండింటినీ సమానంగా చూపించాడు. → ఇందిరాగాంధీ ఫొటోలు1966లో రఘురాయ్ ఫొటో జర్నలిస్టుగా మారితే ఇందిరాగాంధీ అదే సంవత్సరం జనవరిలో ప్రధాని అయ్యారు. అంటే ఆమె పాలిటిక్స్‌లోకి, ఆయన ఫొటోగ్రఫీలోకి దాదాపు ఒకేసారి వచ్చారు. దాంతో ఆమెతో బాగా చనువు ఏర్పడింది. ఇందిరాగాంధీ ప్రైవేట్, పబ్లిక్ జీవితంలో ఎవరి అనుమతీ అక్కర్లేని ప్రవేశం రఘురాయ్కి ఉండేది. అందుకే ఇవాళ మనం చూస్తున్న ఇందిరాగాంధీ ఫొటోలెన్నో రఘురాయ్ తీయగలిగాడు. ప్రతి విమెన్స్ డేకు కనపడే ఇందిరాగాంధీ ఫొటో (చాలామంది మంత్రులు నిలబడి ఉండగా తను సీట్లో కూచుని ఉన్న ఇందిరాగాంధీ) రఘురాయ్ తీసిందే. ఇందిరాగాంధీ హత్య జరిగే ముందురోజు వరకూ రఘురాయ్ ఆమెను ఫొటోలు తీస్తూనే ఉన్నాడు.→ సత్యజిత్ రే భక్తుడురఘురాయ్ సినిమా రంగంలో పెద్దగా పని చేయలేదు కానీ సత్యజిత్ రేకు విపరీతమైన భక్తుడు. ఆయన సెట్స్‌లో తిరుగుతూ ఫొటోలు తీసేవాడు. రే కూడా రఘురాయ్ని ’He sees what others don't’ అని మెచ్చుకున్నాడు. ‘సలాం బాంబే’ సినిమాకు స్టిల్ ఫొటోగ్రాఫర్ రఘురాయే. ఆ తర్వాత సినిమా రంగంలో ఓంపురి, నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, స్మితా పాటిల్ వీళ్లందరి ఫొటోలను వారి వ్యక్తిత్వ ధోరణులకు తగినట్టుగా తీయగలిగాడు. ఇక గొప్ప సంగీతస్రష్టలు రఘురాయ్ తమను ఫొటో తీస్తే బాగుండు అనుకున్నారు. ప్రఖ్యాత తబలా విద్వాంసులు– తండ్రీ కొడుకులు అయిన ఉస్తాద్ అల్లారఖా, ఉస్తాద్ జకీర్ హుసేన్‌ల జుగల్బందీని రఘురాయ్ అద్భుతంగా కెమెరాలో ఒడిసిపట్టాడు.→ కెమెరా పట్టుకున్న రుషిరఘురాయ్ కెమెరా ‘కాలానికి సాక్షి’. రఘురాయ్ కెమెరా పట్టుకున్న ఒక ఋషి. రఘురాయ్ గొప్ప మానవతావాది, సంస్కర్త. అందుకే ఆయన దృష్టిలో ఇండియా అంటే పార్లమెంట్ కాదు. పార్లమెంట్ బయట టీ అమ్ముకునే కుర్రాడు. రాష్ట్రపతి భవన్ కాదు. దాని గేటు ముందు నిద్రపోయే యాచకుడు. ఈ హెచ్చుతగ్గుల వ్యవస్థలో ఎవరి పక్షం వహించాలో తెలిసిన ఛాయాచిత్ర తిరుగుబాటుదారుడు రఘురాయ్. ఆయన వెళ్లిపోయినా ఆయన వదిలిన ఛాయలు ఇక్కడే ఉన్నాయి. సరైన వెలుతురు రానంత కాలం ఆ ఛాయలు నిలదీస్తూనే ఉంటాయి.– ఖదీర్ -
భారతదేశపు తొలి మహిళా ఫోటో జర్నలిస్ట్ ఎవరో మీకు తెలుసా?
