బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
అమరచింత: బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అమరచింతకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా.. అమరచింతకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ పెద్దకుమారుడు శరత్ (24) రెండేళ్లుగా బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, ఐదురోజుల క్రితం బెంగళూరులో తాను అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి బయటికి వెవెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఈ విషయాన్ని ఇతర స్నేహితులు శరత్ తండ్రి చంద్రశేఖర్‌కు రెండు రోజుల క్రితం సమాచారం ఇచ్చారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తమ బంధువులు, యువకుడి స్నేహితుల గ్రామాల్లో వాకబు చేశారు. చివరకు శరత్ బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి శుక్రవారం రాత్రి అక్కడికి వెళ్లారు. అయితే, రోడ్డు ప్రమాదంలో శరత్ మృతదేహం ఛిద్రమైందని.. కొన్ని వస్తువులను గుర్తించి అవి తన కుమారుడివే అని కుటుంబసభ్యులు చెప్పడంతో పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అందించారు. ఇదిలాఉండగా, మృతుడు శరత్ ఐదు రోజుల క్రితం తన మొబైల్ నుంచి చెల్లెలికి రూ.3 లక్షల పంపడం, అదే రోజు తండ్రికి ఫోన్ చేసినా తండ్రి ఎత్తకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం రాత్రి భోజనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన శరత్ తన మొబైల్‌ను రూంలోనే ఉంచి బయటకు వెళ్తున్నానని చెప్పి ఇలా ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.


