మొబైల్స్‌కు డ్రాయిడ్‌ లాక్‌ ముప్పు! | Ransomware attacks on Android phones | Sakshi
Sakshi News home page

మొబైల్స్‌కు డ్రాయిడ్‌ లాక్‌ ముప్పు!

Dec 13 2025 4:06 AM | Updated on Dec 13 2025 4:06 AM

Ransomware attacks on Android phones

ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ర్యాన్సమ్‌వేర్‌ ఎటాక్స్‌ 

మాల్‌వేర్‌తో లాక్‌ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు 

అన్‌లాక్‌ చేయాలంటే భారీ మొత్తం డిమాండ్‌ 

అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: కేవలం కార్పొరేట్‌ కంపెనీలు, ప్రభుత్వ–ప్రైవేట్‌ సంస్థలు, ఐటీ ఉద్యోగులకు సంబంధించిన కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకు మాత్రమే పరిమితమైన ర్యాన్సమ్‌వేర్‌ ఎటాక్స్‌ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లకూ విస్తరించాయి. ఆండ్రాయిడ్‌ ఫోన్లను లక్ష్యంగా చేసుకొని డ్రాయిడ్‌ లాక్‌ అనే మాల్‌వేర్‌తో సైబర్‌ నేరగాళ్లు విరుచుకుపడుతున్నట్లు జిమ్పెరియం వెల్లడించింది. 

మొబైల్‌ఫోన్‌ సెక్యూరిటీ రంగంలో పేరుగాంచిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా అప్రమత్తత జారీ చేసింది. అపరిచిత మెయిల్స్, లింకులు, యాప్‌ల రూపంలో డ్రాయిడ్‌ లాక్‌ ఎటాక్స్‌ జరుగుతున్నాయని స్పష్టం చేసింది. 

ఒక్కసారి ఫోన్‌లో ప్రవేశిస్తే... 
ఈ మాల్‌వేర్‌తో కూడిన లింకులు, యాప్‌లను ఒకసారి క్లిక్‌ చేస్తే ఫోన్‌లో నిక్షిప్తం అయిపోతుంది. ఆ వెంటనే మాల్‌వేర్‌ ఆయా ఫోన్ల స్క్రీన్‌లను లాక్‌ చేస్తుంది. రిమోట్‌ యాక్సెస్‌ విధానంలో ఫోన్‌లోని ఎస్సెమ్మెస్‌లు, కాంటాక్టులు, ఆడియో రికార్డింగ్స్‌ తదితరాలకు సంబంధించిన యాక్సెస్‌ను సైబర్‌ నేరగాళ్లకు ఇస్తుంది. ఈ–కేటుగాళ్లు మాల్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ను ఆ విధంగా చేస్తున్నారు. 

ఫ్యాక్టరీ రీసెట్, లాక్‌ ప్యాట్రన్స్‌ను సైతం అధీనంలోకి తీసుకుంటున్నారు. కనీసం ఫోన్‌ను చార్జింగ్‌ చేయడానికి కూడా ఈ మాల్‌వేర్‌ అవకాశం ఇవ్వదు. ఫోన్‌ వినియోగదారులు ఎంత ప్రయత్నించినా అన్‌లాక్, రీసెట్, స్విచ్ఛాఫ్‌ చేయలేరు. కేవలం ఫోన్‌ స్క్రీన్‌పైన కనిపించేలా నేరగాడు పంపే సందేశాన్ని మాత్రమే చూడగలుగుతారు. 

బిట్‌ కాయిన్లలో డిమాండ్‌ చేస్తూ... 
కొన్ని సందర్భాల్లో ఈ మాల్‌వేర్‌ ఫోన్‌లోని డేటాను ఎన్‌క్రిప్ట్‌ చేయడం ద్వారా అది యజమాని అధీనంలో లేకుండా చేస్తుంది. అలా ఎన్‌క్రిప్ట్‌ అయిన డేటాను డీక్రిప్ట్‌ చేయడానికి, ఫోన్‌ అన్‌లాక్‌ కోసం భారీ మొత్తం చెల్లించాలంటూ ఫోన్‌ స్క్రీన్‌పై సందేశం కనిపిస్తుంటుంది. కొందరు సైబర్‌ నేరగాళ్లు ఈ డ్రాయిడ్‌ లాక్‌ ఎటాక్స్‌తో ఫోన్లను అ«దీనంలోకి తీసుకుంటూ వాటిలోని యూపీఐ యాప్స్, నెట్‌ బ్యాంకింగ్‌లను వినియోగించి బాధితుడి ఖాతాలను కొల్లగొడుతున్నారు. 

ఇలాంటి ర్యాన్సమ్‌వేర్‌ ఎటాక్‌తో లాక్‌ అయిన కొన్ని ఫోన్‌ స్క్రీన్‌లపై నిర్ణీత కాలానికి కౌంట్‌డౌన్‌ టైమింగ్‌ కూడా డిస్‌ప్లే అవుతుంది. అన్‌లాక్, డిక్రిప్షన్‌ పాస్‌వర్డ్‌ను ఆ సమయం తర్వాత నిర్వీర్యం చేస్తామని.. ఇక మీ ఫోన్‌లోని డేటా శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని సైబర్‌ నేరగాళ్లు బెదిరిస్తుంటారు. ఈలోగా తాము డిమాండ్‌ చేసిన మొత్తాన్ని బిట్‌ కాయిన్ల రూపంలోకి మార్చి తాము సూచించిన విధంగా పంపాలని స్పష్టం చేస్తున్నారు.

ఎలాంటి ప్రయత్నం చేసినా నష్టమే.. 
ఎవరైనా ఆ టైమర్‌ను, సెల్‌ఫోన్‌ను, మాల్‌వేర్‌ ప్రోగ్రామ్‌ను మార్చాలని ప్రయత్నించినా.. బిట్‌ కాయిన్‌ రూపంలో చెల్లించినట్లు తప్పుడు వివరాలతో మెయిల్‌ పంపినా నేరగాళ్లు నిర్దేశించిన డెడ్‌లైన్‌ తగ్గిపోతూ కౌంట్‌డౌన్‌ టైమర్‌లో మార్పులు రావడం ఈ మాల్‌వేర్‌కు ఉన్న మరో లక్షణం. ఫిషింగ్‌ మెయిల్స్‌తోపాటు యాప్స్, లింకుల ద్వారా మాత్రమే ఈ ఎటాక్స్‌ జరుగుతాయని సైబర్‌క్రైమ్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ తరహా ఎటాక్స్‌పై అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. 

అపరిచిత లింకులు, మెయిల్స్‌ను ఓపెన్‌ చేయడం, అనధికారిక లింకుల ద్వారా వచ్చే యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాదిలో ఈ ఎటాక్స్‌ ఎక్కువగా జరుగుతున్నాయని.. చాలా మంది వారి ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం, డేటా కోసం సైబర్‌ నేరగాళ్లు డిమాండ్‌ చేసినంత సొమ్మును బిట్‌కాయిన్లుగా చెల్లిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. ఈ మొత్తాలు అందిన తర్వాతే వారి ఫోన్లు అన్‌లాక్‌ అవుతున్నాయని వివరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement