నివాళి
రఘురాయ్
రఘురాయ్. ఈ పేరు చెప్పగానే ఢిల్లీ వీధుల్లో తిరిగే అంధ భిక్షువు గుర్తుకొస్తాడు. భోపాల్ విషవాయువులకు మరణించిన పసికందు తెరచిన రెప్పలను మూస్తున్న తల్లి చేయి గుర్తుకు వస్తుంది. బంగ్లాదేశ్ యుద్ధంలో ఒక తల్లి చెంప వెంట కారుతున్న అశ్రు బిందువు....మదర్ థెరిసా కైమోడ్పు చేతులు...మనవళ్లతో ఆడుతున్న ఇందిరా గాంధీ ఉల్లాసం... వై.ఎస్.రాజశేఖర రెడ్డి పాదయాత్ర... అతను దేశాన్ని తన కెమెరాలో నిక్షిప్తం చేశాడు. ఛాయా చిత్రంగా శాశ్వతం చేశాడు. అతనిపై నివాళి వ్యాసం.
‘నా ఎదుట గొప్ప ఘటన జరిగినప్పుడు నా చేతిలో కెమెరా లేకపోతే పాపం చేసినట్టు భావిస్తాను’ అన్నాడు రఘురాయ్. ‘నువ్వు మంచి మనిషి కాకపోతే మంచి ఫొటోగ్రాఫర్‌వి కూడా కాలేవు’ అనీ అన్నాడు.
‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫొటో జర్నలిజమ్’ గా ఖ్యాతి గడించిన 83 ఏళ్ల రఘురాయ్ కన్నుమూయడం భారతదేశాన్ని నిజ ఆత్మతో దర్శించే వాహిక కన్నుమూయడంతో సమానం. ఫొటో తీయడం అంటే కేవలం క్లిక్ చేయడం కాదనీ అది చె΄్పాల్సిన, చూపాల్సిన దృశ్యం సంపూర్ణంగా అవగతం చేయాలని అంటాడాయన. ఎందరెందరో ఫొటోగ్రాఫర్లకు గురువుగా ఉండి, ప్రపంచ దేశాల్లో భారత ఫొటోగ్రఫీ ఉనికి చాటిన రఘురాయ్ కెమెరా చేతబట్టిన చరిత్రకారుడు. కెమెరానే కలంగా మార్చి 1965 నుంచి 2025 దాకా 60 ఏళ్ల ఇండియాని ఫొటోలుగా భావితరాలకు ఇచ్చి వెళ్లాడాయన.
→ బుజ్జి గాడిద ఫొటో
రఘురాయ్‌ది పంజాబీ కుటుంబం. దేశ విభజన సమయంలో ఢిల్లీ వచ్చి స్థిరపడింది. రఘురాయ్‌కు చిన్నప్పటి నుంచి ప్రకృతి, పరిసరాలు ఇష్టం. సంగీతకారుడు కావాలనుకున్నాడు. అయితే తండ్రి ‘నువ్వు ఇంజనీరువి కావాలి’ అనంటే సివిల్ ఇంజనీరింగ్ చదివి ఒక సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగం చేశాడు. ‘అయితే అదేమీ నాకు మజా ఇవ్వలేదు’ అంటాడు రఘురాయ్. ఉద్యోగం మానేసి 1965లో 23 ఏళ్ల వయసులో ఢిల్లీకి తన పెద్దన్నయ్య ఎస్.పాల్ దగ్గరకు వచ్చాడు. పాల్ అప్పటికే ‘ది స్టేట్స్‌మేన్’లో ఫొటోగ్రాఫర్.
పాల్ స్నేహితులు ఒకరోజు ఫొటోలు తీయడానికి పల్లెటూరుకు వెళుతుంటే సరదా కొద్ది అన్న కెమెరా మెడలో వేసుకుని వారితో వెళ్లాడు. వాళ్లంతా రకరకాల ఫొటోలు తీస్తుంటే తను మాత్రం అక్కడ ఉన్న బుజ్జి గాడిద పిల్లను ఫొటో తీశాడు. అది రఘురాయ్ మొదటి ఫొటో. ఇంటికి వచ్చాక అన్నయ్య అది చూసి ‘ఈ ఫొటో చాలా బాగుంది’ అని లండన్‌లోని టైమ్స్ డైలీకి పంపితే వాళ్లు అరపేజీ ఫొటోగా వేశారు. అలా రఘురాయ్ ఫొటో యాత్ర ఘనంగా మొదలైంది. ఆ మరుసటి సంవత్సరానికే ‘స్టేట్స్‌మేన్’లో రఘురాయ్ చీఫ్ ఫొటోగ్రాఫర్ అయ్యాడు.
→ బ్లాక్ – వైట్ ఇండియా
1980–90ల దాకా రఘురాయ్ ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్‌లోనే ఫొటోలు తీశాడు. ‘ఇండియా రంగుల దేశం కాదు, భావాల దేశం. మనుషుల శరీర ముడతల్లోని బాధ, కళ్లలోని ఆశ, చేతుల్లోని కష్టం... ఇవి బ్లాక్ అండ్ వైట్‌లోనే తెలుస్తాయి’ అంటాడాయన. ఆయన ఫొటోల్లో కాంతి ఒక పాత్ర. నీడ ఒక పాత్ర. రఘురాయ్ గొప్పతనం సామాన్యుడిని సెలబ్రిటీని చేయడంలో ఉంది. ఢిల్లీ వీధుల్లో చాయ్ అమ్మే కుర్రాడు, కాశీలో దీపం వెలిగించే పూజారి, రైల్లో సామాను మోసే కూలీ – వీళ్లందరినీ మదర్ థెరిసాతో, సత్యజిత్ రేతో సమానంగా ఫ్రేమ్ చేశాడు.
