Indian Photographer
-
భారతదేశాన్ని ఫొటో తీశాడు
రఘురాయ్. ఈ పేరు చెప్పగానే ఢిల్లీ వీధుల్లో తిరిగే అంధ భిక్షువు గుర్తుకొస్తాడు. భోపాల్ విషవాయువులకు మరణించిన పసికందు తెరచిన రెప్పలను మూస్తున్న తల్లి చేయి గుర్తుకు వస్తుంది. బంగ్లాదేశ్ యుద్ధంలో ఒక తల్లి చెంప వెంట కారుతున్న అశ్రు బిందువు....మదర్ థెరిసా కైమోడ్పు చేతులు...మనవళ్లతో ఆడుతున్న ఇందిరా గాంధీ ఉల్లాసం... వై.ఎస్.రాజశేఖర రెడ్డి పాదయాత్ర... అతను దేశాన్ని తన కెమెరాలో నిక్షిప్తం చేశాడు. ఛాయా చిత్రంగా శాశ్వతం చేశాడు. అతనిపై నివాళి వ్యాసం.‘నా ఎదుట గొప్ప ఘటన జరిగినప్పుడు నా చేతిలో కెమెరా లేకపోతే పాపం చేసినట్టు భావిస్తాను’ అన్నాడు రఘురాయ్. ‘నువ్వు మంచి మనిషి కాకపోతే మంచి ఫొటోగ్రాఫర్వి కూడా కాలేవు’ అనీ అన్నాడు. ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫొటో జర్నలిజమ్’ గా ఖ్యాతి గడించిన 83 ఏళ్ల రఘురాయ్ కన్నుమూయడం భారతదేశాన్ని నిజ ఆత్మతో దర్శించే వాహిక కన్నుమూయడంతో సమానం. ఫొటో తీయడం అంటే కేవలం క్లిక్ చేయడం కాదనీ అది చె΄్పాల్సిన, చూపాల్సిన దృశ్యం సంపూర్ణంగా అవగతం చేయాలని అంటాడాయన. ఎందరెందరో ఫొటోగ్రాఫర్లకు గురువుగా ఉండి, ప్రపంచ దేశాల్లో భారత ఫొటోగ్రఫీ ఉనికి చాటిన రఘురాయ్ కెమెరా చేతబట్టిన చరిత్రకారుడు. కెమెరానే కలంగా మార్చి 1965 నుంచి 2025 దాకా 60 ఏళ్ల ఇండియాని ఫొటోలుగా భావితరాలకు ఇచ్చి వెళ్లాడాయన. → బుజ్జి గాడిద ఫొటోరఘురాయ్ది పంజాబీ కుటుంబం. దేశ విభజన సమయంలో ఢిల్లీ వచ్చి స్థిరపడింది. రఘురాయ్‌కు చిన్నప్పటి నుంచి ప్రకృతి, పరిసరాలు ఇష్టం. సంగీతకారుడు కావాలనుకున్నాడు. అయితే తండ్రి ‘నువ్వు ఇంజనీరువి కావాలి’ అనంటే సివిల్ ఇంజనీరింగ్ చదివి ఒక సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగం చేశాడు. ‘అయితే అదేమీ నాకు మజా ఇవ్వలేదు’ అంటాడు రఘురాయ్. ఉద్యోగం మానేసి 1965లో 23 ఏళ్ల వయసులో ఢిల్లీకి తన పెద్దన్నయ్య ఎస్.పాల్ దగ్గరకు వచ్చాడు. పాల్ అప్పటికే ‘ది స్టేట్స్‌మేన్’లో ఫొటోగ్రాఫర్. పాల్ స్నేహితులు ఒకరోజు ఫొటోలు తీయడానికి పల్లెటూరుకు వెళుతుంటే సరదా కొద్ది అన్న కెమెరా మెడలో వేసుకుని వారితో వెళ్లాడు. వాళ్లంతా రకరకాల ఫొటోలు తీస్తుంటే తను మాత్రం అక్కడ ఉన్న బుజ్జి గాడిద పిల్లను ఫొటో తీశాడు. అది రఘురాయ్ మొదటి ఫొటో. ఇంటికి వచ్చాక అన్నయ్య అది చూసి ‘ఈ ఫొటో చాలా బాగుంది’ అని లండన్‌లోని టైమ్స్ డైలీకి పంపితే వాళ్లు అరపేజీ ఫొటోగా వేశారు. అలా రఘురాయ్ ఫొటో యాత్ర ఘనంగా మొదలైంది. ఆ మరుసటి సంవత్సరానికే ‘స్టేట్స్‌మేన్’లో రఘురాయ్ చీఫ్ ఫొటోగ్రాఫర్ అయ్యాడు. → బ్లాక్ – వైట్ ఇండియా1980–90ల దాకా రఘురాయ్ ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్‌లోనే ఫొటోలు తీశాడు. ‘ఇండియా రంగుల దేశం కాదు, భావాల దేశం. మనుషుల శరీర ముడతల్లోని బాధ, కళ్లలోని ఆశ, చేతుల్లోని కష్టం... ఇవి బ్లాక్ అండ్ వైట్‌లోనే తెలుస్తాయి’ అంటాడాయన. ఆయన ఫొటోల్లో కాంతి ఒక పాత్ర. నీడ ఒక పాత్ర. రఘురాయ్ గొప్పతనం సామాన్యుడిని సెలబ్రిటీని చేయడంలో ఉంది. ఢిల్లీ వీధుల్లో చాయ్ అమ్మే కుర్రాడు, కాశీలో దీపం వెలిగించే పూజారి, రైల్లో సామాను మోసే కూలీ – వీళ్లందరినీ మదర్ థెరిసాతో, సత్యజిత్ రేతో సమానంగా ఫ్రేమ్ చేశాడు.→ చారిత్రక ఘట్టాలు1982–1991 మధ్య పత్రికల్లో రఘురాయ్ పని చేసిన కాలం కీలకమైనది. ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ దాకా, పంజాబ్ ఉగ్రవాదం నుంచి మండల్ ఉద్యమం దాకా దేశాన్ని కదిలించిన ప్రతి ఘట్టాన్ని ఆయన కెమెరా సాక్ష్యమిచ్చింది. 1984 డిసెంబర్ 3న భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన ఉదయం ఎనిమిదిన్నరకే అక్కడ వాలిపోయి ’Burial of an Unknown Child’ ఫోటోతో ప్రపంచాన్ని కదిలించాడు. ఆ ఒక్క ఫొటోకే ‘వరల్డ్ ప్రెస్ ఫొటో అవార్డు’ వచ్చింది. ఎమర్జెన్సీ తర్వాత ఇండియా, పంజాబ్ ఉగ్రవాదం, అస్సాం ఆందోళన, మండల్ కమిషన్ గొడవలు... అన్నింటికీ రఘురాయ్ కెమెరా సాక్షి. ఎలైట్ ఇండియా, రియల్ ఇండియా రెండింటినీ సమానంగా చూపించాడు. → ఇందిరాగాంధీ ఫొటోలు1966లో రఘురాయ్ ఫొటో జర్నలిస్టుగా మారితే ఇందిరాగాంధీ అదే సంవత్సరం జనవరిలో ప్రధాని అయ్యారు. అంటే ఆమె పాలిటిక్స్‌లోకి, ఆయన ఫొటోగ్రఫీలోకి దాదాపు ఒకేసారి వచ్చారు. దాంతో ఆమెతో బాగా చనువు ఏర్పడింది. ఇందిరాగాంధీ ప్రైవేట్, పబ్లిక్ జీవితంలో ఎవరి అనుమతీ అక్కర్లేని ప్రవేశం రఘురాయ్కి ఉండేది. అందుకే ఇవాళ మనం చూస్తున్న ఇందిరాగాంధీ ఫొటోలెన్నో రఘురాయ్ తీయగలిగాడు. ప్రతి విమెన్స్ డేకు కనపడే ఇందిరాగాంధీ ఫొటో (చాలామంది మంత్రులు నిలబడి ఉండగా తను సీట్లో కూచుని ఉన్న ఇందిరాగాంధీ) రఘురాయ్ తీసిందే. ఇందిరాగాంధీ హత్య జరిగే ముందురోజు వరకూ రఘురాయ్ ఆమెను ఫొటోలు తీస్తూనే ఉన్నాడు.→ సత్యజిత్ రే భక్తుడురఘురాయ్ సినిమా రంగంలో పెద్దగా పని చేయలేదు కానీ సత్యజిత్ రేకు విపరీతమైన భక్తుడు. ఆయన సెట్స్‌లో తిరుగుతూ ఫొటోలు తీసేవాడు. రే కూడా రఘురాయ్ని ’He sees what others don't’ అని మెచ్చుకున్నాడు. ‘సలాం బాంబే’ సినిమాకు స్టిల్ ఫొటోగ్రాఫర్ రఘురాయే. ఆ తర్వాత సినిమా రంగంలో ఓంపురి, నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, స్మితా పాటిల్ వీళ్లందరి ఫొటోలను వారి వ్యక్తిత్వ ధోరణులకు తగినట్టుగా తీయగలిగాడు. ఇక గొప్ప సంగీతస్రష్టలు రఘురాయ్ తమను ఫొటో తీస్తే బాగుండు అనుకున్నారు. ప్రఖ్యాత తబలా విద్వాంసులు– తండ్రీ కొడుకులు అయిన ఉస్తాద్ అల్లారఖా, ఉస్తాద్ జకీర్ హుసేన్‌ల జుగల్బందీని రఘురాయ్ అద్భుతంగా కెమెరాలో ఒడిసిపట్టాడు.→ కెమెరా పట్టుకున్న రుషిరఘురాయ్ కెమెరా ‘కాలానికి సాక్షి’. రఘురాయ్ కెమెరా పట్టుకున్న ఒక ఋషి. రఘురాయ్ గొప్ప మానవతావాది, సంస్కర్త. అందుకే ఆయన దృష్టిలో ఇండియా అంటే పార్లమెంట్ కాదు. పార్లమెంట్ బయట టీ అమ్ముకునే కుర్రాడు. రాష్ట్రపతి భవన్ కాదు. దాని గేటు ముందు నిద్రపోయే యాచకుడు. ఈ హెచ్చుతగ్గుల వ్యవస్థలో ఎవరి పక్షం వహించాలో తెలిసిన ఛాయాచిత్ర తిరుగుబాటుదారుడు రఘురాయ్. ఆయన వెళ్లిపోయినా ఆయన వదిలిన ఛాయలు ఇక్కడే ఉన్నాయి. సరైన వెలుతురు రానంత కాలం ఆ ఛాయలు నిలదీస్తూనే ఉంటాయి.– ఖదీర్ -
ఇండియన్ ఫోటోగ్రాఫర్‌కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతం
వన్యప్రాణులకు సంబంధించి కొత్త అన్వేషణలు ఔత్సాహికులకు చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తాయి. ఇటీవల తొమ్మిది రంగుల హిమాలయ మోనాల్ అనే అరుదైన మోనాల్ జంతువు భూటాన్ పర్వత లోయల్లో దర్శనమిచ్చింది. అద్భుతమైన ఇంద్రధనస్సు లాంటి ఈకలు , సహజమైన ప్రకాశవంతమైన మెరుపుతో ఆకాశాన విహరిస్తున్న ఈ పక్షి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఈఫోటో తీసింది ఎవరో తెలుసా? మగ హిమాలయ మోనాల్ విమానం మధ్యలో కనిపించింది. ఈ దృశ్యం భూటాన్ ఎత్తైన పర్వతాలపై ఆవిష్కృతమైంది. వీక్షకులు ఈ దృశ్యాన్ని ఉత్కంఠభరితంగా అభివర్ణించారు. ప్రకాశవంతమైన పర్వత సూర్యకాంతి కింద ఈ పక్షి మెరిసింది. చాలామంది దీనిని ఎగిరే ఆభరణంతో పోల్చారు. సహజ ఇంద్రధనస్సు రంగులతో హిమాలయ మోనాల్ అని పిలిచే నెమలి జాతి మగ పక్షి ఎగురుతూ ఫోటోలకు చిక్కింది. రంగులతో మెరిసిపోయే దేహం దీని ప్రత్యేకత. హిమాలయాల ఆభరణం అని పిలిచే ఈ పక్షి జాతి తేజస్సుకు ప్రసిద్ధి చెందింది. ఈ మేల్ హిమాలయ మోనాల్ విమానం మధ్యలో కనిపించిన దృశ్యం భూటాన్ ఎత్తైన పర్వతాలపై దర్శనమిచ్చింది. వీక్షకులు ఈ దృశ్యాన్ని ఉత్కంఠభరితంగా అభివర్ణించారు. ప్రకాశవంతమైన పర్వత సూర్యకాంతి కింద ఇది అద్భుతంగా మెరిసింది. దాని ఈకలు నీలం, ఆకుపచ్చ, ఊదా రంగులను, అటు బంగారం , నారింజ రంగులు ప్రకాశవంతంగా మెరుసి పోవడంతో చాలామంది దీనిని ఎగిరే ఆభరణంతో పోల్చారు. మెటాలిక్ కలర్స్‌ను మార్చుకుంటూ పచ్చ, రాగి షేడ్స్ తక్షణమే కనిపిస్తాయి. వెంటనే వైలెట్, ముదురు నీలంలోకి మారతాయి. ఒక విధంగా చెప్పాలంటే దీని ప్రతి కదలికతో దృశ్యం మారిపోయి, పూర్తిగా సహజమైన రంగులతో నిండుగా కనిపిస్తుంది. ఇదీ చదవండి: View this post on Instagram A post shared by INDIAN PHOTOGRAPHY (@indian.photography)ఈ హిమాలయ మోనాల్ సాధారణంగా భూటాన్, నేపాల్ అంతటా, ఎత్తైన హిమాలయ ప్రాంతాలలో నివసిస్తుంది. ఉత్తర భారతదేశంలో కూడా అక్కడడక్కడా కనిపిస్తుంది. టిబెట్‌లోని కొన్ని ప్రాంతాలు ఈ జాతులకు ఆతిథ్యం ఇస్తాయి. ఈ పక్షి 4,500 మీటర్ల ఎత్తులో వృద్ధి చెందుతుంది. ఇది ఆల్పైన్ పచ్చిక భూములు, అడవులను ఇష్టపడుతుంది. దీనికి ప్రాంతీయంగా సాంస్కృతికంగా ముఖ్యమైనది. ఇది నేపాల్ జాతీయ పక్షి.. ప్రధానంగా నేలపై నివసించినప్పటికీ, ఇది ఎగరగలదు. బిగ్గరగా అరిచే దాని అరుపులు లోయలలో ప్రతిధ్వనిస్తాయి. ఈ దృశ్యం హిమాలయ జీవవైవిధ్య గొప్పతనాన్ని హైలైట్ చేస్తుందనీ, ఇది ఆవాస రక్షణ ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుందని వన్యప్రాణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియోఈ చిత్రాన్ని తీసింది ఎవరు?వన్యప్రాణుల ఫోటోలకు ప్రసిద్ధి చెందిన భారత్ ఫోటో గ్రాఫర్ ది డా. సుధీర్ ఈ ఫోటోను తీశారు. దీన్ని ఎడిట్ చేయలేదు. ఇది ఏఐ అంతకన్నా కాదు..అంటూ భూటాన్ ఆకాశంలో ఎగురుతున్న ఈ తొమ్మిది రంగుల పక్షి తన కెమెరా కంటికి చిక్కిన వైనాన్ని పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ విషయంలోఆయన మరో రికార్డ్ కూడా నెలకొల్పారు. గత 10 ఏళ్లుగా ఫేస్బుక్లో వన్యప్రాణుల చిత్రాలను నిరంతరం పోస్ట్ చేస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఈ క్రమంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయనకిది 4వ రికార్డు. ఈ అవార్డు కిట్‌లో డిజైనర్ పెన్, పుస్తకం, బ్యాడ్జ్‌లు, ఐడి కార్డ్ , ముఖ్యంగా పతకం ఉన్నాయి! ఐ లవ్ దిస్ కిట్ అంటూ డా. సుధీర్ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇది కఠినమైందే అయినప్పటికీ ప్రతిఫలదాయకమైన ప్రయాణంలో తనకు మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by DrSudhir Hasamnis (@hasamnisdrsudhir) -
అద్భుతం.. ఈ ఛాయాచిత్రం
ప్రముఖ ఫొటోగ్రాఫర్లు తీసిన ఫొటోలు సందేశాత్మకంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్గ్యారీలో నిర్వహిస్తున్న ఇండియన్ ఫొటో ఫెస్టివల్ సందర్శకులను ఆకట్టుకుంటుంది. జనవరి 4వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ ఫెస్టివల్లో జాతీయ, అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్లు 450 మంది పాల్గొన్నారు. వారు తీసిన 1500 చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. కళలను ప్రజలకు చేరువ చేయడం, సామాజిక కథనాలు చెప్పడం, సమాజం, సంస్కృతి, పరిసరాలు, మానవ భావోద్వేగాలపై శక్తివంతమైన ఫొటోలు. పిల్లలు, యువ ఫొటోగ్రాఫర్లకు ప్రోత్సాహం కల్పించడం. భారత ఫొటోగ్రఫీ పరిశ్రమను బలోపేతం చేయడం. ఫొటో ఫెస్టివల్లో ఎగ్జిబిషన్లు, వర్క్‌షాప్‌లు, టాక్స్, ప్యానల్ డిస్కషన్లు, పోర్ట్‌ఫోలియో రివ్యూలు, ఫొటో బుక్లాంచ్లు జరుగనున్నాయి. పాల్గొన్న దేశాలు బ్రెజిల్, సౌత్‌కొరియా, కొస్టారికా, రష్యా, బెల్జియం, యూకే, ఫ్రాన్స్, ఇరాన్, జర్మనీ, నెదర్లాండ్స్, టర్కీ, నైజీరియా, నేపాల్ తదితర దేశాలు పాల్గొన్నాయి. (చదవండి: అక్షరం అజరామరం..! భాగ్యనగరంలో పాతపుస్తకాలకు తరగని ఆదరణ) -
మన ఉత్తమ కమాటికి ఫొటో అవార్డు
లండన్: అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమస్యలపై ఆట్కిన్స్ సివెమ్ (సీఐడబ్లూఈఎం) నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో భారత్‌కు చెందిన ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ ఉత్తమ కమాటి తీసిన ఫొటోకు ఉత్తమ ఫొటో అవార్డు లభించింది. భారత్ లోని తీస్తా నది నుంచి ఓ పైపు ద్వారా సూదూరానున్న తమ పుచ్చకాయల పంటకు నీరు పెడుతున్న ఓ దంపతుల శ్రమైక జీవన చిత్రమిది. ఈ ఫొటోకుగాను కమాటికి లక్ష రూపాయల బహుమతిని అందజేశారు. మొత్తం 60 దేశాల నుంచి ఫొటోగ్రాఫర్లు, ఫిల్మ్‌మేకర్స్ నుంచి దాదాపు పదివేల ఫొటోలు పోటీకి రాగా అందులో 111 ఫొటోలను ఎంపిక చేశారు. వివిధ కేటగిరీల కింది వీటికి ఉత్తమ, ద్వితీయ, తృతీయ ఫొటో అవార్డులను ప్రకటించారు. నగరంలోని దక్షిణ కెన్సింగ్ఘన్లోని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ వేదికపై ఈ 111 ఫొటోలను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శన జూలై పదవ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ‘చార్టర్డ్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ (సీఐడబ్లూఈఎం)’ 2007లో ఈ అంతర్జాతీయ అవార్డును ఏర్పాటు చేసింది. అంతర్జాతీయంగా పేరుపొందిన బ్రిటన్ బహుళార్థక ఇంజనీరింగ్ కంపెనీ ‘ఆట్కిన్స్’ అవార్డులకు ఆర్థిక సహాయం చేస్తుండడంతో ఈ అవార్డుకు ‘ఆట్కిన్స్ సివెమ్’ అని పేరుపెట్టారు.


