కోకాపేటలో ఎకరం రూ.151 కోట్లు..! | Record Price For Kokapet Land In Hyderabad | Sakshi
Sakshi News home page

కోకాపేటలో ఎకరం రూ.151 కోట్లు..!

Dec 13 2025 11:46 AM | Updated on Dec 13 2025 11:46 AM

Record Price For Kokapet Land In Hyderabad

29 ఎకరాలకు రూ.3,862 కోట్లు

మొదటి నుంచి కోకాపేట్‌ భూముల్లోనే రియల్‌ మార్కెట్‌ జోష్‌
 

1 కోకాపేట్‌ మరోసారి రియల్‌ ప్రకంపనలను సృష్టించింది. హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) గత నవంబర్, ఈ డిసెంబర్‌ నెలల్లో మూడు దఫాలుగా నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో 29 ఎకరాలపైన రూ.3,862 కోట్ల ఆదాయం లభించింది. మొదటి నుంచి ఇక్కడ భూమి హాట్‌కేక్‌లాగే అమ్ముడు కావడం విశేషం. ఫార్చ్యూన్‌ 500 కంపెనీలు కొలువుదీరిన పడమటి ప్రాంతం కార్పొరేట్‌ సంస్థలకు కొంగు బంగారంగా మారింది. కోకాపేట్‌ నియోపోలిస్‌ లే అవుట్‌లో 2021లో మొదటి దశ 64 ఎకరాలను విక్రయించారు. అప్పట్లో ఈ భూములపై సుమారు రూ.2,000 కోట్లకు పైగా ఆదాయం లభించింది. 2023 ఆగస్టులో నిర్వహించిన రెండో దశ బిడ్డింగ్‌లో 45.33 ఎకరాలను విక్రయించగా, రూ.3,300 కోట్లు లభించాయి. ఈసారి 29 ఎకరాలపైన రూ.3,862 కోట్లు లభించింది. 2023లో ఎకరం గరిష్టంగా రూ.100.75 కోట్లకు విక్రయించగా, ఈసారి రికార్డు స్థాయిలో రూ.151 కోట్లు పలికింది. రియల్‌ ఎస్టేట్‌ వర్గాల నుంచి ఇంతటి భారీ స్థాయిలో స్పందన లభించడంతో ఇదే ప్రాంతంలో ఉన్న మరో 70 ఎకరాలను విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ సన్నద్ధమవుతోంది.

2 ఒకేచోట సకల సదుపాయాలు.. 
ఒకవైపు ఔటర్‌రింగ్‌రోడ్డు, మరోవైపు రాయదుర్గం వరకు కేవలం 5 కిలో మీటర్ల పరిధిలోనే వందలాది కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు రూ.కోట్లలో పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. మరోవైపు అన్ని రకాల సదుపాయాలతో నియోపోలిస్‌ లే అవుట్‌ను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసింది. సుమారు 200 మీటర్ల ఎత్తు వరకు ఇక్కడ భవనాల నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలు, బడా రియల్టర్లు, డెవలపర్లు మొదటి నుంచీ నియోపోలిస్‌ కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. మొదటి దశలో ఒకటి నుంచి 5 వరకు ఉన్న ప్లాట్‌లను 
విక్రయించగా రెండో దశలో 6 నుంచి 14 వరకు ఉన్న ప్లాట్‌లను విక్రయించారు. 
మూడో దశలో 15 నుంచి 20 వరకు ఉన్న భూములకు బిడ్డింగ్‌ నిర్వహించారు.  

3 రూ.7వేల కోట్లు లక్ష్యంగా
రియల్‌ ఎస్టేట్‌ రంగంలో చోటుచేసుకున్న ఈ స్పీడ్‌ను ఇలాగే కొనసాగించేందుకు కొత్త సంవత్సరంలో మరో 70 ఎకరాలను విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేసింది. దీని ద్వారా సుమారు రూ.7 వేల కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ఎకరం సగటున రూ.100 కోట్ల చొప్పున విక్రయించినా నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ రైజింగ్‌–47లో భాగంగా భారీ ఎత్తున ఎలివేటెడ్‌ కారిడార్లు, గ్రీన్‌ ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్లు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

  1. కోకాపేట్‌ ప్రత్యేకతలు.. 
    కోకాపేట్‌ నియోపోలిస్‌ సముద్ర మట్టానికి 588 మీటర్ల ఎత్తులో ఉంది. 

  2. సుమారు రూ.300 కోట్లతో హెచ్‌ఎండీఏ ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. 

  3. సైకిల్‌ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు తదితర సదుపాయాలతో 45 మీటర్లు, 36 మీటర్లు వెడల్పుతో అంతర్గత రోడ్లను నిర్మించారు. 

  4. నియోపోలిస్‌లో ఎన్ని అంతస్తులైనా హైరైజ్‌ బిల్డింగ్‌లను నిర్మించుకోవచ్చు.  

  5. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌కు 5 నిమిషాలు, ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాలు, హైటెక్‌సిటీకి 20 నిమిషాల వ్యవధిలో చేరుకొనే విధంగా రోడ్డు నెట్‌వర్క్‌ అందుబాటులో ఉంది.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement