బ్యాంకాక్: థాయ్‌లాండ్ పార్లమెంటు శుక్రవారం రద్దయింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు, కాంబోడియాతో ఘర్షణల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ పార్లమెంటును రద్దు చేశారు. రాజు మహా వజీరాలాంగ్‌కార్న్ అనుమతి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు అనుతిన్ ప్రకటించారు.
అయితే ‘అధికారాన్ని తిరిగి ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా’ అని గురువారం రాత్రి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన అనుతిన్ రద్దుపై ముందే సంకేతాలిచ్చారు. పార్లమెంటు రద్దు తరువాత 45 రోజుల నుంచి రెండు నెలలలోపు ఎన్నికలు జరగాలి. ఈలోపు పరిమిత అధికారాలతో అనుతిన్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు. థాయ్‌లాండ్‌కు కంబోడియాతో సరిహద్దు వివాదం దీర్ఘకాలంగా కొనసాగుతోంది. రెండు వైపులా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఘర్షణల్లో ఈ వారమే 20 మందికి పైగా మరణించారు. ఈ ఉద్రిక్తతల సమయంలో పార్లమెంటు రద్దు నిర్ణయం కీలకంగా మారింది. సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా రాజీనామా చేసిన షినవ్రతా స్థానంలో అనుతిన్ బాధ్యతలు తీసుకున్నారు. మూడు నెలలు మాత్రమే ప్రధానమంత్రిగా ఉన్నారు.