ధైర్యవంతురాలు, స్వతంత్రురాలు , అసాధారణమైన మహిళ హోమై వ్యారవల్లా(Homai vyarawalla) భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్‌గా ప్రసిద్ధి చెందారు. 1947 ఆగస్టు 16న ఎర్రకోటలో జరిగిన మొట్టమొదటి జెండా ఎగురవేత కార్యక్రమం నుండి మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వంటి ప్రముఖుల దహన సంస్కారాల వరకు - భారత చరిత్రలో అత్యంత చిరస్మరణీయమైన , అద్భుతమైన క్షణాలను బంధించిన ఘనత ఆమెకే దక్కింది. ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఆమె గురించిన కొన్ని విశేషాలు.భారతదేశం ఇంకా బ్రిటిష్ పాలనలో ఉన్న కాలంలో,చాలా తక్కువ మంది భారతీయ మహిళలు మాత్రమే విద్యను పొందే అవకాశం ఉన్న సమయంలో ఆమె ఫోటోగ్రఫీపై మక్కువ పెంచుకున్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా ఉన్న సమయంలో మొత్తం దేశం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, పేద పార్సీ కుటుంబానికి చెందిన హోమై వ్యారవల్లా అనే యువతి ఫోటో జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. కానీ అప్పుడు ఆమె ఊహించి ఉండదు తన పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుందని.ఆమె తొలి ఛాయాచిత్రం బొంబాయిలోని ఉమెన్స్ క్లబ్ పిక్నిక్ పార్టీలో మహిళల క్లిక్. ఈ ఛాయాచిత్రం 1930లో బాంబే క్రానికల్స్ మ్యాగజైన్లో ప్రచురించారు. దీనికి హోమై ఫోటోకు ఒక రూపాయి చొప్పున అందుకున్నారు.హోమై వ్యారవల్లా 1913లో గుజరాత్‌లోని నవ్‌సరి అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి ఉర్దూ-పార్సీ థియేటర్ కంపెనీలో నటుడు. హోమై తన ప్రాథమిక విద్యను సూరత్‌కు సమీపంలోని వ్యారాలో పూర్తి చేశారు. తరువాత ఆమె కుటుంబం ముంబైకి వెళ్లి అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కళాశాలలో క్లాస్మేట్ మరియు ఫోటోగ్రఫీలో తన టీచర్ అయిన మానెక్షాను కలిసింది, తరువాత ఆమె వివాహం చేసుకున్నారు.ఆమె ఢిల్లీకి వెళ్లి బ్రిటిష్ హై కమిషన్‌లో చేరారు, అక్కడ ఆమె ఫోటో జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ఎన్నో మరపురాని, చరిత్రలో నిలిచిపోయే ఫోటోలను అందించారు. హోమై వ్యారవల్లా జవహర్లాల్ నెహ్రూను తనకు ఇష్టమైన సబ్జెక్ట్‌గా భావించేవారట. ఆయన అత్యంత ఫోటోజెనిక్ వ్యక్తి అని పొగిడేవారట. 1969లో ఆమె భర్త మరణం తర్వాత ఫోటోగ్రఫీని శాశ్వతంగా వదిలేసి కుమారుడు ఫరూఖ్ దగ్గరికి వెళ్లిపోయారు. 2012లో 98 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచింది. హోమై 2010లో భారతదేశపు మొట్టమొదటి జీవిత సాఫల్య జాతీయ ఫోటో అవార్డును అందుకున్నారు . అలాగే 2011లో పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. -
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు
-
Oskar Barnack: ఫొటోజర్నలిజం పితామహుడు
జర్మనీ దేశస్థుడైన ఆస్కార్ బర్నాక్ కెమెరా డిజైనర్, కంటి అద్దాల ఇంజనీర్, పారిశ్రామిక వేత్త కూడా. ఆయన రూపొందించిన ‘లైకా’ కెమెరా అనేక మార్పులతో ఇప్పటికీ అన్నిదేశాల్లో వాడకంలో ఉంది. మొదట డాగురే 183 సంవత్సరాల క్రితం ‘కెమెరా’ను కనుగొన్నారు. తొలుత తయారైన కెమెరాలు పెద్దసైజులో ఉండేవి. ఫొటోలు తీయడం కూడా చాలా ఖర్చుతో కూడి ఉండేది. ఆ తర్వాత 75 ఏళ్లకు ఆస్కార్ బర్నాక్ అతిసూక్ష్మమైన సైజులో ఉండే కెమెరాను రూపొందించి మొదటి ప్రపంచ యుద్ధం (1914) సంఘటనలను కళ్ళకు కట్టినట్లుగా చిత్రీకరించి పత్రికా రంగానికి ప్రాణం పోశాడు. అందుకే వీరిని ‘ఫొటోజర్నలిజం పితామహుడు’ అంటారు. వారు తీసిన చిత్రాలు 1916లో ప్రచురింపబడి ప్రపంచ మానవాళికి యుద్ధం వల్ల జరిగే నష్టాలను తెలియ చెప్పటంలో కీలకపాత్ర పోషించాయి. ఆస్కార్ బర్నాక్ జన్మదినం నవంబర్ 1ని ‘ప్రపంచ ఫొటోజర్నలిజం’ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ఎన్నో కొత్త కంపెనీల చిన్న కెమెరాలు ఎన్ని వచ్చినా ఈనాటికీ డిజిటల్ యుగంలో కూడా ఆస్కార్ బర్నాక్ సృష్టించిన లైకా విధాన కెమెరా అత్యంత పరిపూర్ణమైంది. 