‘రింగు’కు హంగులు లేవు.. | Regional Ring Road Hyderabad Latest Updates 2025: RRR reduced to level of a regular National Highway due to cost cutting measures | Sakshi
Sakshi News home page

‘రింగు’కు హంగులు లేవు..

Dec 13 2025 5:36 AM | Updated on Dec 13 2025 5:36 AM

Regional Ring Road Hyderabad Latest Updates 2025: RRR reduced to level of a regular National Highway due to cost cutting measures

పొదుపు చర్యలతో సాధారణ నేషనల్‌ హైవే స్థాయికి రీజినల్‌ రింగు రోడ్డు  

సగం వంతెనలు.. సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం.. యాక్సెస్‌ పాత్‌ ఔట్‌ 

రూ.21,550 కోట్ల బడ్జెట్‌ చూసి షాకైన కేంద్రం 

ఓ రింగురోడ్డు సగభాగానికి అంత బడ్జెట్‌ వద్దని హుకుం.. దానిని తగ్గించి పది రోజుల్లో రివైజ్డ్‌ బడ్జెట్‌ రూపొందించాలని ఆదేశం

ఎనిమిది వరుసల రోడ్డు, చమక్కున మెరిసేలా సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థ, రెండు వరుసల సర్విసు రోడ్డు, ఏ చిన్న రోడ్డుకు కూడా క్రాసింగ్‌ ఇబ్బంది లేకుండా కిలోమీటరుకు ఒక వంతెనతో దేశంలోనే అతి పొడవైన తొలి ఎక్స్‌ప్రెస్‌వే రింగురోడ్డుగా నిలిచిపోవాల్సిన ట్రిపుల్‌ ఆర్‌ (రీజినల్‌ రింగురోడ్డు) ఇప్పుడు ఏ ప్రత్యేకతలు లేని సాధారణ జాతీయ రహదారిగా నిర్మాణం కాబోతోంది. ఆ రోడ్డు మీద వాహనాల రద్దీ సాధారణంగానే ఉండబోతోందని ట్రాఫిక్‌ స్టడీ ద్వారా తేల్చి ఎనిమిది వరుసలకు బదులు ఆరు వరుసల రింగురోడ్డే సరిపోతుందని ఇటీవల నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా మరిన్ని ప్రత్యేకతలపై వేటు వేసింది.

సాక్షి, హైదరాబాద్‌:  రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగం (162 కి.మీ. నిడివి)లో మొత్తం 204 వంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. వీటిల్లో జాతీయ రహదారులు, ప్రధాన రాష్ట్ర రహదారులు క్రాస్‌ చేసే 11 ప్రాంతాల్లో భారీ ఇంటర్‌ చేంజ్‌ వంతెనలు ఉంటాయి. మూసీనది మీద వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద, మంజీరానది మీద పుల్కల్‌ మండలం శివ్వంపేట వద్ద, హరిద్రా నది మీద తూప్రాన్‌ వద్ద మూడు పెద్ద వంతెనలుంటాయి. వాగులువంకల మీద 105 సాధారణ వంతెనలు, పంట కాల్వలు, భవిష్యత్‌లో నిర్మించబోయే కొన్ని నీటిపారుదల శాఖ కాలువలు, చిన్న రోడ్లకు సంబంధించి 85 కల్వర్టులుంటాయి.

ప్రతి ముప్పావు కి.మీ.కు ఒకటి చొప్పున ఏదో ఒక నిర్మాణం ఉంటుంది. ఇప్పుడు వీటిని భారీగా తగ్గించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఎన్‌హెచ్‌ఏఐని ఆదేశించింది. సగటున ప్రతి రెండు కి.మీ.కు ఒకటి చొప్పున నిర్మించేలా డిజైన్‌ మార్చి వంతెనల సంఖ్యను తగ్గించాలని పేర్కొంది. వెరసి వాటి సంఖ్యను సగానికి సగం తగ్గించి వంద లోపే ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి వద్ద ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది.

మరో పక్షం రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రభుత్వ,ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ భేటీ అయ్యి ట్రిపుల్‌ఆర్‌ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఈ తరుణంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి ముందస్తు సమావేశం నిర్వహించి రింగురోడ్డు బడ్జెట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తర భాగానికి సంబంధించి భూపరిహారం, రోడ్డు నిర్మాణ వ్యయం, జీఎస్టీ, ఇతర ఖర్చులు మొత్తం కలిపి రూ.21,550 కోట్ల అంచనా వ్యయం ఉంది.

