రూపాయి నేలచూపులు.. ప్రభుత్వానికి సవాల్! | Key Reasons Behind Rupee Fall Recovery Suggestions | Sakshi
Sakshi News home page

రూపాయి నేలచూపులు.. ప్రభుత్వానికి సవాల్!

Dec 13 2025 12:49 PM | Updated on Dec 13 2025 1:20 PM

Key Reasons Behind Rupee Fall Recovery Suggestions

భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోవడం దేశీయ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న తాజా పరిణామం. ఇటీవల రూపాయి మారకం విలువ తొలిసారిగా డాలర్‌తో పోలిస్తే రూ.90.4 వద్ద ఆల్-టైమ్ కనిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ బలం తగ్గుతున్నప్పటికీ రూపాయి పతనం కొనసాగడం అనేక అంతర్జాతీయ, దేశీయ సంక్లిష్టతలను సూచిస్తోంది. ఈ పతనం దేశంలో ద్రవ్యోల్బణం పెంచే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రూపాయి పతనానికి కారణాలు

భారత రూపాయి విలువ ఈ విధంగా జీవనకాల కనిష్టానికి చేరడానికి ప్రపంచవ్యాప్త ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక అనిశ్చితులు, దేశీయ పరిణామాలు సంయుక్తంగా కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను గతంలో పెంచింది. దీని కారణంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో పెట్టుబడి పెట్టిన విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ) తమ నిధులను వెనక్కి తీసుకొని అధిక రాబడి కోసం డాలర్ ముడిపడిన ఆస్తుల్లోకి మళ్లించారు. దీనివల్ల డాలర్‌కు డిమాండ్ పెరిగి రూపాయిపై ఒత్తిడి పెరిగింది.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల ఉద్రిక్తతలు వంటి భౌగోళిక అనిశ్చితులు అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా భావించే అమెరికన్ డాలర్‌కు ప్రాధాన్యత ఇవ్వడం రూపాయి బలహీనతకు దారితీసింది.

దేశీయ, వాణిజ్య పరిణామాలు

భారతదేశం దిగుమతి చేసుకునే విలువ, ఎగుమతి చేసే విలువ కంటే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ముడి చమురు, బొగ్గు, ఎలక్ట్రానిక్స్, బంగారం వంటి వాటి దిగుమతులు అధికంగా ఉండటంతో వాటిని కొనుగోలు చేయడానికి భారీ మొత్తంలో డాలర్లు అవసరం. దీనివల్ల డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గింది.

ముడి చమురు ధరల పెరుగుదల

భారతదేశ అవసరాల్లో దాదాపు 85% వరకు చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఇది రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది.

విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి భారీ మొత్తంలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం (సుమారు 17 బిలియన్‌ డాలర్లకు పైగా) రూపాయి పతనానికి ప్రధాన కారణమైంది. దాంతోపాటు అమెరికా విధించిన పరస్పర సుంకాలు, వాణిజ్య ఒప్పందంపై జాప్యం కూడా రూపాయి విలువపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.

సవాళ్ల పరిష్కారం ఇలా..

ఈ సంక్లిష్టమైన సవాళ్లను అధిగమించడానికి, రూపాయి స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం, ఆర్‌బీఐ, ఇతర అధికార యంత్రాంగాలు పటిష్టమైన దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవాలి.

ఆర్‌బీఐ తరఫున తీసుకోవాల్సిన చర్యలు

రూపాయి విలువ పతనాన్ని నిలువరించడానికి ఆర్‌బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల నుంచి మార్కెట్‌లోకి డాలర్లను విక్రయించడం ద్వారా రూపాయికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. (ఆర్‌బీఐ ఇప్పటికే లండన్, సింగపూర్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో జోక్యం చేసుకుంది) ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, విదేశీ పెట్టుబడిదారులు తిరిగి ఆకర్షించడానికి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచేందుకు (రెపో రేటు) నిర్ణయం తీసుకోవచ్చు. ఇది పెట్టుబడులకు ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎన్నారైలు విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంకులు) డిపాజిట్లను పెంచేందుకు వారికి ప్రత్యేక ఆకర్షణలు, మినహాయింపులు ప్రకటించడం ద్వారా దేశంలోకి డాలర్ల ప్రవాహాన్ని పెంచవచ్చు.

అధికార యంత్రాంగం..

ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకాలు, రాయితీలు ప్రకటించవచ్చు. స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అవసరమైన మౌలిక వసతులు, లాజిస్టిక్స్ మెరుగుపరచాలి. ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలి. అలాగే బంగారం దిగుమతిపై సుంకాలను పెంచడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా దిగుమతులపై ఖర్చును తగ్గించవచ్చు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను మరింత సులభతరం చేయాలి. పారిశ్రామిక విధానాలు, పన్నుల విధానంలో స్థిరత్వం, స్పష్టత ఉండేలా చూడాలి. అంతర్జాతీయ వాణిజ్యాన్ని అమెరికన్ డాలర్‌కు బదులుగా రూపాయిలో నిర్వహించేందుకు ఇతర దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను వేగవంతం చేయాలి. ఇది డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా నిఫ్టీ సూచీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement