20 ఏళ్లు పార్టీ కోసం పనిచేస్తే రోడ్డుమీద వేశారు
రాంనగర్ చౌరస్తాలో జరిగిన సభలో ఎమ్మెల్సీ కవిత
ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో ‘జాగృతి జనం బాట’
హైదరాబాద్: ఇరవై ఏళ్ల పాటు పార్టీ కోసం పని చేస్తే నన్ను తీసి రోడ్డుపై వేశారని.. తాను మొండిదానినని ప్రజల కోసం ఎవరితోనైనా కొట్లాడుతానని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ‘జాగృతి జనం బాట’కార్యక్రమం మూడో రోజు ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్‌మెట్, నాగమయ్యకుంట బస్తీలలో పర్యటించి అనంతరం రాంనగర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అడిగే వారు ఉంటే ఏ సమస్యకైనా ముందడుగు పడుతుందన్నారు. అందులో భాగంగానే సమస్యలపై నిలదీసేందుకు తాను ముందుకు వచ్చానని తెలిపారు.
నేను వస్తున్నానని అంబర్‌పేటలో రోడ్లు వేశారు..
తెలంగాణ రాకముందు హైదరాబాద్ బస్తీలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పేరుకు హైదరాబాద్‌లో ఉన్నామే తప్ప గ్రామాల్లో ఉన్న దానికంటే ఘోర పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. తాను వస్తున్నానని తెలిసి అంబర్‌పేటలో రాత్రికి రాత్రి రోడ్లు వేశారని, యాకత్‌పురాలో మంచినీటి కాలుష్య సమస్యను పరిష్కరించారని చెప్పుకోచ్చారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచి్చన ఏ హామీని పరిష్కరించలేదన్నారు. అంతకు ముందు బోనాలతో, గుర్రపు బగ్గీలతో కవితకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు మహేందర్, శివారెడ్డి, మనోజ్‌గౌడ్, డేవిడ్, మీనా తదితరులు పాల్గొన్నారు.
కళాశాలల్లో మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయాలి
కాచిగూడ: ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాగృతి జనం భాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో జాగృతి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామన్నారు.
ముసారాంబగ్ బ్రిడ్జి పనులపై ఆరా..
అంబర్‌పేట: అంబర్‌పేటలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. జనంబాట కార్యక్రమంలో శుక్రవారం అంబర్‌పేట నియోజకవర్గంలో పలు సమస్యలను పరిశీలించారు. అంబర్‌పేట ఫ్లైఓవర్ సరీ్వసు రోడ్డు, అలీకేఫ్ ప్రాంతంలో నిర్మిస్తున్న ముసారాంబగ్ బ్రిడ్జి పనులను ఆమె జాగృతి కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశి్నస్తానని ఆమె వెల్లడించారు. అనంతరం అంబర్‌పేట మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట పలువురు జాగృతి నాయకులు ప్రవీణ్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.


