గోపాల్‌పేట: మండలంలో డీ8 కాల్వ సాగునీరు గురువారం రాత్రి నుంచి నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీ8 మేజర్–2 కాల్వ కింద గోపాల్‌పేట, ఏదుట్లకు చెందిన రైతులు మొక్కజొన్న, వేరుశనగ పంటను సాగు చేసుకున్నారు. ఇంకో ఇరవై రోజులు నీరు వస్తే పంటలు పూర్తి అవుతాయి. అయితే ప్రస్తుతం డీ8 కాల్వనీరు నిలిచిపోవడంతో స్థానిక రైతులు అయోమయంలో పడిపోయారు. గోపాల్‌పేట, ఏదుట్లకు చెందిన రైతులు సుమారు తొంబై ఎకరాల వరకు మేజర్–2 కాల్వ కింద పంటలు సాగు చేశారు. డీ–8 కాల్వకింద ఈ సీజన్‌లో కేవలం రెండు గ్రామాల పరిధిలోనే తొంబై ఎకరాలు సాగు చేశారు. మొత్తంగా డీ8 కాల్వ కింద ప్రస్తుతం పది వేల ఎకరాలకు పైగా వివిధ పంటలు సాగు చేసి ఉంటార ని అంచనా. గురువారం నుంచి నీరు నిలి చిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఇంకో ఇరవై రోజులు నీరు వచ్చేలా చేయాలని కోరుతున్నారు. సాగునీటి నిలిపివేతపై వివరాలు తెలుసుకునేందుకు నీటిపారుదలశాఖ అధికారులకు ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు.
మన్యంకొండలో మైసూరు ఉత్తరాది పీఠాధిపతి
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని శుక్రవారం మైసూరు ఉత్తరాది పీఠాధిపతి దత్త విజయానంద తీర్థస్వామిజీ దర్శించుకొన్నారు. స్వామిజీకి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అళహరి మధుసూదన్‌కుమార్, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను, దేవస్థానం చారిత్రిక ప్రాధాన్యతను చైర్మన్ స్వామిజీకి వివరించారు. అనంతరం ఆలయం తరఫున శేషవస్త్రాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ జేపీఎన్‌సీ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్, రిటైర్డ్ ఆర్డీఓ హన్మంతరావు పాల్గొన్నారు.
కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఎర్రవల్లి: కృష్ణానదిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు కోదండాపురం ఎస్‌ఐ తరుణ్‌కుమార్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మానవపాడు మండలంలోని పల్లెపాడు గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణానదిలో ఓ మగ మనిషి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పంచాయతీ కార్యదర్శి నరేందర్‌రెడ్డికి తెలుపగా.. ఆయన పోలీసులకు సమాచారం అందించారన్నారు. పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 35 ఏళ్లు ఉంటుందని, ఎత్తు 5.5 అడుగులు, చామచ్చాయ రంగు, ఒంటిపై గోదుమ రంగు ప్యాంట్, పసుపు–ఆకుపచ్చ రంగు టీషర్ట్, బ్లూ రంగు బనియన్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుడి గురించి ఎలాంటి ఆచూకీ లేదని, శవం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉందని, ఎవరైనా గుర్తిస్తే కోదండాపురం పీఎస్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.


