రాష్ట్ర ప్రభుత్వం సదర్ పండుగను గుర్తించడం సంతోషదాయకం
యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వెల్లడి
సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ.. విందు ఆతిథ్యమిచ్చిన అంజన్‌కుమార్
అఖిలేశ్ రెండు రోజుల రాష్ట్ర పర్యటన
సాక్షి, హైదరాబాద్: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎంపీ అఖిలేశ్ యాదవ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారు. లక్నో నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన యాదవ సంఘాల సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. యాదవులు ఏ పార్టీలో ఉన్నా అంతా ఒక్కటిగా కలిసిమెలిసి ఉండాలని చెప్పారు.
అనంతరం అంజన్‌కుమార్ ఏర్పాటు చేసిన విందు ఆతిథ్యంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కొద్దిసేపు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి అఖిలేశ్‌కు రేవంత్ రెడ్డి వివరించారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.
యాదవులకు ఇష్టమైన సదర్ పండుగను ప్రభుత్వం గుర్తించడంపై అఖిలేశ్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని యాదవ సమాజం రేవంత్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని.. తెలంగాణలోని యాదవ సామాజిక వర్గానికి రాజకీయంగా గుర్తింపు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అఖిలేశ్ వెంట ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, అంజన్‌కుమార్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కాంగ్రెస్ సీనియర్ నేత రోహిణ్‌రెడ్డి తదితరులున్నారు.
వారిప్పుడు దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారు..
యాదవ సమ్మేళనం అనంతరం అఖిలేశ్ మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత వందేమాతరం ఆలపించని వారు, మూడు రంగుల జాతీయ జెండాను ఇష్టపడనివారు ఇప్పుడు దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. యూపీలో 3 కోట్ల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, బీజేపీ ఓడిపోయే చోట్ల ఈసీతో కలిసి ఎక్కువ ఓట్లను తొలగించేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. యూపీలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని రాష్ట్రానికి ఆహ్వానించి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడతామని, హైదరాబాద్‌లో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌ను టీవీలో చూస్తానని చెప్పారు.
ఏఐ సమ్మిట్‌కు హాజరు
విజన్ ఇండియా పేరుతో దేశమంతా పర్యటిస్తున్న ఆయన అఖిలేశ్ తాజ్‌కృష్ణలో జరిగే ఏఐ సమ్మిట్‌లో పాల్గొంటారు. విజన్ ఇండియా దేశాభివృద్ధి ప్రణాళికల విషయంలో తన దృక్పథం గురించి వివరించనున్నారు. శనివారం సాయంత్రం అఖిలేశ్ ప్రత్యేక విమానంలో లక్నో తిరిగి వెళ్లనున్నారు.