1914 తర్వాత వార్తలు, సమాచార ఫొటోగ్రఫీ జర్నలిజం ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపచేయటంలో ఆయన ఆవిష్కరణ కీలక పాత్ర వహించింది. 1932లో ఓ అడుగు ముందుకువేసి బర్నాక్ కెమెరా లోపల ఒక చిన్న మోటారు అమర్చి ఒక దృశ్యాన్ని తీయగానే ఫిలిం ముందుకు జరిగే విధానానికి నాందిపలికి 1937లో ప్రపంచానికి పరిచయం చేశారు. (క్లిక్ చేయండి: ‘అనంత’ సాంస్కృతిక సేనాని) ఈమధ్య ఆ కెమెరాను వేలంవేయగా దాదాపుగా 19కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. బర్నాక్ 57వ ఏట 16 జనవరి 1936న అకాల మరణం చెందారు. 1979 నుంచీ ఆయన శత జయంతి సందర్భంగా ‘లైకా ఆస్కార్ బర్నాక్’ అంతర్జాతీయ అవార్డును ప్రతి ఏటా ఫొటో జర్నలిజంలో విశేషంగా కృషిచేసిన వారికి లైకా సంస్థ అందిస్తోంది. – టి. శ్రీనివాసరెడ్డి, ఫొటోజర్నలిస్ట్ ఫెలో ఆఫ్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ, గ్రేట్ బ్రిటన్ (నవంబర్ 1న ప్రపంచ ఫొటోజర్నలిజం దినోత్సవం) -
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లకు అవార్డుల పంట
సాక్షి, అమరావతి: స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (స్పాప్) ‘వరల్డ్ ఫొటో జర్నలిజం డే’ సందర్భంగా నిర్వహించిన ‘5వ ఇండియా ప్రెస్ ఫొటో అవార్డ్స్–2020’ జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ఎ.సతీష్ తీసిన ‘అన్నకు గోరుముద్ద’ ఫొటోకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫొటోగ్రఫీ (ఎఫ్ఐపీ) గోల్డ్ మెడల్ లభించింది. ‘సాక్షి’ తెలుగు దినపత్రిక ఏపీ, తెలంగాణ ఫొటోగ్రాఫర్లు 19 అవార్డులు సాధించారు. 22 రాష్ట్రాల నుంచి 303 మంది ఫొటో జర్నలిస్టులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఓపెన్ కలర్ విభాగంలో వి.రూబెన్ (విజయవాడ)కు 3వ బహుమతి, ఫొటో జర్నలిజం విభాగంలో పి.లీలామోహన్ (వైజాగ్), ఎన్.రాజేష్‌రెడ్డి (హైదరాబాద్), ఎఫ్ఐపీ రిబ్బన్ విభాగంలో పి. విజయకృష్ణ (విజయవాడ). పి.శివప్రసాద్ (సంగారెడ్డి)లకు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్, ఎస్.లక్ష్మీపవన్ (విజయవాడ)కు యూత్ అచీవ్మెంట్ అవార్డు లభించాయి. కె.మోహనకృష్ణ (తిరుపతి), జి.వీరేష్ (అనంత), డి.హుస్సేన్(కర్నూలు), ఎండీ నవాజ్ (వైజాగ్), జయశంకర్ (శ్రీకాకుళం), పి.సతీష్‌కుమార్ (కాకినాడ), రియాజుద్దీన్ (ఏలూరు), జె.అజీజ్ (మచిలీపట్నం), ఎన్.కిశోర్ (విజయవాడ) కె.చక్రపాణి (విజయవాడ), పి.మనువిశాల్ (విజయవాడ), సురేశ్‌కుమార్ (హైదరాబాద్), భజరంగ ప్రసాద్ (నల్లగొండ)లకు స్పాప్ నేషనల్ అచీవ్మెంట్ అవార్డులు దక్కాయి. -
‘ఫొటో’ విజేతలకు పురస్కారాలు
మాదాపూర్: మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ బీపీ ఆచార్య ప్రదర్శనలో ఉంచిన చిత్రాలను చూసి వాటిని తీసిన ఫొటోగ్రాఫర్లను కొనియాడారు. ఫొటో జర్నలిజంలో మూడో బహుమతి సాధించిన కంది బజరంగ్ ప్రసాద్ (సాక్షి) జ్ఞాపిక, రూ.6 వేల నగదు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డెరైక్టర్ డి. మనోహర్, ఫొటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, జేఎన్ఏఎఫ్ఏయూ నిర్వహించిన బెస్ట్ ఫొటోగ్రఫీ-2015 పోటీలో విజేతలకు బధవారం బహుమతులను ప్రదానం చేశారు. మాసబ్‌ట్యాంక్‌లో జేఎన్ఏఎఫ్ఏయూ జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్టీ ఏపీసీపీఐ ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డి, వర్సిటీ ప్రిన్సిపల్ ఎస్.ఎన్. వికాస్ విజేతలకు పురస్కారాలను ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్నవారిలో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లు బి. రాజేష్ రెండో బహుమతి, దశరథ్ రజువా మూడో బహుమతి, పి.వరప్రసాద్ ప్రోత్సాహక బహుమతిని అందుకున్నారు. -
‘సెజ్’ పొమ్మంది..