రింగురోడ్డు ఒక భాగానికి ఇంత భారీ వ్యయం సరికాదని, దీన్ని భారీగా తగ్గించాలని ఆదేశించారు. వంతెనల సంఖ్య ఎక్కువగా ఉన్నందున వాటిని సగానికి సగం తగ్గించటం ద్వారా ఖర్చును భారీగా తగ్గించొచ్చని తేల్చారు. వంతెనల సంఖ్య తగ్గితే కొన్ని చిన్న రోడ్లకు రింగురోడ్డును దాటేందుకు వీలుండదు. కొన్ని ప్రాజెక్టులకు ప్రతిపాదించిన నీటి కాలువలకు కూడా ప్రస్తుతం దారి విడవాల్సిన అవసరం లేదని చెప్పారు.  

సెంట్రల్‌ లైటింగ్‌ ఔట్‌... 
ఔటర్‌ రింగురోడ్డు తరహాలో రీజినల్‌ రింగురోడ్డుకు రోడ్డు పొడవునా లైటింగ్‌ వ్యవస్థ ఖరారైంది. కేంద్ర కార్యదర్శి ఆదేశంతో ఇప్పుడు దాన్ని తొలగించారు. పట్టణాలు, పెద్ద గ్రామాలు ఉన్న చోట మాత్రమే జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన తరహాలో సాధారణ లైటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. మిగతా చోట్ల ఎలాంటి లైట్లు ఉండవు. దీంతో ధగధగలాడాల్సిన రింగురోడ్డు సాధారణ రోడ్డు తరహాలో రాత్రి వేళ చిమ్మ చీకట్లలోనే ఉండనుంది.

యాక్సెస్‌ పాత్‌ మాయం  
తొలుత రింగురోడ్డుకు రెండు వరుసల సర్విసు రోడ్డును ప్రతిపాదించారు. నెల రోజుల క్రితం దాన్ని రద్దు చేసి ఆ స్థానంలో సాధారణ యాక్సెస్‌ పాత్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇప్పుడు ఆ యాక్సెస్‌ పాత్‌ను కూడా ఉపసంహరించుకున్నారు. ఏడు మీటర్ల సర్విసు రోడ్డుకు బదులు మూడు మీటర్ల యాక్సెస్‌ పాత్‌ ఉన్నా కొంత ఉపయోగం ఉండేది. కోట గోడ తరహాలో 5 మీటర్ల ఎత్తుతో ఉండే రింగురోడ్డును అనుకొని ఉండే పొలాలు, ఇతర ప్రైవేటు భూముల్లోకి వెళ్లేందుకు వీలుగా ఆ యాక్సెస్‌ పాత్‌ ఉపయోగంగా ఉంటుంది.

సర్వీసు రోడ్డు తరహాలో ఫుత్‌పాత్, మధ్యలో డివైడర్‌ లాంటివి కాకుండా సాధారణ కచ్చా రోడ్డులాగా అది ఉంటుంది. దాని మీదుగా వెళుతూ పక్కనే ఉన్న ప్రైవేటు భూములోకి చేరుకునే వీలుంటుంది. ఇప్పుడు ఆ యాక్సెస్‌ పాత్‌ ఖర్చును కూడా తప్పించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అంటే రింగురోడ్డును ఆనుకొని ఎలాంటి రోడ్డు ఉండదు. కేవలం అంతమేర వదిలిన సాధారణ ఎగుడుదిగుడు ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. అందులో కనీసం కచ్చా రోడ్డు కూడా ఉండదు. వెరసి రింగురోడ్డును ఆనుకొని దిగువ గుండా వాహనాలు ముందుకు వెళ్లే వెసులుబాటు ఉండదు.  

పది రోజుల్లో కొత్త బడ్జెట్‌  
కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి సూచన మేరకు పొదుపు చర్యలు పాటించటం ద్వారా ఎంత మేర బడ్జెట్‌లో కోత పెట్టొచ్చో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు లెక్కలేస్తున్నారు. మరో పదిరోజుల్లో రివైజ్డ్‌ ప్రాథమిక బడ్జెట్‌ను అందజేయాలని కేంద్ర కార్యదర్శి ఆదేశించారు. కొత్త లెక్కలతో మరోసారి భేటీ ఉంటుంది. దానికి ఆయన ఓకే చెబితే.. వెంటనే పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ అప్రైజల్‌ కమిటీ ముందుంచుతారు. ఆ కమిటీ ఓకే చెప్పగానే ఉత్తర రింగు టెండర్లు ఖరారు అవుతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement