ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిరోజు ప్రభాకర్‌రావును ప్రశ్నించిన సిట్ అధికారులు
ధ్వంసం, రీప్లేస్ చేసిన డిస్క్‌లపై ప్రశ్నలు
సిట్ ఎదుట లొంగిపోయిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్
సరైన సమాధానాలు రాలేదంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు శుక్రవారం సిట్ కార్యాలయంలో లొంగి పోయారు. ఉదయం 11 గంటలకు తన కుమారుడితో కలిసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఉన్న సిట్ ఆఫీస్‌కు వచ్చారు. ఈయన్ని అధికారులు వారంపాటు కస్టడీలో ఉంచుకుని ప్రశ్నించనున్నారు. తొలి రోజు సిట్ ఏసీపీ పి.వెంకటగిరితోపాటు సంయుక్త పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ప్రభాకర్‌రావును ప్రశ్నించారు. ఎస్‌ఐబీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) ద్వారా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తున్న అధికారులు తొలిరోజు ధ్వంసం చేసిన, రీప్లేస్ చేసిన హార్డ్‌డిస్క్‌ల కోణంలో ప్రశ్నించారు.
ఆధారాలు మాయం చేయడానికే..: సుదీర్ఘకాలంలో ఎస్‌ఐబీలో పనిచేసిన ప్రభాకర్‌రావు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతోనే 2023 డిసెంబర్ 4న రాజీనామా చేశారు. ఆయన ఆదేశాల మేరకే ఆ రోజు రాత్రి ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న టీఎస్‌ఎస్‌పీ హెడ్–కానిస్టేబుల్ కైతోజు కృష్ణతో కలిసి ఎస్‌ఐబీ కార్యాలయంలోకి వెళ్లానని, అధికారిక ట్యాపింగ్స్ జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలను ఆఫ్ చేయించానని మరో నిందితుడు, ఎస్‌ఓటీ చీఫ్‌గా వ్యవహరించిన ప్రణీత్‌రావు వెల్లడించారు. ఈ వార్ రూమ్‌లో ఉన్న 17 కంప్యూటర్లలో ఉన్న వాటితోపాటు విడిగా భద్రపరిచిన 26 హార్డ్ డిస్క్‌ల్ని ధ్వంసం చేయడంతోపాటు మరో ఏడింటిని కొత్త వాటితో రీప్లేస్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ధ్వంసం చేసిన హార్డ్‌డిస్క్‌ల్ని మూసీ నదిలో పారేసినట్లు ప్రణీత్‌రావు అంగీకరించారు. ఇదంతా ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే చేసినట్లు అతడు వెల్లడించిన నేపథ్యంలో ఆ హార్డ్‌డిస్క్‌ల కోణంలో సిట్ ప్రశ్నలు సంధించింది. వీటికి ప్రభాకర్‌రావు స్పందిస్తూ నిర్ణీత కాలం తర్వాత డేటాను ధ్వంసం చేసే నిబంధన ఎస్‌ఐబీలో ఉందని, తమ వద్ద దేశ భద్రతకు సంబంధించిన, సున్నిత సమాచారం ఉంటుందని, అందుకే అలా చేస్తుంటామని చెప్పారు. అయితే నిబంధనల మేరకు కేవలం డేటాను డిలీట్ చేయాల్సి ఉండగా హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం, రీప్లేస్ అనేది కేవలం ఆధారాలు మాయం చేయడానికే అని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.
ఈ కారణంగానే ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్ చేయడంతోపాటు ఐక్లౌడ్, క్లౌడ్‌ల పాస్‌వర్డ్స్‌ను మార్చేశారనే అనుమానం కలుగుతోందన్నారు. దీనికి స్పందించిన ప్రభాకర్‌రావు తాను ఎలాంటి ఆధారాల ధ్వంసానికీ ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొన్నట్లు తెలిసింది. ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా అధికారులు మూసీ నది నుంచి, గ్రీన్‌లాండ్స్‌లోని ఎస్‌ఐబీ కార్యాలయం పరిసరాల నుంచీ కొన్ని ఆధారాలు గతంలో సేకరించారు. ఈ వివరాలను ప్రభాకర్‌రావు ముందు ఉంచి ప్రశ్నించగా, ఆయన నుంచి సరైన సమాధానాలు రాలేదని, దాటవేత ధోరణిలో మాట్లాడుతున్నారని అధికారులు చెబుతున్నారు.
బెదిరింపు వసూళ్లు, నగదు అక్రమ రవాణా తదితర అంశాలతోపాటు ఎవరి ఆదేశాల మేరకు ఈ నేరాలకు పాల్పడ్డారనే దానిపై ప్రశ్నించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రశ్నలనూ సిద్ధం చేశారు. ప్రతి రెండు గంటలకు కాసేపు విరామం ఇస్తూ విచారించారు. ప్రభాకర్‌రావు కోరినప్పుడల్లా విశ్రాంతి, మందులు ఇస్తున్నామని, రోజూ ఎనిమిది నుంచి పది గంటలు ఆయన నిద్ర కోసం కేటాయిస్తామని సిట్ అధికారులు చెప్తున్నారు.


