లేదంటే తీసుకున్న డబ్బులు వాపస్ ఇవ్వండి
మహబూబాబాద్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఘటన
జెండాపై ప్రమాణం చేయండి
పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో కొందరు ఏదో ఒక రూపంలో తమ అక్కసును వెళ్లగక్కారు. ఓటమిని జీర్ణించుకోలేని ఓ సర్పంచ్ అభ్యర్థి రైతులు పొలాలకు వెళ్లే దారిని మూయించాడు. మరోచోట సర్పంచ్ అభ్యర్థి ఓడిపోగా, ఆమె భర్త ఓటర్లతో ప్రమాణం చేయించడం, ఇచ్చిన డబ్బు తిరిగి ఇమ్మని అడగడం వైరల్ అయింది.
సాక్షి, మహబూబాబాద్: ‘మీరు నా వద్ద డబ్బులు తీసుకున్నారు. కానీ ఓటు వేయలేదు. దీంతో నేను ఓడిపోయాను. నిజంగా నాకు ఓటు వేసినవారు దేవుడి జెండాపై ప్రమాణం చేయండి. లేదంటే నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇవ్వండి’అంటూ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ అభ్యర్థి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకుంటున్న ఘటన మహబూబాబాద్ జిల్లా సోమ్లాతండాలో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమ్లాతండా సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్న దళ్‌సింగ్ భార్య కౌసల్య పోటీ చేశారు.
అదే తండాకు చెందిన ఇస్లావత్ సుజాత కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల్లో రెబల్ అభ్యర్థి సుజాత గెలిచారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌసల్య భర్త దళ్‌సింగ్ శుక్రవారం తండావాసుల ఆరాధ్య దైవమైన అమర్‌సింగ్ మహరాజ్ జెండా పట్టుకొని.. ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటు వేసినట్టు ప్రమాణం చేయాలని. లేకపోతే.. నా డబ్బులు నాకు ఇవ్వాలని అడిగిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తండాకు తాగునీటి సరఫరా అయ్యే ప్లాంట్ పైపులు పగులగొట్టడం, దేవుడి గుడికి తాళం వేసిన సన్నివేశాలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తమ వద్దకు వచ్చి కాళ్లు పట్టుకొని బతిమిలాడి ఓటు వేయాలని డబ్బులిచ్చారని.. ఇప్పుడు దౌర్జన్యంగా రికవరీ చేస్తున్నారంటూ తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు వచ్చి గొడవను సద్దుమణిగేలా చేశారు.
బాట బంద్ చేయించాడు
ధరూరు: గ్రామస్తులు తనకు ఓటు వేయలేదని...తన పొలం మీదుగా వెళ్లడానికి వీలు లేదంటూ ఓటమి పాలైన ఓ సర్పంచ్ అభ్యర్థి రోడ్డుకు అడ్డంగా మట్టి పోయించాడు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని కోతులగిద్ద గ్రామానికి చెందిన బోయ రంగస్వామి సర్పంచ్ పోటీ చేశాడు. ఆయనతో కలిసి వార్డులకు పోటీచేసిన వారిలో కూడా ఒక్కరూ గెలవలేదు. దీనిని జీర్ణించుకోలేని రంగస్వామి శుక్రవారం తన పొలం పక్క నుంచి రైతుల పొలాలకు వెళ్లే బాటను బంద్ చేయించారు. దీంతో అటుగా నిత్యం రాకపోకలు సాగించే పలువురు రైతులు రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని తరాలుగా తాము అటుగా వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నామని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.


