ముఖంపై బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, నల్లటి మచ్చలు లేకుండా కాంతిమంతంగా ఉండాలంటే ఈ డివైజ్ బెస్ట్. అలాగే శీతాకాలంలో ముఖం వడిలిపోకుండా తాజాగా ఉండాలంటే మాత్రం ఈ సింపుల్ టిప్ ఫాలో అయ్యిపోండి చాలు..మరి సులభమైన చిట్కాలు, హెల్ప్ అయ్యే బ్యూటీ డివైజ్‌ల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, నల్లటి మచ్చలు, గీతలు, మొటిమలు ఇవి ముఖాన్ని కళావిహీనంగా మారుస్తుంటాయి. ఇలాంటి సమస్యలను దూరం చెయ్యడానికి ఇప్పుడు సాంకేతికత బాగానే తోడవుతోంది. చిత్రంలోని ఈ స్కిన్ క్రష్ మైక్రోడెర్మాబ్రేషన్ డివైస్ – చర్మాన్ని మెరిపించడానికి రూపొందించిన ఒక అధునాతన సాధనం. ఈ డివైస్‌తో చర్మాన్ని లోతుగా శుభ్రం చేసుకోవచ్చు. ఇది చర్మం పైపొర నుంచి నిర్జీవ కణాలను ఇట్టే తొలగిస్తుంది. దాంతో చర్మం మరింత నునుపుగా, తాజాగా మారుతుంది. నిగారింపుకు రాసే సీరమ్, క్రీమ్, మాయిశ్చరైజర్ వంటివి అప్లై చేసుకునే సమయంలో కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవచ్చు.
ఈ మెషిన్‌తో పాటు చాలా హెడ్స్ లభిస్తాయి. వాటిని అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. నిజానికి ఈ పరికరాన్ని ఉపయోగించడం చాలా తేలిక. మొదటగా చర్మాన్ని చల్లటి నీళ్లతో కడుక్కుని, పొడి గుడ్డతో తుడవాలి. తర్వాత, చర్మాన్ని కొద్దిగా సాగదీస్తూ ఈ పరికరాన్ని చర్మానికి ఆనించి, పైకి లేదా వెలుపలి దిశలో నెమ్మదిగా కదిలించాలి. దీనిలో ఆన్, ఆఫ్‌తో పాటుగా ‘లో, మీడియం, హై’ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి.
ఎప్పుడైనా సరే, మీడియం మోడ్ సౌకర్యంగా అనిపిస్తేనే, హై మోడ్ పెట్టుకోవచ్చు. చర్మం ఎర్రబడినా, మంటగా అనిపించినా వెంటనే దీని వాడకం ఆపెయ్యడం ఉత్తమం. చికిత్స పూర్తయిన తర్వాత, తేలికపాటి మాయిశ్చరైజర్ లేదా సీరమ్ రాసుకోవాలి. మంచి ఫలితాల కోసం, దీనిని వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు. అయితే, ఈ చికిత్స తర్వాత 24 గంటల పాటు లేదా చర్మం సాధారణ స్థితికి వచ్చే వరకు ‘విటమిన్ ఏ’ లేదా రెటినోల్స్ ఉన్న ఉత్పత్తులను ఉపయోగించకూడదు.
మెరుపునిచ్చే చిట్కా
శీతకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చర్మం వడిలిపోయినట్లు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంది. పొడి చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చుకోవడానికి, ఇలా ప్రయత్నిస్తే సరిపోతుంది. ఒక చిన్న బౌల్‌లో ఒక టీ స్పూన్ బాదం పేస్ట్ (4–5 బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి, ఉదయం పేస్ట్ చేసుకోవాలి.), 2 టీస్పూన్లు చిక్కటి పచ్చి పాలు, 4 చుక్కల గ్లిజరిన్ వేసుకుని బాగా కలుపుకోవాలి.
ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి, 15 లేదా 20 నిమిషాలు ఆరిపోయే వరకు ఉంచుకోవాలి. తర్వాత, గోరువెచ్చని నీటితో సున్నితంగా మసాజ్ చేస్తూ కడిగేసుకోవాలి. ప్యాక్ తొలగించిన తర్వాత చర్మం చాలా మృదువుగా మారుతుంది. ఎందుకంటే బాదంలో విటమిన్–ఇ పుష్కలంగా ఉంటుంది,
ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి చర్మానికి చక్కటి పోషణనిస్తుంది. పాలలో ఉండే కొవ్వు, లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరుస్తూ, తేమగా ఉంచుతాయి. అలాగే గ్లిజరిన్ చర్మంలోని తేమను నిలిపి ఉంచుతుంది. దాంతో వారానికి ఒకసారి ఈ మాస్క్ పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
(చదవండి: ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..! కనీసం నిద్రపోలేదు కూడా..)


