సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని.. కొన్నిసార్లు ప్రజలు ఆమోదిస్తారు.. తిరస్కరిస్తారు.. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల్లోనే ఉండాలని ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ వచ్చిన ఆయన.. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

నంది నగర్ నివాసానికి చేరుకున్న అఖిలేష్ యాదవ్‌కు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్,ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్‌తో భేటీ అయిన అఖిలేష్ యాదవ్.. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో కేసీఆర్‌ను కలుస్తానన్నారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ తమకు స్ఫూర్తి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా 37 ఎంపీ స్థానాలు సాధించారు. దేశంలో మూడో స్థానంలో పార్టీని నిలిపారని కేటీఆర్ అన్నారు.


