భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ (ఈవీ బ్యాటరీ) డిమాండ్ వచ్చే ఏడేళ్లలో గణనీయంగా పెరనుందని కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ (సీఈఎస్) సంస్థ అంచనా వేసింది. 2025లో ఈవీ బ్యాటరీ డిమాండ్ 17.7 గిగావాట్ హవర్ (జీడబ్యూ్యహెచ్) ఉండగా, 2032 నాటికి 256.3 గిగావాట్లకు చేరుకోనున్నట్టు తెలిపింది. ఏటా 35 శాతం కాంపౌండెడ్ వృద్ధి (సీఏజీఆర్) ఈ రంగంలో నమోదు కావొచ్చని అంచనా వేసింది. ఇంధన ధరలు పెరుగుతుండడం, ఎలక్ట్రిఫికేషన్‌ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండడం, వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్, ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు విడుదల అవుతుండడం, విధానపరమైన మద్దతు అన్నీ కలసి ఈవీ మార్కెట్ భారీ వృద్ధికి అనుకూలిస్తున్నట్టు తన నివేదికలో సీఈఎస్ వివరించింది.
‘‘భారతదేశ ఎలక్ట్రిక్ వాహన విప్లవానికి బ్యాటరీ కెమిస్ట్రీ పురోగతులు కీలకమైనవి. ఎల్‌ఎఫ్‌పీ జెన్ 4, సోడియం అయాన్ టెక్నాలజీ ఆవిష్కరణలు కేవలం సాంకేతికపరమైన పురోగతులే కాదు. ఎలక్ట్రిక్ వాహనాలను మరింత అందుబాటు ధరలకు తీసుకొచ్చే సంచలనాలు. సురక్షితమైన, ఒక్కచార్జ్‌తో మరింత దూరం ప్రయాణించేందుకు వీలు కల్పిస్తాయి’’అని సీఈఎస్ ఎండీ వినాయక్ వలింబే తెలిపారు. ఎల్‌ఎఫ్‌పీ జెన్4 సెల్స్ అన్నవి ఇప్పుడు 300 వాట్‌హవర్/కిలోని అధిగమించాయంటూ.. ఎక్కువ దూరం ప్రయాణించేందుకు, ధరలు తగ్గేందుకు అనుకూలిస్తాయ ఈ నివేదిక తెలిపింది.
సవాళ్లను అధిగమించాలి..
భారత్ తన ఎలక్ట్రిఫికేషన్ (ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లడం) లక్ష్యాలను సాధించేందుకు వీలుగా పరిశ్రమతో సహకారం, బలమైన బ్యాటరీ ఎకోసిస్టమ్ ఏర్పాటు, వ్యూహాత్మక పెట్టుబడుల సవాళ్లను అధిగమించేందుకు విధానపరమైన జోక్యం అవసరమని సీఈఎస్ నివేదిక సూచించింది. బ్యాటరీల్లో వినియోగించే కీలక ముడి పదార్థాలను, ఖనిజాలపై చైనా నియంత్రణలు.. భారత్‌లో గిగాఫ్యాక్టరీల నిర్మాణాన్ని నిదానింపజేయొచ్చని, సరఫరా వ్యవస్థ రిస్‌్కలకు దారితీయొచ్చని హెచ్చరించింది. అధిక ఆరంభ పెట్టుబడులకుతోడు, దేశీయంగా ఖనిజ నిల్వలు పరిమితంగా ఉండడం భారత స్వావలంబన లక్ష్యాలకు విఘాతం కలిగిస్తాయని పేర్కొంది.


