మెట్లబావిలో తాబేళ్ల మృత్యువాత
కాలుష్యమయంగా మారిన పురాతన బావి
● పట్టించుకోని ఉద్యాన శాఖ అధికారులు
నాంపల్లి: పబ్లిక్ గార్డెన్‌లోని అతి పురాతన మెట్లబావి కాలుష్యమయంగా మారింది. తాబేళ్లకు ప్రాణ సంకటమైంది. అయినా ఉద్యాన శాఖ అధికారుల్లో చలనం లేకుండాపోయింది. సంరక్షణ చర్యలు చేపట్టడంలో ఈ శాఖ విఫలమైంది. తెలంగాణ శాసన మండలి ప్రవేశ ద్వారం సమీపంలోని మెట్ల బావి ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో నిండి ఉండేది. ప్రస్తుతం ఈ బావిలో మురుగునీరు వచ్చి చేరింది. మంచినీటి ఊట బావిలో లక్డీకాపూల్ నుంచి వచ్చే మురుగునీటి కాల్వ నీరు మెట్లబావిలోకి వచ్చి చేరుతోంది. ఈ కాలుష్యంతో గత ఏడాది పబ్లిక్ గార్డెన్ చెరువులో సుమారు 70 చేపలు, 22 తాబేళ్లు చనిపోయాయి. ప్రస్తుతం పదుల సంఖ్యలో తాబేళ్లు చనిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. తాబేళ్లు చనిపోవడాన్ని చూసిన వాకర్లు, సందర్శకులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. జీవవైవిధ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడాల్సిన ఉద్యాన శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ కార్యాలయం పక్కనే ఉన్న మెట్ల బావిని కూడా పరిరక్షించలేని స్థితిలో ఉన్నారని విమర్శిస్తున్నారు. వీటికి తోడు పార్కులో ప్రవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన వందలాది బస్సులు పార్కింగ్ చేసుకునేందుకు అనుమతులు ఇచ్చేశారు. ఈ విషయములో ఉద్యాన శాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాబేళ్ల మృత్యువాత ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.


