క్రీ.శ. 629 (హిజ్రీ 7) సంవత్సరంలో నిర్మించబడిన చేరమాన్ జుమా మస్జిద్, కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు; అది భారత ఉపఖండంలో మతసామరస్యానికి, ఆధ్యాత్మిక అన్వేషణకు, సంస్కృతీ సంప్రదాయాల సంగమానికి అపుర్వమైన చిహ్నంగా నిలిచింది. మస్జిద్ నిర్మాణ శైలిలో ఆ కాలపు కేరళ శిల్ప సౌందర్యం ప్రతిబింబిస్తుంది. కానోపు (గుడార ఆకారం) ఆకారంలో కట్టిన గోపురం, కలపతో నిర్మించిన పైకప్పు, పురాతన సాంప్రదాయ నూనెదీపం – ఇవన్నీ దక్షిణ భారత ఆర్కిటెక్చర్‌కి ఇస్లామిక్ రూపాన్ని అద్దిన అరుదైన ఉదాహరణ. కాలక్రమేణా అనేక పునరుద్ధరణలు జరిగినా, ప్రాథమిక రూపం చెక్కు చెదరకుండా కాపాడబడుతూ వస్తోంది. అక్కడి ఇమామ్‌లు ఇప్పటికీ తమ వంశావళిని మాలిక్ ఇబ్నె దినార్ వరకు కలిపి చెప్పుకుంటారు.
మస్జిద్ చతురస్ర ఆకారంలో పురాతన కళా వైభవాన్ని చాటుతోంది. మస్జిద్ కు సంబంధించిన కాంప్లెక్స్ లో చేరామన్ మ్యూజియం, వెనుక భాగంలో అందమైన కొలను, కుడి పక్కన ఖబ్రస్తాన్ , అందులో పచ్చని నిశ్శబ్దంతో తలలూపుతున్న కొబ్బరి చెట్లు, వివిధ రకాల మొక్కలు, కాలానికి అనుగుణంగా మార్పు చెందిన రాతి మెట్లు, మస్జిద్ లోపలి భాగం మధ్యలో వేలాడుతున్న పురాతన నూనెదీపం, అత్యంత సుందరమైన చెక్క మింబర్ ఇవన్నీ ఆ ప్రదేశాన్ని ఒక చరిత్రకావ్యంలా మార్చేశాయి.
అక్కడి స్థానికులు చెప్పిన ఒక మాట ప్రకారం ‘‘ఇది కేవలం మస్జిద్ కాదు, ఇది భారత దేశానికి ఇస్లాం ప్రవేశ ద్వారం.’’ఈ ఒక్క వాక్యంతో ఆ స్థలం ప్రాముఖ్యత పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. సముద్ర గాలిలోనూ, ప్రార్థన ధ్వనిలోనూ, ఆ భూమి ఇంకా చెరామాన్ పెరుమాళ్ ఆత్మను ఆత్మీయంగా మీటుతూనే ఉన్న అనుభూతి కలుగుతుంది.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్


