హైదరాబాద్: తెలంగాణలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 6వ తేదీ) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు రాంచందర్‌రావు. దీనికి బీజేపీ ఎన్నికల సహ ఇంచార్జ్‌లు, పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. దీనిలో భాగంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ‘ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. మేము వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఈ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వండి. యువతకు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తాం. మోడ్రన్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతాం
కబ్జాలపై ఉక్కుపాదం మోపుతాం. అవినీతి రహిత పాలన అందిస్తాం. మా పార్టీ నేతలు అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటాం. అధికారులపై కూడా చర్యలు తప్పవు. వికసిత్ మున్సిపాలిటీ, వికసిత తెలంగాణ, వికసిత భారత్‌గా తీర్చిదిద్దుతాం. ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు.. ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు. తెలంగాణకు ఏమివ్వలేదని విమర్శిస్తున్నారు. మేము ఏ జిల్లాకు ఏమిచ్చామో చెబుతాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాకు ఏమిచ్చిందో చెప్పగలరా?,
రెండ్రోజులుగా పోలీస్ వ్యవస్థ మొత్తం మా కార్యకర్తలపై దాడులు చేస్తోంది. కొట్టి, బెదిరించి విత్ డ్రా చేయించారు. కాంగ్రెస్.. పోలీసులను కార్యకర్తల్లా వినియోగించుకుంటోంది. మా కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేస్తే ఊరుకోను. కేంద్రంలో ఉన్నది మా ప్రభుత్వమే.. అన్న విషయం మరిచిపోవద్దు. పోలీసులు ఇప్పటికైనా స్మార్ట్ యాక్టింగ్ ఆపేయాలి. రేవంత్ హేట్ స్పీచ్ బిల్లు పెట్టాలంటున్నారు.. ఆయన సొంత బుర్రతో ఆలోచించకుండా పక్క రాష్ట్రం ఆలోచనను ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నారు. హేట్ స్పీచ్ చట్టం అమలైతే మొదటి కేసు రేవంత్ పైనే పెట్టాలి. గతంలో ఆయన అడ్డగోలుగా మాట్లాడదలేదా?, బీజేపీ పెరుగుతోంది కాబట్టే భయపడి బీజేపీని అడ్డుకోవాలని హేట్ స్పీచ్ తేవాలని చూస్తున్నారు. తెలంగాణలో దొంగలు పోయి దోపిడీ దొంగలు వచ్చారు. పవన్ కల్యాణ్ ప్రచారం షెడ్యూల్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ తో దోస్తీ లేకుంటే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై ఎందుకు విచారణకు ఆదేశించలేదు. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ కాపాడినట్టే కాళేశ్వరం విషయంపై బీఆర్ఎస్‌ను రేవంత్ కాపాడుతున్నారు’ అని విమర్శించారు.


