తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌లో చర్చ
సంఖ్యాపరంగా ఎక్కువే అయినా ఇంకా మెరుగైన ఫలితం రావాల్సిందనే అభిప్రాయం
బీఆర్‌ఎస్ నుంచి ఎదురైన పోటీపై అంతర్గత విశ్లేషణలు
స్థానిక ఫలితంపై సీఎం ఆరా.. మిగతా రెండు విడతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్ని కల ఫలితాలపై అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత విశ్లేషణలు చేసుకుంటోంది. పార్టీలకతీతంగానే జరిగినా పక్కాగా రాజకీయ మద్దతుతోనే జరిగే ఈ ఎన్నికల్లో తమకు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణే లభించిందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందనే భావనకు ఈ ఫలితాలు చెక్ పెడతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది.
సంఖ్యాపరంగా మిగిలిన రాజకీయ పక్షాలు మద్దతిచ్చిన వారి కంటే తాము మద్దతిచ్చిన వారే ఎక్కువ సంఖ్యలో గెలిచినా, తొలి విడత ఫలితం తమకు అనుకూలమేనా అనే కోణంలోనూ ఆ పార్టీ నేతలు లెక్కలు క డుతున్నారు. ఆశించిన మేరకు 90% పంచాయతీ లు దక్కలేదని అంటున్నారు. జిల్లాలు, ఉమ్మ డి జి ల్లాలు, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు మండలాలు, గ్రామాల వారీగా ఫలితాలను విశ్లే షిస్తూ ప్రస్తుతం తమకు చట్టసభల్లో ఉన్న బలానికి, తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితానికి మధ్య తేడాను గుర్తించే పనిలో ఆ పార్టీ నేతలు పడ్డారు.
బీఆర్‌ఎస్ పోటీపై నిశితంగా.....
ముఖ్యంగా తొలి విడత ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో బీఆర్‌ఎస్ నుంచి ఎదురైన పోటీని కాంగ్రెస్ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రధానంగా మహబూబ్‌నగర్, వనపర్తి, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గట్టి పోటీ ఎదురవడంపై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వచ్చినా ఈ నాలుగు జిల్లాల్లో బీఆర్‌ఎస్ నుంచి కొంత ప్రతిఘటన ఎదురుకావడంపై పోస్టుమార్టం జరుగుతోంది. భవిష్యత్తులో ఈ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేయాలని, తొలి విడతలో కొంత మేరకు జరిగిన నష్టాన్ని 2, 3 విడతల్లో పూడ్చుకోవాలని యోచిస్తోంది.
సంఖ్యాపరంగా చూస్తే బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు వెయ్యికి పైగా పంచాయతీల్లో గెలవడంపై కూడా పార్టీ అంతర్గత విశ్లేషణల్లో నిమగ్నమైంది. దీనిపై టీపీసీసీ నేత ఒకరు మాట్లాడుతూ ‘గ్రామ స్థాయి ఎన్నికల్లో పార్టీల కంటే ప్రత్యర్థుల పనితీరు ఎక్కువగా ఫలితాలనిస్తుందని అన్నారు. బీఆర్‌ఎస్‌కు 1000 పంచాయతీలు రావడంలో పెద్దగా ఆశ్చర్యం లేదని, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ రెండోసారి గెలిచిన తర్వాత ఆ పార్టీ అత్యంత పటిష్టంగా ఉన్నప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 2,700 మంది గెలిచారని గుర్తు చేశారు.
గ్రామాల్లో అనేక సమీకరణలుంటాయని, ఆ నేపథ్యంలో కొన్నిచోట్ల ప్రతిపక్షాలకు కూడా ఎక్కువగా అవకాశాలుంటాయని, ఆ కోణంలోనే బీఆర్‌ఎస్ గెలిచి ఉంటుంది తప్ప తమ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతతో కాదని ఆయన విశ్లేషించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తొలివిడత ఫలితాల విషయంలో కాంగ్రెస్ పార్టీలో సంతోషం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల సమయానికి ఆశించిన మేరకు బలం పుంజుకున్నామని, ఈ జోరును భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని నేతలంటున్నారు.
రెండు దశలకు మరింత పకడ్బందీగా..
తొలివిడత పోలింగ్ సరళి, ఫలితాలను బేరీజు వేసుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం రానున్న రెండు దశల ఎన్నికలకు మరింత జాగ్రత్తగా, పకడ్బందీగా ముందుకెళ్లాలని భావిస్తోంది. తొలి విడత ఫలితాలపై ఆరా తీసిన సీఎం రేవంత్‌రెడ్డి 2, 3వ విడత ఎన్నికలపై మరింత దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రులకు సూచించారు. తొలి విడతలో మంచి ఫలితాలు సాధించామని, రెండు, మూడు విడతల్లో కూడా ఇంతకుమించి ఫలితాలు సాధించేలా ప్రత్యేక దృష్టితో పనిచేయాలని కోరారు. పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆయన ఆదేశించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


