బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రేవంత్ పాలనపై ప్రజలు విసిగిపోయారు
అధికార పార్టీ అరాచకాలను బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎదిరించారు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగినా రేవంత్ పాలనా వైఫల్యంతో ప్రజలు పూర్తిగా విసిగిపోయినట్లు గురువారం వెలువడిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ఈ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయన్నారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘తొలిదశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డుమెంబర్లుగా అనేక మంది బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచకపర్వాన్ని ఎదుర్కొని బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిలబడ్డారు. పంచాయతీ ఎన్నికల కోసం సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేశారు. పోటీ చేసిన స్థానాల్లో కనీసం 44 శాతం సర్పంచ్ పదవులు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా రాకపోవడం రేవంత్ ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం.
మరో మూడేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగనున్నా గ్రామాల్లో అభివృద్ధి జరగదని గ్రామీణ ఓటర్లు నిర్ధారణకు వచి్చనందునే కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు స్వల్ప ఓట్ల తేడాతో గెలవడం ఆ పార్టీ పతనాన్ని సూచిస్తోంది. పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయం. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యం’అని కేటీఆర్ పేర్కొన్నారు.


