హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన మాజీ అధికారి ప్రభాకర్ రావు విచారణ రెండో రోజు కొనసాగుతుంది. జూబ్లీహిల్స్‌లోని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తొలి రోజు రాత్రి వరకూ కొనసాగిన విచారణ అనంతరం, రెండో రోజు కూడా కీలక అంశాలపై లోతైన విచారణ జరుగుతున్నట్టు సమాచారం.
విచారణ పురోగతిని జాయింట్ సీపీ తఫ్సిర్ ఇక్బాల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో డిజిటల్ ఆధారాలే కీలకంగా మారడంతో, ప్రభాకర్ రావుకు సంబంధించిన ఐక్లౌడ్, జిమెయిల్ ఖాతాలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభాకర్ రావు వినియోగించిన 5 ఐక్లౌడ్, 5 జిమెయిల్ ఖాతాల్లోని డేటాను సిట్ పరిశీలిస్తోంది.
గతంలో ప్రభాకర్ రావు నాలుగు జిమెయిల్ ఖాతాలు, రెండు ఐక్లౌడ్ ఖాతాల పాస్వర్డ్లు అందజేశారు. అయితే ఆ ఖాతాల్లో డేటా కనిపించకపోవడంతో, సిట్ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు డివైసులను పంపించారు. FSL నుంచి లభించిన సాంకేతిక నివేదికల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా, సింక్ అయిన డేటా వివరాల కోసం యాపిల్, జిమెయిల్ కంపెనీల నుంచి కూడా సమాచారం సేకరించే ప్రక్రియలో సిట్ ఉంది. క్లౌడ్ సర్వర్లలో ఉన్న డేటా, లాగిన్ వివరాలు, యాక్సెస్ హిస్టరీ ఈ కేసులో కీలక ఆధారాలుగా మారనున్నాయి.
విచారణలో ప్రభాకర్ రావు నోరు మెదిపితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే తన డివైస్‌ల నుంచి తొలగించింది కేవలం వ్యక్తిగత సమాచారం మాత్రమేనని ప్రభాకర్ రావు వాదిస్తున్నట్లు సమాచారం. ఆయన వాగ్మూలంలో ఎంతవరకు నిజం ఉందన్నది యాపిల్, జిమెయిల్ సంస్థల నుంచి వచ్చే డేటాతో తేలనుంది.
రెండో రోజు విచారణలో పబ్లిక్ డేటా ట్యాపింగ్ ఎలా చేశారు?, ఆదేశాలు ఎవరిచ్చారు?, ట్యాపింగ్ కోసం ఎలాంటి సాంకేతిక పరికరాలు, కిట్స్ ఉపయోగించారు? అనే అంశాలపై సిట్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలు సమకూర్చే దిశగా సిట్ దర్యాప్తు వేగం పెంచింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరింత మంది అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతుండటంతో రానున్న రోజుల్లో ఈ కేసు మరిన్ని మలుపులు తిరగే అవకాశం ఉంది.


