సాక్షి, కోఠి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలే అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, అహంకారం, అరాచకంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైజింగ్ అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి ఢిల్లీ వెళ్లే సమయం ఉంది కానీ.. గురుకులాల్లో అస్వస్థతకు గురైన పిల్లలను పట్టించుకునే సమయం లేదా? అని ప్రశ్నించారు.
బాగ్‌లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, విద్యార్థులను హైదరాబాద్ జిల్లా కింగ్ కోఠి ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ శనివారం ఉదయం విద్యార్థులను పరామర్శించి.. ఫుడ్ పాయిజన్‌కు కారణాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం, హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకులాల్లో వసతులు, భోజనం కూడా సరిగా లేదు. 90 మంది బాగ్‌లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. ఫుట్‌బాల్ ఆడటంలో సీఎం, మంత్రులు బిజీగా ఉన్నారు. మెస్సీతో మేస్త్రీ ఫుట్‌బాల్ ఆట కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కబ్జాలు, కమీషన్లకే రేవంత్ రెడ్డి పరిమితం.. పిల్లలను పట్టించుకోవడం లేదు. 61 సార్లు ఢిల్లీ వెళ్లడానికి సమయం ఉంటుంది కానీ.. పిల్లలను పరామర్శించరా?. రేవంత్‌ది విజన్ 2047 కాదు.. పిల్లల పాలిటి పాయిజన్ 2047.
మొన్న శామీర్‌పేట బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. మాదాపూర్‌లో 43 మంది విద్యార్థులు కొండాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని విద్యార్థులు ఉన్నారు. దొడ్డు బియ్యం పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఫుట్‌బాల్ ఆడటంలో రేవంత్ బిజీగా ఉన్నారు. ప్రజల సొమ్ముతో సీఎం సోకులు తీర్చుకుంటున్నారు. కబ్జాలు, కమీషన్లకే టైమ్ సరిపోవడం లేదా?. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా ఉంది ప్రభుత్వ తీరు. బాత్ రూమ్‌లు కడిగే బ్రష్‌లతో.. వంట సామన్ కడుగుతున్నారట.

చలి తీవ్రత పెరిగింది. చల్ల నీళ్లతో అమ్మాయిలు స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్లలో 116 మంది విద్యార్థులు చనిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు.. కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. విద్యా కమిషన్ ఎక్కడికి పోయింది?. పేదల మనసులు చదువుతా అని డైలాగ్స్ కొట్టడం కాదు.. పేద పిల్లల ఆకలి తీర్చండి. రాహుల్ గాంధీ పేదల కోసం రాడు.. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడు. ఫుట్ బాల్ మ్యాచ్ చూడటానికి రాహుల్ గాంధీ వస్తారట. ఇచ్చిన హామీలు అమలు కాకపోతే రాహుల్ ఎందుకు అడగడం లేదు?. కోఠి, నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను అడిగి తెలుసుకోవాలని రాహుల్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. చిన్నారులు.. నేను పోను గురుకుల పాఠశాలకు అన్నట్లుగా మార్చారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


