జర్మనీ పార్లమెంట్ బృందంతో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోపాటు రక్షణ, ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఐటీ, రక్షణ, ఔషధ రంగాల్లో పెట్టుబ డులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను జర్మనీకి పంపడంతోపాటు అక్కడి ప్రముఖ లోహ, కార్ల తయారీ రంగాల్లో కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు.
భట్టి విక్రమార్క, మంత్రి డి.శ్రీధర్‌బాబుతో శుక్రవారం ప్రజాభవన్ లో జర్మనీ పార్లమెంటరీ బృందం భేటీ అయ్యింది. జర్మనీ, భారత్ నడుమ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహబంధం భవిష్యత్‌లో మరింత పటిష్టంగా ముందుకు సాగాలని డిప్యూటీ సీఎం అన్నారు. ‘ఐటీ రంగానికి హబ్‌గా పేరొందిన హైదరాబాద్ జర్మనీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంది. ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న స్కిల్స్ వర్సిటీలో జర్మన్ భాషా విభాగం ఏర్పాటు ద్వారా జర్మనీలో ఉద్యోగ, అవకాశాలు మెరుగవుతాయి’అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యం: శ్రీధర్‌బాబు
సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ దూరదృష్టితో ‘సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ‘సైబర్ సెక్యూరిటీ రంగంలో లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా రెండు ఫ్లోర్లు కేటాయించాం. జిల్లాల్లో కూడా సైబర్ సెక్యూరిటీ బృందాలను ఏర్పాటు చేయడంతో ఆర్థిక నేరాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి’అని మంత్రి వివరించారు.
‘తెలంగాణ రైజింగ్ 2047’విజన్ డాక్యుమెంట్‌ను జర్మనీ పార్లమెంటు బృందానికి భట్టి, శ్రీధర్‌బాబు అందజేశారు. సైబర్ సెక్యూరిటీ, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు సంబంధించి తాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరుకుంటున్నట్టు జర్మనీ పార్లమెంటు బృందం ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణలో జర్మనీ పెట్టుబ డులు, బోష్ వంటి ప్రసిద్ధ కంపెనీల కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి.
ప్రతిభావంతులైన విద్యార్థులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు తెలంగాణలో కొదవలేదని జర్మనీ పార్లమెంట్ ప్రతినిధి బృందం కితాబునిచ్చింది. జర్మన్ పార్లమెంట్‌లో క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ ప్రతినిధి జోసెఫ్ ఓస్టర్ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించారు. భేటీలో ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిత్తల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్‌కో సీఎండీ హరీశ్, ప్రణాళిక శాఖ సెక్రెటరీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు పాల్గొన్నారు.


