హైదరాబాద్: ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్‌జెండర్లను హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్‌జెండర్లతో హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారుసిన్హా పాల్గొన్నారు. వారు నేరుగా ట్రాన్స్‌జెండర్లతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నగర సీపీ సజ్జనార్ మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు తరచూ శాంతిభద్రతల సమస్యలకు, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య ట్రాన్స్‌జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. శుభకార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదన్నారు. ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించమన్నారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని గుర్తుచేశారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఒక సమగ్రమైన పాలసీని ప్రభుత్వం తీసుకువస్తున్నట్లు చెప్పారు.

‘ప్రైడ్ ప్లేస్’తో సమస్యల పరిష్కారం: చారుసిన్హా..
ట్రాన్స్‌జెండర్ల సమస్యలను పరిష్కరించడానికే మహిళా భద్రత విభాగంలో ‘ప్రైడ్ ప్లేస్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశామని, సీఐడీ, మహిళా భద్రత విభాగ అదనపు డీజీపీ చారుసిన్హా తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరైనా వేధించినా నిరభ్యంతరంగా ఈ వింగ్‌ను ఆశ్రయించవచ్చన్నారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి మహిళా భద్రతా విభాగం సిద్ధంగా ఉందని చెప్పారు. ట్రాన్స్‌జెండర్లకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కలి్పంచేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ తప్సీర్ ఇకుబాల్, నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్, వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, మహిళా భద్రత విభాగ డీసీపీ లావన్యనాయక్ జాదవ్, సైబరాబాద డీసీపీ సృజనతో పాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


