విద్యుదాఘాతంతో వాహనం దగ్ధం | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వాహనం దగ్ధం

Mar 14 2026 8:21 AM | Updated on Mar 14 2026 8:21 AM

బల్మూర్‌: పశుగ్రాసం తరలిస్తున్న ఓ వాహనం విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల కేంద్రం బల్మూర్‌కు చెందిన జల్లెల సురేష్‌ పొలంలో ఉన్న పశుగ్రాసాన్ని ఇంటికి తరలిస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి గడ్డికి మంటలు అంటుకొని పశుగ్రాసంతో పాటు వాహనం కూడా దగ్ధమైంది. ప్రమాదంలో రూ.10 లక్షల వరకు నష్టం వాటిళ్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై విద్యుత్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.

ఆస్పత్రిని సీజ్‌ చేసిన అధికారులు

కొల్లాపూర్‌: పట్టణంలోని సాయికృప నర్సింగ్‌హోంను శుక్రవారం వైద్యశాఖ అధికారులు సీజ్‌ చేశారు. ఓ బాలికకు అబార్షన్‌ చేశారనే ఆరోపణల నేపథ్యంలో రెండు రోజుల క్రితం డీఎంహెచ్‌ఓ, డీఎస్పీలు తనిఖీలు చేసి ఆస్పత్రి నిర్వాహకులు కొండా శ్రీనివాసులు, వైద్య సిబ్బందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం వారిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం కలెక్టర్‌, ఎస్పీ, డీఎంహెచ్‌ఓతో పాటు పలువురు కలెక్టరేట్‌లో సమావేశమై ఆస్పత్రిని సీజ్‌ చేయాలని నిర్ణయించారు. కలెక్టర్‌ ఆదేశానుసారం డీఎంహెచ్‌ఓ రవికుమార్‌నాయక్‌, ఎస్‌ఐ సురేష్‌ ఆస్పత్రిని సీజ్‌ చేశారు. ఆస్పత్రి పై భాగంలోనే కొండా శ్రీనివాసులు కుటుంబీకులు నివాసం ఉంటున్నారు. వారు ఇంట్లోకి రాకపోకలు సాగించేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆస్పత్రిలోని రోగులకు ఇతర ఆస్పత్రులకు తరలించారు. తదుపరి అనుమతులు వచ్చే వరకు ఆస్పత్రిలో వైద్యసేవలు నిర్వహించవద్దని సూచించారు.

భర్తను కట్టేసి కొట్టిన భార్య

నాగర్‌కర్నూల్‌ క్రైం: కుటుంబ కలహాలతో భర్తను భార్య కట్టేసి కొట్టడంతో తీవ్రగాయాలైన ఘటన మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు.. మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామానికి చెందిన మేకల రాములు, భార్య లక్ష్మికి తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఈ నెల 11న మరోమారు ఇరువురు గొడవపడగా భార్య లక్ష్మి రాములును గొంతుకు టవల్‌ బిగించి దాడికి పాల్పడింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన తూడుకుర్తికి చెందిన తిరుపతయ్య రాములు కాళ్లు, చేతులను చీరతో కట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం వరకు భార్య లక్ష్మి అతడిపై దాడికి పాల్పడంతో తీవ్రగాయాలయ్యాయి. గురువారం ఉదయం తూడుకుర్తి ఉప సర్పంచ్‌ బాధితుడిని విడిపించడంతో శుక్రవారం జనరల్‌ ఆస్పత్రిలో వచ్చి చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement