జెండాపై ప్రమాణం చేయండి
లేదంటే తీసుకున్న డబ్బులు వాపస్ ఇవ్వండి
మహబూబాబాద్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఘటన
పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో కొందరు ఏదో ఒక రూపంలో తమ అక్కసును వెళ్లగక్కారు. ఓటమిని జీర్ణించుకోలేని ఓ సర్పంచ్ అభ్యర్థి రైతులు పొలాలకు వెళ్లే దారిని మూయించాడు. మరోచోట సర్పంచ్ అభ్యర్థి ఓడిపోగా, ఆమె భర్త ఓటర్లతో ప్రమాణం చేయించడం, ఇచ్చిన డబ్బు తిరిగి ఇమ్మని అడగడం వైరల్ అయింది.
సాక్షి, మహబూబాబాద్: ‘మీరు నా వద్ద డబ్బులు తీసుకున్నారు. కానీ ఓటు వేయలేదు. దీంతో నేను ఓడిపోయాను. నిజంగా నాకు ఓటు వేసినవారు దేవుడి జెండాపై ప్రమాణం చేయండి. లేదంటే నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇవ్వండి’అంటూ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ అభ్యర్థి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకుంటున్న ఘటన మహబూబాబాద్ జిల్లా సోమ్లాతండాలో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సోమ్లాతండా సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్న దళ్‌సింగ్ భార్య కౌసల్య పోటీ చేశారు. అదే తండాకు చెందిన ఇస్లావత్ సుజాత కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల్లో రెబల్ అభ్యర్థి సుజాత గెలిచారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌసల్య భర్త దళ్‌సింగ్ శుక్రవారం తండావాసుల ఆరాధ్య దైవమైన అమర్‌సింగ్ మహరాజ్ జెండా పట్టుకొని.. ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటు వేసినట్టు ప్రమాణం చేయాలని. లేకపోతే.. నా డబ్బులు నాకు ఇవ్వాలని అడిగిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తండాకు తాగునీటి సరఫరా అయ్యే ప్లాంట్ పైపులు పగులగొట్టడం, దేవుడి గుడికి తాళం వేసిన సన్నివేశాలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తమ వద్దకు వచ్చి కాళ్లు పట్టుకొని బతిమిలాడి ఓటు వేయాలని డబ్బులిచ్చారని.. ఇప్పుడు దౌర్జన్యంగా రికవరీ చేస్తున్నారంటూ తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు వచ్చి గొడవను సద్దుమణిగేలా చేశారు.
బాట బంద్ చేయించాడు
ధరూరు: గ్రామస్తులు తనకు ఓటు వేయలేదని...తన పొలం మీదుగా వెళ్లడానికి వీలు లేదంటూ ఓటమి పాలైన ఓ సర్పంచ్ అభ్యర్థి రోడ్డుకు అడ్డంగా మట్టి పోయించాడు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని కోతులగిద్ద గ్రామానికి చెందిన బోయ రంగస్వామి సర్పంచ్ పోటీ చేశాడు. ఆయనతో కలిసి వార్డులకు పోటీచేసిన వారిలో కూడా ఒక్కరూ గెలవలేదు.
దీనిని జీర్ణించుకోలేని రంగస్వామి శుక్రవారం తన పొలం పక్క నుంచి రైతుల పొలాలకు వెళ్లే బాటను బంద్ చేయించారు. దీంతో అటుగా నిత్యం రాకపోకలు సాగించే పలువురు రైతులు రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని తరాలుగా తాము అటుగా వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నామని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మురికికాల్వలో బ్యాలెట్ పేపర్లు
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో బ్యాలెట్ పేపర్‌లు మురికికాల్వలో కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఆవుల సుందరయ్య కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేయగా సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్ మద్దతుదారు రుద్రారపు బిక్షంపై 455 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అయితే, శుక్రవారం పోలింగ్ కేంద్రం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని మురికికాల్వలో.. బీఆర్‌ఎస్ అభ్యర్థి బిక్షం ఎన్నికల గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి ఉన్న బ్యాలెట్ పేపర్‌లను స్థానికులు గుర్తించారు.
దీంతో కత్తెర గుర్తు బ్యాలెట్‌లను లెక్కించకుండానే మురికి కాల్వలో వేశారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అభ్యర్థి రుద్రారపు బిక్షంతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విష యం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ý ంచర్ల భూపాల్‌రెడ్డిలు చిన్నకాపర్తి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ లభ్యమైన బ్యాలెట్ పేపర్‌లను వారు పరిశీలించారు. అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించారు.
నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీడీఓ, అసిస్టెంట్ ఎన్నికల అధికారి జయలక్ష్మితో మాట్లాడి జరిగిన సంఘటనపై వివరాలను సేకరించారు. మురికి కాల్వలో లభ్యమైన బ్యాలెట్ పేపర్లను ఆర్డీఓ అశోక్‌రెడ్డి స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటన లో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. విచారణ అధికారిగా నల్లగొండ ఆర్డీఓను నియమించామని తెలిపారు.
పెదవీడు సర్పంచ్ బరిలో 18 మంది
బ్యాలెట్ పేపర్‌పై మూడు వరుసల్లో గుర్తులు
మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు పంచాయతీ సర్పంచ్ స్థానానికి 18 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. బ్యాలెట్ పేపరులో మొదటి వరుసలో 8 గుర్తులు, రెండో వరుసలో 8 గుర్తులు, మూడో వరుసలో ఇద్దరు అభ్యర్థుల గుర్తులతోపాటు నోటా గుర్తు ముద్రించారు.
ఓటు కోసం
పంచాయతీ ఎన్నికల వేళ దశాబ్దల తర బడి పరిష్కారానికి నోచుకోని బాట సమస్యకు లైన్ క్లియర్ అయింది. మరోవైపు ఓట్ల కోసం ఓ వార్డు అభ్యర్థి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైకి ఎక్కాడు. ఓట్ల కోసం గుట్ట ఎక్కిన మొదటి వ్యక్తి వినోద్ కావడం గమనార్హం.
‘పంచాయతీ’తో పరిష్కారం
» పోలింగ్‌కు ముందే రోడ్డు నిర్మాణం పూర్తి
» నెరవేరిన హన్వాడ రైతుల దశాబ్దాల కల
ఇది మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ–బుద్ధారం నుంచి వ్యవసాయ పొలాలకు వెళ్లే దారి. దీని కోసం దాదాపు 100 కుటుంబాలకు చెందిన రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వారు చేయని ప్రయత్నం లేదు.. కలవని నేతలు లేరు. కానీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి కాదు.. ఇస్నాతి వంశస్తులకు సంబంధించిన పక్కా పట్టా స్థలం. అందులోనూ సాగులో ఉన్న భూమి. పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని ఆ అన్నదాతల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది.
ఆ వంశానికి చెందిన సుధాకర్ కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలబడడం ఆ రైతులకు వరమైంది. తమ పొలాలకు రహదారి వదిలితే వంద మంది రైతు కుటుంబాలు మీకు మద్దతుగా నిలుస్తాయని ప్రతిపాదించడం.. ఇన్నాళ్లూ అంగీకరించని సదరు యజమాని తమ దాయాదులతో మాట్లాడి ఒప్పించడం.. ఆ వెంటనే రైతులు సొంత డబ్బులతో కిలోమీటర్‌కు పైగా (సుమారు ఎకరా) మట్టి రోడ్డు వేయడం చకచకా జరిగింది. వెతుకుతున్న తీగ కాలుకు తగిలినట్టు సర్పంచ్ ఎన్నికలకు ముందే రైతుల సమస్య తీరింది.
రోడ్డును ఆనుకునే 36 ఎకరాల్లో ఇస్నాతి వంశస్తుల వ్యవసాయ భూమి ఉండగా.. దానికి ఆనుకొని వెనుకవైపు 400 ఎకరాల వరకు పంటలు సాగవుతాయని రైతులు చెబుతున్నారు. ఇన్నాళ్లు రోడ్డు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎకరా భూమి రూ.50 లక్షలు పలుకుతోంది. హన్వాడలో రెండో విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. తనకు మద్దతుగా నిలవాలని సదరు సర్పంచ్ అభ్యర్థి వేడుకుంటున్నాడు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
సర్పంచ్‌గా గెలిపిస్తే.. పంచాయతీకి రూ.30 లక్షలు ఇస్తా
మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్ది గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోరుకంటి మధుసూదన్‌రావు తన సొంత డబ్బులు రూ.30లక్షలు వెచ్చిస్తున్నట్టు బాండ్ పేపర్ రాసివ్వడం చర్చనీయాంశమైంది. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని, తనను గెలిపిస్తే ప్రభుత్వ నిధులు వచ్చే వరకు ఎదురు చూడకుండా గ్రామాభివృద్ధికి రూ.30లక్షలు ఇస్తానని చెక్కుతో కూడిన బాండ్ పేపర్ జీపీకి రాసిచ్చాడు. రెండో విడతలో ఆదివారం ఇక్కడ పోలింగ్ జరగనుంది.
20 కిలోమీటర్లు నడిచి.. ఓటు అభ్యర్థించి..
పెనుగోలు గుట్టపైకెళ్లి ప్రచారం చేసిన వార్డు అభ్యర్థి వినోద్
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగాల గ్రామ పంచాయతీ పరిధిలోని పెనుగోలు గ్రామంగుట్టలపై ఉంటుంది. కొంగాలనుంచి మూడవ వార్డుకు పోటీ చేస్తున్న లేగల వినోద్.. పెనుగోలు గ్రామస్తుల ఓట్లు తన వార్డులో ఉండటంతో 20 కిలోమీటర్లు కాలి నడకన గుట్టలపైనున్న పెనుగోలుకు చేరుకున్నాడు. ఓటర్లను తనకు ఓటు వేయాలని కోరాడు. ఈ గ్రామానికి మూడవ విడత ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.
సర్పంచ్‌గా గెలిపిస్తే ఎకరం భూమి ఇస్తాం
బాండ్‌పేపర్‌పై అగ్రిమెంట్ రాసిచ్చిన ఇద్దరు అభ్యర్థులు
భూదాన్‌పోచంపల్లి : సర్పంచ్‌గా గెలిపిస్తే కోటి రూపాయల విలువైన ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని సర్పంచ్ బరిలో దిగిన అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం చిన్న గ్రామపంచాయతీ. ఇక్కడ మొత్తం 546 ఓటర్లు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ స్థానం జనరల్‌కు రిజర్వు అయ్యింది. పంచాయతీ పరిధిలో రసాయన పరిశ్రమలు ఉండటంతో సర్పంచ్ స్థానానికి తీవ్ర పోటీ ఏర్పడింది.
ఇక్కడ కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గుమ్మి జంగారెడ్డి, బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి గుమ్మి నరేందర్‌రెడ్డితోపాటు బీజేపీ నుంచి వస్పరి రాకేశ్ పోటీపడుతున్నారు. తమను సర్పంచ్‌గా గెలిపిస్తే కోటి రూపాయల విలువైన ఎకరం భూమి గుడి నిర్మాణం చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని గుమ్మి జంగారెడ్డి, గుమ్మి నరేందర్‌రెడ్డిలు పోటాపోటీగా బాండ్‌పేపర్లపై అగ్రిమెంట్ రాసి ఇచ్చారు.
నాలుగుసార్లు ఆ కుటుంబానికే సర్పంచ్ పదవి
మెట్‌పల్లిరూరల్ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవి నాలుగు పర్యాయాలు ఒకే కుటుంబానికి వరించింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గూడూరు తిరుపతి ఎన్నికయ్యారు. తిరుపతి భార్య రజిని 2019లో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేసి, గెలుపొందారు. తిరుపతి తండ్రి అప్పట్లో రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు.
తమ్ముడి ఓటమి తట్టుకోలేక..అక్క మృతి
కథలాపూర్(వేములవాడ): జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్‌పూర్ సర్పంచ్‌గా పోటీ చేసిన పోతు శేఖర్ ఓటమిపాలయ్యారు. శేఖర్ గెలవాలని కోరుట్లకు చెందిన అతడి అక్క కొక్కుల మమత(40) కొన్నిరోజులు ప్రచారం చేశారు. తమ్ముడు ఓటమి పాలయ్యాడని తెలియగానే గుండెపోటుకు గురైంది. చికిత్స నిమిత్తం తరలిస్తుండగా శుక్రవారం మార్గమధ్యలోనే మమత మృతి చెందింది.
‘వార్డు’ అభ్యర్థి మృతి
ధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మండలం ధర్మాపూర్ పంచాయతీలోని రెండోవార్డుకు సమ్మని రామయ్య(62) పోటీలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకూ తన వార్డులో ప్రచారం చేశారు. అనంతరం పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా, ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయారు.
ఓడిపోయి.. సెల్‌టవర్ ఎక్కి
రఘునాథపాలెం: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండాకు చెందిన సర్పంచ్ అభ్యర్థి రంగా శుక్రవారం ఉదయం సెల్‌టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్, రెవెన్యూ అధికారులు రంగాతో ఫోన్‌లో మాట్లాడి నచ్చచెప్పగా, మధ్యాహ్నం
రెండు గంటలకు కిందకు దిగొచ్చాడు.
గ్రీన్ మ్యాట్‌తో పోలింగ్ బూత్
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పలు పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలకు సరిపడా తరగతి గదులు లేవు. దీంతో అధికారులు గ్రీన్‌మ్యాట్‌లతో డేరాలు కట్టి పోలింగ్ బూత్‌లు మార్చారు.


