రాష్ట్రంలో సామాన్య, మధ్యతరగతి ఇళ్ల కొరత
భూముల ధరలు, నిర్మాణ వ్యయం పెరగడమే కారణం
చౌక గృహాల నిర్మాణం సరైన విధానం.. పీపీపీ
హైదరాబాద్‌లో సామాన్యుడికి సొంతిల్లు కలే. దీన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి. నిజం చెప్పాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలోనే సామాన్య, మధ్యతరగతి ఇళ్ల సరఫరా పెరుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాల రూపంలో ప్రైవేట్ సంస్థలను ఆకర్షించాల్సి ఉంటుందని నిర్మాణ సంఘాలు కోరుతున్నాయి. కొరతను అధిగమించేందుకు చిన్న, తక్కువ ధరల ఇళ్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సిటీ అభివృద్ధి ఔటర్ దాటింది. కనెక్టివిటీ, సామాజిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. దీంతో సామాన్యులకు గృహాలు కొనగలుగుతారు. – సాక్షి, సిటీబ్యూరో
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో ఇళ్ల డిమాండ్‌పై రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ సర్వే చేపట్టింది. రాష్ట్రంలో మధ్యతరగతి వర్గాలకు 20.30 లక్షలు, పేద వర్గాలకు 8.70 లక్షల ఇళ్లు కలిపి.. మొత్తం 29 లక్షల ఇళ్ల డిమాండ్ ఉందని తేలింది. ఈ కొరతను అధిగమించాలంటే పీపీపీ విధానం మేలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్‌ఆర్), రీజినల్ రింగ్ రోడ్(ఆర్‌ఆర్‌ఆర్) మధ్య పీపీపీ విధానంలో సరసమైన గృహాలను నిర్మించే యోచన చేస్తున్నట్లు ఇటీవల గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్యలో పేద, మధ్యతరగతి ప్రజలకు కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మౌలిక వసతుల కల్పన..
అందుబాటు గృహాలను నిర్మించాలంటే నగరంలో స్థలం కొరత. దీంతో శివారు ప్రాంతాలకు వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే ముందుగా శివారుల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి. అప్పుడే డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరూ ముందుకొస్తారు. ఓఆర్‌ఆర్, త్రిబుల్ ఆర్ మధ్య ప్రభుత్వం నీరు, డ్రైనేజీ, విద్యుత్, ప్రజా రవాణా, ఆస్పత్రులు, పాఠశాలలు వంటి మౌలిక, సామాజిక వసతులను కల్పించాలి. అలా చేస్తే అందుబాటు గృహాల నిర్మాణాలు ఊపందుకుంటాయి.
ప్రభుత్వం ఉచితంగా స్థలాలను కేటాయించి.. జాయింట్ వెంచర్‌గా అందుబాటు గృహాలను నిర్మిస్తే విజయవంతం అవుతాయి. ఎలాగంటే.. ప్రైవేట్ నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాయి కనుక నిర్మాణంలో నాణ్యతతో పాటూ వారికి దక్కే వాటా ఫ్లాట్లు ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించుకుంటారు. దీంతో ప్రాజెక్ట్‌లో భిన్నమైన సంస్కృతి వస్తుంది. నిర్వహణ కూడా బాగుంటుంది. అలాగే ఈ తరహా నిర్మాణాలకు రిజి్రస్టేషన్ చార్జీలను నామమాత్రంగా వసూలు చేయాలి.
ముచ్చటగా మూడు పద్ధతులు
➤ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం రాష్ట్రాన్ని మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించి ప్రణాళికలు రూపొందిస్తుంది.
➤కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్)లో మురికివాడలను యథాస్థితిలో పునరాభివృద్ధి చేయనున్నారు. ఐటీ కారిడార్లలో అందుబాటు ధరల్లో అద్దె గృహాల విధానాన్ని తీసుకురానున్నారు.
➤పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ(ప్యూర్) పరిధిలో బహుళ అంతస్తుల గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనున్నారు. అలాగే పారిశ్రామిక క్లస్టర్ల వద్ద కార్మికులకు సరసమైన ధరలకు గృహాలు నిర్మించడంపై దృష్టిపెడతారు.
➤మిగిలిన ప్రాంతం పరిధిలో చిన్న, మధ్య తరహా టౌన్íÙప్‌లు, పారిశ్రామిక పార్క్‌లు, లాజిస్టిక్ హబ్‌లతో గృహ నిర్మాణ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.


