మామను చంపిన అల్లుడు | Man attacked his uncle and brother in law and the uncle died | Sakshi
Sakshi News home page

మామను చంపిన అల్లుడు

Dec 13 2025 3:33 AM | Updated on Dec 13 2025 3:33 AM

Man attacked his uncle and brother in law and the uncle died

అదనపు కట్నం కోసం భార్యపై వేధింపులు

అడ్డువచ్చిన మామపై దాడి 

మృతుడు గార్ల మాజీ ఎంపీపీ

మహబూబాబాద్‌ రూరల్‌: అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన మామ, బావమరిదిపై ఓ వ్యక్తి దాడి చేయడంతో మామ మృతిచెందాడు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గార్ల మండలం భోజ్య తండాకు చెందిన బానోతు లాలునాయక్‌ (గార్ల మాజీ ఎంపీపీ), కౌసల్య దంపతుల కుమార్తె శ్రీసాయిలహరిని కురవి మండలం పెద్ద తండాకు చెందిన గుగులోత్‌ గాంధీబాబుకు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించారు. 

ఆ సమయంలో రూ.51లక్షల నగదు, 30 తులాల బంగారం, సుమారు రూ.5 లక్షల విలువగల ఇంటి సామగ్రిని కట్నంగా అందజేశారు. కొన్ని నెలల నుంచి గాంధీబాబు, అతడి తల్లిదండ్రులు సీతారాం, కవిత, అక్క బానోతు మమత కలిసి శ్రీసాయిలహరిని అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను పుట్టింటికి పంపించారు. దీంతో బాధితురాలు శ్రీసాయిలహరి ఫిర్యాదు మేరకు మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో అత్తింటివారిపై వరకట్నం, గృహహింస వేధింపుల కింద కేసు నమోదు చేశారు. 

కాగా, ఈ ఏడాది ఆగస్టులో పెద్దమనుషుల సమక్షంలో కుటుంబ తగాదాపై పంచాయితీ నిర్వహించారు. అప్పటినుంచి ఆమెను కొట్టకుండా మంచిగా చూసుకుంటానని చెప్పి గాంధీబాబు భార్యను తమ ఇంటికి తీసుకెళ్లాడు. కానీ అతని ప్రవర్తనలో మార్పురాలేదు. పైగా ఆమె పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని, అదనపు కట్నం తీసుకురాలని వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గాంధీబాబు, అతడి తల్లిదండ్రులు కలిసి శ్రీసాయిలహరిని కొట్టి హత్యచేసేందుకు యత్నించారు. 

ఆమె తప్పించుకుని ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకుని తండ్రి లాలునాయక్, అన్న ప్రదీప్‌కు ఫోన్‌ చేసి విషయం తెలియజేసింది. వారిద్దరూ వచ్చి మాట్లాడుతుండగానే గాంధీబాబు, అతడి తల్లిదండ్రులు.. ప్రదీప్, లాలునాయక్‌పై దాడిచేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన లాలునాయక్‌ను చికిత్స నిమిత్తం కుమార్తె శ్రీసాయిలహరి, కుమారుడు ప్రదీప్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని తెలిపారు. 

తన తండ్రి మృతికి కారణమైన గాంధీబాబు, అతడి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని ప్రదీప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు మహబూబాబాద్‌ టౌన్‌ సీఐ గట్ల మహేందర్‌ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement