తగ్గేదేలే.. ! | - | Sakshi
Sakshi News home page

తగ్గేదేలే.. !

Dec 14 2025 3:18 PM | Updated on Dec 14 2025 3:18 PM

తగ్గేదేలే.. !

తగ్గేదేలే.. !

ఎగిసిన ప్రలోభాలు, తాయిళాలు.. మద్యం

ఓటుకు రూ.500 నుంచి రూ.3 వేల వరకు..

అంచనాలకు మించిన ఖర్చులతో

ఆస్తుల తనఖా..

బెంబేలెత్తుతున్న

అభ్యర్థులు.. అయినా

ముందుకే..

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రెండో దశలో ఆదివారం ఉమ్మడి పాలమూరులోని 26 మండలాల పరిధిలో 565 గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి. 46 ఏకగ్రీవం పోనూ 519 జీపీల్లో పోలింగ్‌ జరగనుంది. రెండో విడత ప్రచారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియగా.. ఆ తర్వాత ప్రలోభ పర్వం ఎగిసిపడింది. మొదటి దశలో జరిగిన ఎన్నికల్లో ఆయా జీపీల్లో అభ్యర్థుల జయాపజయాలు.. లోటుపాట్లను బేరీజు వేసుకున్న రెండో విడత అభ్యర్థులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో మద్యం ఏరులై పారగా.. కుల, మహిళా సంఘాలు, యువత.. ఇలా వర్గాల వారీగా తాయిలాల పంపిణీ జోరుగా సాగింది.

ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పుంజుకోవడం చూసి కంగుతున్న ఆయా నియోజకవర్గాల్లోని అధికార కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలు రెండు, మూడో విడతలో ఎన్నికలు జరగనున్న గ్రామాలపై ప్రత్యేక నజర్‌ వేశారు. ప్రధానంగా మలి విడతలో కారు, కమలం పొత్తు.. రెబల్స్‌ ప్రభావం.. ఏ అభ్యర్థి ముందంజలో ఉన్నారు వంటి వాటితో పాటు ఆయా పల్లెల్లో ప్రభావిత వర్గాల సమాచారాన్ని తెలుసుకుని..అందుకనుగుణంగా ముందుకు సాగారు. ఈ మేరకు వారే నేరుగా ఆయా వర్గాలకు చెందిన ముఖ్యులతో మాట్లాడడంతోపాటు పలు రకాల హామీలు గుప్పించినట్లు సమాచారం. ప్రత్యర్థి పక్షంలోని తమ సన్నిహితులైన గ్రామ స్థాయి నాయకులతోనూ టచ్‌లో ఉంటూ పరిస్థితులను చక్కబెట్టేలా మంత్రాంగం నడిపించారు. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రత్యర్థి వర్గాలు సైతం పై ఎత్తులతో ముందుకుసాగినట్లు తెలుస్తోంది

ఒక్కో చోట.. ఒక్కో రేటు

రెండో విడతలో పలు గ్రామాల్లో అధికార, ప్రతిపక్షాలు బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్న క్రమంలో ప్రలోభాల పర్వం ఎగిసిపడినట్లు తెలుస్తోంది. ప్రచారం ముగిసిన శుక్రవారం రాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు పలు పల్లెల్లో వార్డులు, కూడళ్ల వారీగా విందులు.. వర్గాల వారీగా మద్యం పంపిణీ.. మహిళలకు చీరల వంటి పంపిణీని నిఘా కళ్లు తప్పించి పూర్తి చేశారు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో యూత్‌కు క్రీడా సామగ్రి పంపిణీతో పాటు మద్యం బాటిళ్లు అందజేశారు. ప్రత్యర్థి మద్దతుదారులు, బంధువుల ఇళ్లకు అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి దండాలు పెట్టడంతో పాటు ఓటుకు ఇంత చొప్పన ఎందరు ఉంటే అందరికీ లెక్కలేసి ముట్టజెప్పారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో ఓటుకు అత్యల్పంగా రూ.500.. అత్యధికంగా రూ.3 వేల చొప్పున అందజేసినట్లు సమాచారం. ఈ రేటు ఒక్కో పల్లెలో ఒక్కోరకంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధిక శాతం గ్రామాల్లో ఓటుకు రూ.వెయ్యి.. ఒక్క క్వార్టర్‌, కొన్ని చోట్ల హాఫ్‌ బాటిల్‌ మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం.

బెంబేలెత్తుతూనే ముందుకు..

తొలి విడత సర్పంచ ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్‌.. అనూహ్య ఫలితాలతో బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు ఎవరికి వారు రెండు, చివరి విడత గ్రామాలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఆయా పార్టీల మద్దతుదారులు ఎక్కడా తగ్గని పరిస్థితులు నెలకొన్నాయి. అంచనాలకు మించి రెట్టింపు ఖర్చులు అవుతుండడంతో బెంబేలెత్తుతున్నారు. ఎన్నికల కోసం ముందస్తుగా సమకూర్చుకున్న మొత్తం అయిపోవడంతో కొందరు అభ్యర్థులు ఆస్తులు, నగలు తనఖా పెట్టి నగదు తెచ్చి..పంచుతున్నారు. అయినా తగ్గేదేలే అన్నట్లు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చివరి దశ ఎన్నికలకు సంబంధించి ప్రచారం జోరుగా సాగుతోంది. రోజుకు మద్యం ఇతరత్రా ఖర్చులతో అభ్యర్థులకు ఇప్పటికే తడిసిమోపైడెంది. అసలు ఘట్టం ముందుగా ఉండగా.. ఏం చేయాలో తోచక పలువురు తలపట్టుకుంటున్నారు.

● మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌కొండ మండలంలోని ఓ గ్రామంలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి శనివారం రాత్రి పలు వార్డుల్లో ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేశాడు. కాంగ్రెస్‌ మద్దతుదారుడైన సర్పంచ్‌ అభ్యర్థి పోటీగా ఒక్కో ఓటుకు రూ.వెయ్యి, కార్టర్‌ మద్యం బాటిల్‌ పంచాడు. అయితే ఆదివారం రాత్రి బీఆర్‌ఎస్‌కు చెందిన మద్దతుదారుడు మళ్లీ ఒక్క ఓటర్‌కు క్వార్టర్‌ మద్యం బాటిల్‌, రూ.500 చొప్పున కొందరికి పంచాడు. కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా కొందరికి ఆ విధంగానే పంచాడు. ఆ తర్వాత ఓ వార్డులో లొల్లి మొదలైనట్లు తెలిసింది. తమకు మళ్లీ రాలేదంటూ కొందరు శాపనార్ధాలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

● రెండో విడతలో జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి, రాజోలి మండలాల పరిధిలోని గ్రామాల్లో సర్పంచ్‌ స్థానాలను కై వసం చేసుకునేందుకు పోటీపడుతున్న అభ్యర్థులు పలువురు తమ విలువైన భూములను తనఖా పెట్టి అప్పులు చేసినట్లు సమాచారం. మూడో విడతలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఎర్రవెల్లి, మానవపాడు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.

భార్య సర్పంచ్‌.. భర్త ఉప సర్పంచ్‌

గట్టు: మండలంలోని గొర్లఖాన్‌దొడ్డి సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ పదవులు భార్యభర్తలకు దక్కాయి. వివరాల్లోకి వెళ్తే.. మొదటి విడతలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా గొర్లఖాన్‌దొడ్డి పోలింగ్‌ జరగగా.. షేకమ్మ అలియాస్‌ శ్వేత తన సమీప అభ్యర్థి జయమ్మపై 287 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. అంతకు ముందు పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో నామినేషన్లు దాఖలు చేసి పోటీపడ్డారు. మొత్తం 12 వార్డులకుగాను 7 వార్డులు ఏకగ్రీవం కాగా.. 5 వార్డుల్లో పోటీ ఏర్పడింది. ఇందులోను సర్పంచ్‌గా గెలిచిన అభ్యర్థి షేకమ్మ పక్షానికి 3 వార్డుల్లో విజయం సాధించగా, మొత్తం 9 వార్డులు సర్పంచ్‌ పక్షం వారు గెలుచుకున్నారు. దీంతో 7వ వార్డు సభ్యుడిగా ఏకగ్రీవమైన ఉప్పరి ఆంజనేయులును మిగతా వార్డు సభ్యులు ఉప సర్పంచుగా ఎన్నుకున్నారు. దీంతో గొర్లఖాన్‌దొడ్డి గ్రామంలో భార్య షేకమ్మ సర్పంచ్‌గా, భర్త ఉప్పరి ఆంజనేయులు ఉప సర్పంచ్‌గా ఎంపికయ్యారు.

ఈ విజయం మీ అందరిదీ..

ఇంటింటికీ స్వీట్‌ బాక్సులు అందజేసిన సర్పంచ్‌

నవాబుపేట: తనను సర్పంచ్‌గా గెలిపించిన ఊరందరి నోరు తీపి చేసి కృతజ్ఞతలు తెలిపారు కొత్త సర్పంచ్‌ గీతారాణి. మండల కేంద్రానికి చెందిన గీతారాణీ సర్పంచ్‌గా విజయం సాధించిన నేపథ్యంలో శనివారం ఆమెతోపాటు కుటుంబ సభ్యులు నవాబుపేటలో ప్రతి ఇంటికి తిరిగి స్వీట్‌ బాక్సులు అందించి కృతజ్ఞతలు చెప్పారు. గెలిచినందుకు సంతోషంతో తానే మిఠాయిలు తింటే సరిపోదని తన ఊరందరి నోరు తీపి చేస్తేనే అసలైన సంబురమని ఆమె పేర్కొన్నారు.

జుట్టు కత్తిరించి.. ఓటు పట్టి

మానవపాడులో ఓ సర్పంచ్‌ అభ్యర్థి వినూత్న ప్రచారం

నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ

ఇంటింటికి తిరిగి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో గ్రామంలోని హెయిర్‌ సెలూన్‌ వద్ద ఓ వ్యక్తికి కటింగ్‌ చేసి ఓటు అభ్యర్థించడం ఆకట్టుకుంది.

– మానవపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement