గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ తిరిగి పట్టు సాధించిందనే భావన
1,345 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందడంపై హర్షాతిరేకాలు
కేడర్ చెక్కు చెదరలేదనడానికి ఇదే నిదర్శనమనే అభిప్రాయం
కార్యకర్తల బలంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చిందనే అంచనా
సాక్షి, హైదరాబాద్: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించడంతో బీఆర్‌ఎస్‌లో జోష్ కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొన్నామనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో నామమాత్ర ఫలితాలు సాధించిన నేపథ్యంలో.. గురువారం వెలువడిన గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. అధికార పార్టీగా కాంగ్రెస్‌కు ఉన్న అనుకూలతలను పరిగణనలోకి తీసుకుంటే తమ పార్టీ బలపరిచిన సర్పంచ్‌లు అభ్యర్థులు ఏకంగా 1,345 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించడం గొప్ప విషయమేనని పార్టీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో క్షేత్ర స్థాయిలో కోల్పోయిన పట్టు తిరిగి సాధించామనే అభిప్రాయం పార్టీ యంత్రాంగంలో వ్యక్తమవుతోంది.
కలిసివచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనోత్సవాల పేరిట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసినా పెద్దగా ప్రభావం చూపలేదని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికలు జరిగిన 31 జిల్లాల్లో తొలి విడతలో నల్లగొండ, జగిత్యాల, హనుమకొండ వంటి రెండు మూడు జిల్లాలు మినహా మిగతా చోట్ల కాంగ్రెస్‌కు దీటుగా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు గెలుచుకున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ, లోక్‌సభ ఎన్ని కల్లో పార్టీ ఓటమి చెందినా క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ చెక్కుచెదరలేదనే విషయాన్ని పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడైందని బీఆర్‌ఎస్ అంటోంది.
పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు చేసిన కృషితో పాటు అభ్యర్థుల ఎంపిక, రిజర్వేషన్లకు అనుగుణంగా అవకాశం ఇవ్వడం కలిసి వచ్చిందనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, సామాజిక పింఛన్ల పెంపు వంటి అంశాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ప్రతికూలంగా మారాయని బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది.
క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చినట్టుగా తొలి విడత ఫలితాల సరళి వెల్లడించిందని బీఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారు. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరిగే మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత మరింత స్పష్టంగా బయట పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 14, 17 తేదీల్లో జరిగే రెండు, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ నడుమ సమన్వయం పెంచడం ద్వారా.. మొత్తంగా ఐదు వేలకు పైగా పంచాయతీల్లో పార్టీ బలపరచిన అభ్యర్థులు గెలుస్తారనే ధీమా బీఆర్‌ఎస్ శిబిరంలో కనిపిస్తోంది.
ఎన్నికలు ముగిసిన తర్వాత సదస్సు.. సన్మానం
గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు లక్ష్యంగా సన్నద్ధతను వేగవంతం చేయాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులతో సదస్సు నిర్వహించి వారిని సన్మానించాలని భావిస్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. తొలి విడతలో గ్రామ పంచాయతీల వారీగా గెలుపొందిన పార్టీ మద్దతుదారుల వివరాలను సేకరించి, క్రోడీకరించే పనిలో తెలంగాణ భవన్ వర్గాలు నిమగ్నమయ్యాయి.