అరుణ్ రాయ్‌చౌదరి.. 25 ఏళ్లు ఫొటో జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఆయనది. కెమెరా క్లిక్‌మంటే ఫొటో అయిపోతుంది. కానీ, ఒక్క ఛాయాచిత్రంతో దాని వెనుకున్న కథను చెప్పగలిగితేనే అది ఫొటో జర్నలిజం అవుతుందంటున్న అరుణ్ రాయ్చౌదరితో ఈ వారం లెన్స్ అండ్ లైఫ్. ఫొటో జర్నలిజం అంటే ఒక స్టిల్ కాదు. మనం నేరుగా చూడలేని అంశాలను కళ్లకు కట్టేది. సబ్జెక్ట్‌లోకి తొంగి చూడగలగాలి. అలాంటిదే పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్‌లో నేను తీసిన ఫొటో. స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) వివాదం ఆ ఊరిని కల్లోలం చేసింది. ప్రాణభయంతో ఆ గ్రామస్తులను పరుగులు తీసేలా చేసింది. పోలీసులకు, అల్లరి మూకలకు చెలరేగిన ఘర్షణలు అమాయక జనాన్ని కట్టుబట్టలతో ఊరి పొలిమేరల వరకూ తరిమింది. ఆ సమయంలో తీసిన ఫొటో అక్కడున్న పరిస్థితిని కళ్లకు కట్టింది. ఈ ఫొటో తీసిన ముందు రోజు అదే గ్రామంలో జరిగిన ఘర్షణల్లో 14 మంది అమాయక రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు చోటు లేదు... ఒక ఫొటో మాట్లాడుతుంది. అలాంటి చిత్రం చూసిన తర్వాత మాట్లాడటం ఆపేసి... ఆలోచించటం మొదలుపెడతాం. ఈ రోజుల్లో అలాంటి చిత్రాలకు దినపత్రికల్లో చోటు లేదు. మొబైల్స్, డిజిటల్ కెమెరాల్లో రోజుకు ఎన్నో వేల ఫొటోలు క్లిక్‌మంటున్నాయి. అవన్ని ఫొటో జర్నలిజం కాలేవు. అసలు ఫొటో జర్నలిజం అనేది ఈ రోజుల్లో లేదనే చెప్పాలి. ఇప్పుడు న్యూస్ పేపర్లలో వస్తున్నది కేవలం పేజ్ ఫిల్లింగ్ కోసం తీసిన ఫొటోలు మాత్రమే. న్యూస్‌ను క్యారీ చేసేవి, వివరించే చిత్రాలకు చోటెక్కడుంది. దీనికి ప్రకటనలు, ఆలోచన ధోరణిలో మార్పు ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఫొటో జర్నలిజం కంట్రిబూషన్స్ ఈ రోజు హైదరాబాదులో చోటు చేసుకున్న మార్పులకు ఫోటో జర్నలిస్టుల కాంట్రిబూషన్ ఎంతైనా ఉంది. ఆ రోజుల్లో జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి దుర్గం చెరువు వెళ్లడానికి ఒక పిల్ల రోడ్డు ఉండేది. వర్షంలో, బురదలో సైకిల్ మీద వెళ్లి ఫొటోలు తీసిన సందర్భాలు నా అనుభవంలో ఉన్నాయి. అప్పట్లో న్యూస్ పేపర్స్లలో ఫొటో ఫీచర్స్ ఉండేవి. వాటి కోసం ఇలాంటి ఎన్నో ఫొటో ఫీచర్స్ చేసిన ఫొటోగ్రాఫర్లను, వారి కంట్రిబూషన్స్ని మరచిపోయారు. ఈ రోజుల్లో అలాంటి ఫీచర్స్ కూడా రన్ చెయ్యట్లేదు ఎవరూ. ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం కావడమే ఇందుకు కారణం. ప్రజెంటర్: ఓ మధు


