సాక్షి హైదరాబాద్: గత నెలరోజులుగా రాష్ట్రంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే ప్రస్తుతం సిద్ధిపేట–యాదాద్రి–జనగాం సరిహద్దుల్లో పెద్దపులి సంచారం నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ కీలక సూచనలు చేసింది. రఘునాథపల్లి మండలం మండెలగూడెం శివార్లలో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలిపింది. దీంతో పరిసర గ్రామాల్లో అప్రమత్తత హెచ్చరికలు జారీ చేసింది.
గత నెలరోజులుగా అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బెబ్బులి..మహారాష్ట్ర అడవుల నుంచి రాష్ట్రంలోనికి ప్రవేశించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇదివరకూ జగదేవ్ పూర్ మండలంలో పులి సంచారం జరిగినట్టు ఆనవాళ్లు గుర్తించగా...అంతలోనే అది అక్కడి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో మకాం మార్చింది. రాజపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, ఆలేరు, గుండాల మండలాల్లో సంచరించింది. దానితో పాటు అమ్మనబోలు - అనంతారం గ్రామాల మధ్య ఓ వాగులో స్థానికులకు కంటపడినట్లు తెలిపారు.
ప్రస్తుతం సిద్ధిపేట-యాదాద్రి-జనగాం ప్రాంతాలలో దాని అడుగుజాడలు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏదైనా అత్యవసరమైతే తప్ప ప్రజలు రాత్రిపూట బయిటకి వెళ్లకూడదని.. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఒంటరిగా కాకుండా గుంపులుగా మాత్రమే బయిటకి వెళ్లాలని తెలిపారు. అదే విధంగా పులి సంచారం నేపథ్యంలో రైతులు లైవ్ విద్యుత్ తీగలు పెట్టవద్దని అటవీశాఖ హెచ్చరించింది. పశువులను జాగ్రత్తగా కట్టాలని ఒకవేళ పులి దాడిలో పశువుల నష్టం జరిగితే ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా పరిహారం చెల్లిస్తామని పేర్కొంది.
అయితే గడిచిన 20 రోజుల్లో సుమారు 15 లేగ దూడలను చంపితిన్నట్లు అధికారులు తెలిపారు. అయితే పులిని పట్టుకోవడానికి అధికారులు ఎంత ప్రయత్నం చేస్తున్నా అది వారికి చిక్కడం లేదు. పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారమివ్వాలని అటవీశాఖ తెలిపింది.
అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో సంచరిస్తున్న పులి రోజుకో రూటు మార్చుతూ అధికారులను ముప్పుతిప్పలు పెడుతుంది. దీంతో దానిని పట్టుకోవడం అధికారులకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలో పులిదాడిలో ఇదివరకే అనేక మూగజీవాలు బలైపోయాయి.