→ చారిత్రక ఘట్టాలు
1982–1991 మధ్య పత్రికల్లో రఘురాయ్ పని చేసిన కాలం కీలకమైనది. ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ దాకా, పంజాబ్ ఉగ్రవాదం నుంచి మండల్ ఉద్యమం దాకా దేశాన్ని కదిలించిన ప్రతి ఘట్టాన్ని ఆయన కెమెరా సాక్ష్యమిచ్చింది. 1984 డిసెంబర్ 3న భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన ఉదయం ఎనిమిదిన్నరకే అక్కడ వాలిపోయి ’Burial of an Unknown Child’ ఫోటోతో ప్రపంచాన్ని కదిలించాడు. ఆ ఒక్క ఫొటోకే ‘వరల్డ్ ప్రెస్ ఫొటో అవార్డు’ వచ్చింది. ఎమర్జెన్సీ తర్వాత ఇండియా, పంజాబ్ ఉగ్రవాదం, అస్సాం ఆందోళన, మండల్ కమిషన్ గొడవలు... అన్నింటికీ రఘురాయ్ కెమెరా సాక్షి. ఎలైట్ ఇండియా, రియల్ ఇండియా రెండింటినీ సమానంగా చూపించాడు.
→ ఇందిరాగాంధీ ఫొటోలు
1966లో రఘురాయ్ ఫొటో జర్నలిస్టుగా మారితే ఇందిరాగాంధీ అదే సంవత్సరం జనవరిలో ప్రధాని అయ్యారు. అంటే ఆమె పాలిటిక్స్‌లోకి, ఆయన ఫొటోగ్రఫీలోకి దాదాపు ఒకేసారి వచ్చారు. దాంతో ఆమెతో బాగా చనువు ఏర్పడింది. ఇందిరాగాంధీ ప్రైవేట్, పబ్లిక్ జీవితంలో ఎవరి అనుమతీ అక్కర్లేని ప్రవేశం రఘురాయ్‌కి ఉండేది. అందుకే ఇవాళ మనం చూస్తున్న ఇందిరాగాంధీ ఫొటోలెన్నో రఘురాయ్ తీయగలిగాడు. ప్రతి విమెన్స్ డేకు కనపడే ఇందిరాగాంధీ ఫొటో (చాలామంది మంత్రులు నిలబడి ఉండగా తను సీట్లో కూచుని ఉన్న ఇందిరాగాంధీ) రఘురాయ్ తీసిందే. ఇందిరాగాంధీ హత్య జరిగే ముందురోజు వరకూ రఘురాయ్ ఆమెను ఫొటోలు తీస్తూనే ఉన్నాడు.
→ సత్యజిత్ రే భక్తుడు
రఘురాయ్ సినిమా రంగంలో పెద్దగా పని చేయలేదు కానీ సత్యజిత్ రేకు విపరీతమైన భక్తుడు. ఆయన సెట్స్‌లో తిరుగుతూ ఫొటోలు తీసేవాడు. రే కూడా రఘురాయ్‌ని ’He sees what others don't’ అని మెచ్చుకున్నాడు. ‘సలాం బాంబే’ సినిమాకు స్టిల్ ఫొటోగ్రాఫర్ రఘురాయే. ఆ తర్వాత సినిమా రంగంలో ఓంపురి, నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, స్మితా పాటిల్ వీళ్లందరి ఫొటోలను వారి వ్యక్తిత్వ ధోరణులకు తగినట్టుగా తీయగలిగాడు. ఇక గొప్ప సంగీతస్రష్టలు రఘురాయ్ తమను ఫొటో తీస్తే బాగుండు అనుకున్నారు. ప్రఖ్యాత తబలా విద్వాంసులు– తండ్రీ కొడుకులు అయిన ఉస్తాద్ అల్లారఖా, ఉస్తాద్ జకీర్ హుసేన్‌ల జుగల్‌బందీని రఘురాయ్ అద్భుతంగా కెమెరాలో ఒడిసిపట్టాడు.
→ కెమెరా పట్టుకున్న రుషి
రఘురాయ్ కెమెరా ‘కాలానికి సాక్షి’. రఘురాయ్ కెమెరా పట్టుకున్న ఒక ఋషి. రఘురాయ్ గొప్ప మానవతావాది, సంస్కర్త. అందుకే ఆయన దృష్టిలో ఇండియా అంటే పార్లమెంట్ కాదు. పార్లమెంట్ బయట టీ అమ్ముకునే కుర్రాడు. రాష్ట్రపతి భవన్ కాదు. దాని గేటు ముందు నిద్రపోయే యాచకుడు. ఈ హెచ్చుతగ్గుల వ్యవస్థలో ఎవరి పక్షం వహించాలో తెలిసిన ఛాయాచిత్ర తిరుగుబాటుదారుడు రఘురాయ్. ఆయన వెళ్లిపోయినా ఆయన వదిలిన ఛాయలు ఇక్కడే ఉన్నాయి. సరైన వెలుతురు రానంత కాలం ఆ ఛాయలు నిలదీస్తూనే ఉంటాయి.
– ఖదీర్


